కరోనా వ్యాప్తి చెందకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం.

 కరోనా వ్యాప్తి చెందకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం*


*: ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్కు ధరించాలి*


*: జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్*


 ధర్మవరం, ఆగస్టు 04 (ప్రజా అమరావతి) : 


కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని రకాలుగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ పేర్కొన్నారు. బుధవారం ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎఫ్ ఏకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోవిడ్ బాధిత నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ, కరోనా అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 8 లక్షల మందికి మొదటి డోస్ వ్యాక్సిన్ వేయడం జరిగిందన్నారు. రెండో డోస్ వ్యాక్సిన్ ఇంకా ఎక్కువ మంది వేసుకోవాలని, రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకో వలసిన వారు పీహెచ్సీలకు వెళ్తే వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. కరోనా మూడో దశ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. తల్లులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని, గర్భిణీ స్త్రీలకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందని, జిల్లాలో 40 వేల మంది వరకు గర్భిణీలుండగా, 10 వేల మందికి వ్యాక్సిన్ వేశామని, మిగిలిన గర్భిణీ స్త్రీలు వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. ఈనెల 16వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ వేయడం జరిగిందన్నారు.

కరోనా నేపథ్యంలో ప్రతి వారం ఫీవర్ సర్వే నిర్వహించాలని, కరోనా లక్షణాలు కలిగిన వారిని గుర్తించాలన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్కు ధరించాలన్నారు. కరోనా అవగాహన కార్యక్రమాలు విరివిగా నిర్వహించి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించేలా చూడాలన్నారు. మాస్కును కూడా కరెక్ట్ గా ఉపయోగించాలని, మాస్కు కరెక్ట్ గా ధరించకపోతే ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ఇబ్బందిగా ఉన్నా సరే మాస్కు కవచం లాంటిదని తప్పనిసరిగా వాడాలన్నారు. ఇంతకుముందు కరోనా వచ్చి వెళ్ళింది, టీకా తీసుకున్నాం కరోనా రాదు అనే నిర్లక్ష్యం వద్దని, కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించి ప్రతిఒక్కరు ఆరోగ్యంగా ఉండాలన్నారు. కరోనా వ్యాప్తిని మీరు, మీ కుటుంబసభ్యులు ప్రతి ఒక్కరికి చెప్పి కరోనా పెరగకుండా చూడాలన్నారు. కరోనా నివారణకు ఆస్పత్రి సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, డాక్టర్లు, అధికారులు అందరూ కష్టపడి పని చేస్తున్నారని, ప్రతి ఒక్కరు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని, కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని సూచించారు.

ఈ సందర్భంగా మాస్కును దరిద్దాం.. కరోనాని అరికడదాం, సామాజిక దూరం పాటిద్దాం.. శానిటైజర్ వినియోగిద్దాం అంటూ నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ధర్మవరం పట్టణంలోని షాపుల ముందు, ఆటోలకు కరోనా నివారణ పోస్టర్ లను అతికించారు. తదనంతరం పొట్టి శ్రీరాములు సర్కిల్లో మానవహారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీంద్ర, ఏఎఫ్ ఏకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి, తహసీల్దార్ నీలకంఠారెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, డిఎస్పీ రమాకాంత్, ఆసుపత్రి డాక్టర్ లు, సిబ్బంది, ఏఎన్ఎంలు, నర్సులు, తదితరులు పాల్గొన్నారు.



Comments