అగ్రిగోల్డ్‌ బాధితులకు జగనన్న భరోసా


అమరావతి (ప్రజా అమరావతి);


*అగ్రిగోల్డ్‌ బాధితులకు జగనన్న భరోసా


*


*అగ్రిగోల్డ్‌లో డిపాజిట్‌ చేసి మోసపోయిన బాధితులకు పాదయాత్రలో, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు డిపాజిట్‌దారులకు నగదు చెల్లింపు*


*అగ్రిగోల్డ్‌లో రూ.10వేల లోపు డిపాజిట్‌ చేసి మోసపోయిన 3.86 లక్షల మంది డిపాజిటర్లకు రూ.207.61 కోట్లను, రూ.10 వేల నుంచి రూ.20వేల లోపు డిపాజిట్‌ చేసి మోసపోయిన దాదారు 3.14 లక్షల మంది బాధితులకు రూ. 459.23 కోట్లను, గౌరవ హైకోర్టు నిర్దేశించిన విధంగా మొత్తం 7 లక్షలకు పై చిలుకు అర్హులైన అగ్రిగోల్డ్‌ బాధితులను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గుర్తించి, సీఐడీ ద్వారా నిర్ధారించి రూ.666.84 కోట్లను క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.* *ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:*


ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దాదాపుగా 7లక్షల పైచిలుకు డిపాజిటర్లకు రూ. 666.84 కోట్లు నేరుగా వారి అకౌంట్లలో జమ చేస్తున్నాం. 

మొత్తంగా అగ్రిగోల్డ్‌ బాధితులకు సంబంధించి మొదటి విడత, ఇవాళ ఇస్తున్న రెండో విడత అన్నీ కలుపుకుంటే అక్షరాలా 10.40 లక్షల మందికి రూ.905.57 కోట్లకుపైనే మన ప్రభుత్వం ఇచ్చింది.


*ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ...* 

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ బాధితులకు న్యాయం చేశాం. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం అడుగులు ముందుకేశాం. గత ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే 2015లోనే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయంచేస్తామని చెప్పి మోసం చేశారు. ఆ అగ్రిగోల్డ్‌ బాధితులకు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయంచేస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకుంటున్నాం.  

రూ.20వేల లోపు డిపాజిట్‌చేసిన కుటుంబాలు అన్నింటికీ.. కనీసం ఆ రూ.20వేలైనా తిరిగి ఇచ్చేసే కార్యక్రమం ఈరోజుతో పూర్తిచేస్తున్నాం.


*దేశంలో ఎక్కడా లేని విధంగా...*

దేశంలో ఎక్కడా జరగలేదు.. ఒక ప్రైవేటు కంపెనీ మోసం చేసి ఎగ్గొట్టిన డబ్బును మన ప్రభుత్వమే బాధ్యతగా తీసుకుని పేద ప్రజలు నష్టపోకుండా ఉండాలని, మానవత్వాన్ని చూపుతూ చెల్లించాం.


*అగ్రిగోల్డ్‌ – గత ప్రభుత్వ మనుషుల కోసం జరిగిన స్కాం*

అగ్రిగోల్డ్‌ స్కాం అన్నది ఒక సారి గతంలోకి వెళ్లిచూస్తే... గత ప్రభుత్వం చేత, గత ప్రభుత్వం వల్ల, గత ప్రభుత్వంలో ఉన్న మనుషులకోసం జరిగిన స్కాంగా తేటతెల్లంగా బయటపడింది. గత ప్రభుత్వంలో ఉన్నవారే అగ్రిగోల్డ్‌ ఆస్తులను ఏవిధంగా కొట్టేయాలనుకున్నారో సాక్ష్యాధారాలు చూపిస్తూ గతంలో అసెంబ్లీలో చెప్పాం. గత ప్రభుత్వ హయాంలో వారే కర్త, కర్మ, క్రియగా జరిగిన స్కాం మనకు ఇప్పటికీ గుర్తుంది. ఈ మల్టీ స్టేట్‌ స్కాం అనేక రాష్ట్రాల్లో విచారణలో, కోర్టుల పరిధిలో ఉంది కాబట్టి, దీని వల్ల మన రాష్ట్రంలో ఎవ్వరు నష్టపోయారు? ఎంత నష్టపోయారు?అన్నదానిమీదే ధ్యాసపెట్టాం.


*ఇది కష్ట జీవుల శ్రమ* 

రూపాయి, రూపాయి దాచుకుని కొద్దిగా ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశతో డిపాజిట్‌చేసిన కష్టజీవుల డబ్బే అగ్రిగోల్డ్‌ డబ్బు. ఈ అగ్రిగోల్డ్‌లో డిపాజిట్‌ చేసిన లక్షలాది మంది ఎలాంటి వాళ్లు అంటే... 

కూలిపనులు చేసుకుంటున్నవారు, చిన్న చిన్న వృత్తులు చేసుకున్నవారు, తోపుడు బళ్లు, రిక్షా కార్మికులు.. ఇలాంటి కష్టజీవులందరినీ కూడా గత ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పి... మోసం చేసి, గాలికి వదిలేసింది. 

అలాంటి వారిని ఆదుకోవాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీన్ని గట్టిగా నిలదీయడం దగ్గర మొదలు పెట్టిన అడుగులు ఈ రోజు అధికారంలోకి రాగానే 2019 నవంబరులోనే రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసిన 3.40 లక్షల మందికి  కోర్టు ఆమోదించిన జాబితా మేరకు అప్పట్లో రూ. 238.73 కోట్లు చెల్లించాం.


*అర్హులెవరూ మిగిలిపోకూడదనే...*

ఇంత మందికి డబ్బు చెల్లించినా కూడా అర్హులైన ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదన్న నిశ్చయంతో... వారికి మంచి జరగాలనే ఉద్దేశ్యంతో గతంలో అర్హత ఉండి కూడా జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ (డీఎల్‌ఎస్‌ఏ) జాబితాలో  మిగిలిపోయిన వారిని కూడా గుర్తించాం.  గ్రామ, వార్డు, వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ ద్వారా ఇంటింటికీ వెళ్లి అలాంటి వారిని గుర్తించి మరో 3,86,275 మంది, రూ.10 వేలు లోపు డిపాజిట్‌ చేసిన వారికి కూడా నేడు మంచి జరిగేలా చెల్లింపులు చేస్తున్నాం. వీటికి మరో రూ. 207.61 కోట్లు ఇవాళ డబ్బు ఇస్తున్నాం. దీంతో పాటు రూ.10 వేల నుంచి 20వేల లోపు డిపాజిట్‌చేసి మోసపోయిన దాదాపు 3.14 లక్షలమందికి మరో రూ.459.23 కోట్లు ఇస్తున్నాం.


*హైకోర్టు నిర్దేశించిన విధంగా....*

గౌరవ హైకోర్టు నిర్దేశించి విధంగానే మొత్తంగా దాదాపు 7 లక్షలమందికిపైగా అగ్రిగోల్డ్‌ బాధితులను గ్రామ, వార్డు  సచివాలయాల ద్వారా, పారదర్శకంగా గుర్తించి, సీఐడీ ద్వారా నిర్ధారించి మొత్తం  రూ.666.84 కోట్లు వారి ఖాతాల్లోకి జమచేస్తున్నాం.


*రూపాయి కూడా చెల్లించని గత ప్రభుత్వం*

గత ప్రభుత్వం అరకొర లెక్కల ద్వారా రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన బాధితుల సంఖ్యను 8.79 లక్షల మందిగా తేల్చి చెల్లించాల్సిన మొత్తాన్ని రూ.785 కోట్లుగా తేల్చింది.  ప్రజలను మోసం చేస్తూ  కేవలం ఎన్నికలకు 2 నెలలముందు జీవో నంబరు 31  ఇచ్చారు.

2019 ఫిబ్రవరి 7న జీవో నంబరు 31 ఇచ్చి, రూపాయి కూడా గత ప్రభుత్వం చెల్లించలేదు. వారికి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా గత ప్రభుత్వం ఐదేళ్లపాటు మోసాలు చేస్తూ వచ్చింది. లక్షలాది దినసరి కార్మికులు, చిన్న,చిన్న వృత్తులవారు, రిక్షా కార్మికులందరూ కూడా ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశపడి రూపాయి, రూపాయి డిపాజిట్‌ చేసిన వారిని గత ప్రభుత్వం గాలికొదిలేసింది. 


వారి కష్టాలను చూసి వారికి మంచి జరగాలని మనసారా కోరుకుని మన ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం అర్హులైన 10.40 లక్షల మంది బాధితులందరికీ  రూ.905.57 కోట్లు ఈరోజుతో చెల్లించినట్టు అవుతుంది.


*రాబోయే రోజుల్లో...*

ఇక రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ ద్వారా అగ్రిగోల్డ్‌ వ్యవహారం కోర్టుల్లో ఒక కొలిక్కి రాగానే వారి భూముల్ని, ఆస్తులను అమ్మించి ప్రభుత్వానికి రావాల్సిన డబ్బును తీసుకుని, మిగిలిన డబ్బును డిపాజిట్‌ దారులకు చెల్లించేదిశగా న్యాయపరంగా అడుగులు ముమ్మరంగా వేయడం జరుగుతుంది.


*చివరగా...*

మీ అందరి ఆశీస్సులు వల్ల, దేవుడి దయ వల్ల మీ సోదరుడు ఈ పనిచేయగలుగుతున్నాడు. మీ ఆశీస్సులు మన అందరి ప్రభుత్వం మీద కలకాలం ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నానని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు. 


అనంతరం అర్హులైన 7 లక్షల పై చిలుకు అగ్రిగోల్డ్‌ బాధితులకు కంప్యూటర్‌లో బటన్‌ నొక్కడం ద్వారా వారి ఖాతాల్లో రూ.666.84 కోట్లను సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ డిపాజిట్‌ చేశారు. 


ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పాముల పుష్పశ్రీవాణి, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్‌ అండ్‌ బి మంత్రి ఎం శంకరనారాయణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ,  సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, సీఐడీ అడిషనల్‌ డీజీపీ పీ వీ సునీల్‌ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.