- రాష్ట్రంలోని అంగన్‌వాడీ స్కూళ్ళలో అధునాతన సౌకర్యాలను కల్పిస్తున్న సీఎం జగన్
- గుడివాడ నియోజకవర్గానికి రూ. 5.80 కోట్లు
- కేంద్రాల నిర్మాణం, మరమ్మతులను పూర్తిచేస్తాం
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, ఆగస్టు 24 (ప్రజా అమరావతి): రాష్ట్రంలోని అంగన్ వాడీ స్కూళ్ళలో సీఎం జగన్మోహనరెడ్డి అధునాతన సౌకర్యాలను కల్పిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో అంగన్‌వాడీ స్కూళ్ళ మరమ్మతులపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగా నియోజకవర్గంలో అంగన్ వాడీ కేంద్రాల నిర్మాణం, మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ. 5.80 కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. అంగన్ వాడీ భవనాలకు పూర్తిస్థాయి మరమ్మతులు చేస్తున్నామని చెప్పారు. కాగా అంగన్‌వాడీ స్కూళ్ళకు శాశ్వత భవనాలతో పాటు విద్యుత్, మరుగుదొడ్ల సౌకర్యం తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అంగన్ వాడీ స్కూళ్ళను ప్రభుత్వం త్వరలో వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్ళుగా మార్చనుందని తెలిపారు. చిన్నారులు స్వేచ్ఛగా చదువుకునేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. మన అంగన్‌వాడీ నాడు - నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్ళలో సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 55 వేల 607 అంగన్ వాడీ స్కూళ్ళు ఉ న్నాయని చెప్పారు. వీటిలో 28 వేల 169 స్కూళ్ళకు ప్రభుత్వ భవనాలు ఉన్నాయని తెలిపారు. 2010 వ సంవత్సరానికి ముందు నిర్మించినవి కావడంతో చాలా వరకు మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రస్తుతం 27 వేల 438 అంగన్ వాడీ స్కూళ్ళు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయన్నారు. వీటిలో 3 వేల 928 నూతన భవన నిర్మాణాలు 2016 నుండి వివిధ దశల్లో నిలిచిపోయి ఉన్నాయన్నారు. అసంపూర్తిగా ఉన్న భవనాలను వెంటనే పూర్తిచేయాలని సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశించడంతో ఆ మేరకు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఇందు కోసం ప్రభుత్వం రూ.214 కోట్లను కేటాయించిందన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ ద్వారా రూ. 29.17 కోట్లతో మరుగుదొడ్ల నిర్మాణాలు జరుగుతాయన్నారు. కొత్తగా 8 వేల అంగన్ వాడీ భవనాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. పిల్లలు ఆడుకునేందుకు, ఆహారం తీసుకునేందుకు వీలుగా ఈ భవన నిర్మాణాలు ఉంటాయని తెలిపారు. కొత్తగా మంజూరైన భవన నిర్మాణాలు, అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలు కూడా పూర్తయితే కొత్తగా 11 వేల 928 భవనాలు వినియోగంలోకి వస్తాయన్నారు. దీంతో ఇంకా 15 వేల 510 అంగన్ వాడీ స్కూళ్ళు మాత్రమే అద్దె భవనాల్లో ఉంటాయన్నారు. అంగన్ వాడీ కేంద్రాల సేవలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోందన్నారు. గతంలో ఉన్న అద్వాన పరిస్థితులను చక్కదిద్ది తల్లీబిడ్డలకు ఉపయోగపడే కేంద్రాలుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోందన్నారు. రాష్ట్రంలోని 55 వేల 607 అంగన్‌వాడీ కేంద్రాల్లో మొత్తం 32 లక్షల 59 వేల 042 మందికి అందించే పౌష్టికాహారం, ఇతర సేవలను వైఎస్సార్ సంపూర్ణ పోషణ యాప్ లో ఎప్పటికపుడు అప్ డేట్ చేస్తున్నారన్నారు. ఈ విద్యాసంవత్సరం నుండి అంగన్ వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యా విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసిందని మంత్రి కొడాలి నాని తెలిపారు.
addComments
Post a Comment