వైసీపీలో సస్పెన్స్‌గా మారిన అభ్యర్థుల ఎన్నిక.

 *వైసీపీలో సస్పెన్స్‌గా మారిన అభ్యర్థుల ఎన్నిక*గుంటూరు (ప్రజా అమరావతి);


 నగరపాలకసంస్థ కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక తేదీ సమీపిస్తుండటంతో వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ నెల 27వ తేదీన ఉదయం 10.30 గంటలకు కో-ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకొనేందుకు ప్రత్యేక పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసినట్లు కార్పొరేటర్లకు ఇప్పటికే నోటీసులు పంపించారు. దీంతో ఔత్సాహికులు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోన్నారు. జనరల్‌ కోటాలో ఎవరెవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఇప్పటికే స్పష్టత రాగా మైనార్టీ కోటాలో ఒక పురుషుడు, ఒక మహిళని ఎన్నుకోవాల్సి ఉంది. ఇందుకోసం పోటీ తీవ్రంగా ఉంది.


జనరల్‌ కోటాలో ఐదుగురు మాజీ కార్పొరేటర్లు దరఖాస్తు చేసుకొన్నట్లు ప్రకటించారు. వారిలో వంజరపు రత్నకుమారి, పూనూరి నాగేశ్వరరావు, షేక్‌ రహీమున్నీసా, ఆల సాంబశివరావు, మోతుకూరి వెంకట బాలత్రిపుర సుందరి ఉన్నారు. ఈ ఐదుగురిలో ఆల సాంబశివరావు, మోతుకూరి వెంకట బాలత్రిపుర సుందరి ఎన్నిక లాంఛనమేనన్న చర్చ వైసీపీలో జరుగుతోంది. మైనార్టీ కోటాలో ఖరారు చేసే పదవుల ఆధారంగా జనరల్‌ కోటాలో మూడో అభ్యర్థి ఎంపిక ఆధారపడి ఉన్నట్లు సమాచారం. 


మైనార్టీ కోటాలో ఒక మహిళని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే అసలైన మెలిక నెలకొని ఉన్నది. ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె ఒక్కరే దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఆ జాబితా ప్రకారం ముస్తఫా కుమార్తెకు మైనార్టీ కోటాలో పదవి ఖాయంగా కనిపిస్తోంది. కాగా మరో పదవికి కోబాల్డ్‌పేటకు చెందిన పటాన్‌ సైదాఖాన్‌కి వైసీపీలో ఒక వర్గం నాయకులు మద్దతిస్తున్నారు. మరోవైపు షేక్‌ మస్తాన్‌ షరీఫ్‌కి మరో వర్గం అండగా ఉంది. వీరిలో సైదాఖాన్‌కి పదవి వస్తే జనరల్‌ కోటాలో పూనూరి నాగేశ్వరరావుకు లైన్‌ క్లియర్‌ అవుతుంది. అదే జరిగితే మస్తాన్‌ షరీఫ్‌కి ఈసారి కూడా మొండిచెయ్యే. కాగా మైనార్టీ కోటాలో అభ్యర్థుల ఎంపిక సంక్లిష్టంగా మారడంతో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకొన్న వారి జాబితాని గోప్యంగా ఉంచుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఒక పద్ధతి ప్రకారం జరగడం లేదన్న విమర్శలు వస్తోన్నాయి. దీని దృష్ట్యా ఆయా నోటిఫికేషన్లపై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసేందుకు పలువురు సంసిద్ధమయ్యారు.