- కాలుష్యరహిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
- గుడివాడలో మోహిత్ మోక్ష మోటార్స్ ప్రారంభం
- ఎలక్ట్రిక్ బైక్ షోరూంను ప్రారంభించిన మంత్రి కొడాలి నాని
గుడివాడ, ఆగస్టు 23 (ప్రజా అమరావతి): కాలుష్యరహిత వాహనాల వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. సోమవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని న్యూ బైపాస్ రోడ్డులో ఉన్న వలివర్తిపాడు సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన మోహిత్ మోక్ష మోటార్స్ ఎలక్ట్రిక్ బైక్ షోరూంను మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. మంత్రి కొడాలి నాని సోదరుడు కొడాలి చిన్ని, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని పూర్ణవీరయ్య, గుడివాడ ఆర్టీవో బీ వెంకట మురళీకృష్ణ, మిత్ర సొల్యూషన్స్ మేనేజింగ్ పార్టనర్ ఆదిత్య కృష్ణంరాజులు జ్యోతి ప్రజ్వలన చేశారు. మంత్రి కొడాలి నాని పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సహారా ఎవోల్స్ సంస్థ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ బైక్, ఎలక్ట్రిక్ రిక్షాలను విక్రయించే మోహిత్ మోక్ష మోటార్స్ ఎలక్ట్రిక్ బైక్ షోరూంను గుడివాడ పట్టణంలో నూతనంగా ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డీజిల్, పెట్రోల్ ఉత్పత్తుల ధరలు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయన్నారు. మరోవైపు కాలుష్యం కూడా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోందన్నారు. ఈ పరిస్థితులు భవిష్యత్ తరాలకు మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యుడు పెట్రోల్ ను కొనలేని పరిస్థితులు ఈ న్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ బైక్, ఎలక్ట్రిక్ రిక్షాలను వినియోగించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఒకవైపు పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాల్సి ఉందన్నారు. మరోవైపు వినియోగదారులపై భారం పడకుండా ఉండాలంటే ఎలక్ట్రిక్ బైక్ లను వినియోగించడమే ఏకైక మార్గమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఎలక్ట్రిక్ బైక్ ల పై లైఫ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులను రద్దు చేసిందన్నారు. దీనివల్ల ఎలక్ట్రిక్ బైక్ ల వినియోగం పెరుగుతుందని, తద్వారా వినియోగదారుల ప్రయాణ ఖర్చులు భారీగా తగ్గుతాయన్నారు. ఎలక్ట్రిక్ బైక్, ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ రిక్షాలకు మూడేళ్ళ వారంటీ కూడా ఉందన్నారు. వీటిలో లిథియం అయాన్ బ్యాటరీని వినియోగించడం జరిగిందని, ఇది దీర్ఘకాలం పనిచేస్తుందన్నారు. నిర్వహణ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయని, బ్యాటరీ పాడైన వెంటనే మార్చుకునే సౌలభ్యం ఉంటుందన్నారు. బైక్ కొనుగోలు చేసేవారు ఎలక్ట్రిక్ బైక్స్ వైపు దృష్టి పెట్టాలని, తద్వారా సమాజానికి మంచి చేకూరుతుందన్నారు. గుడివాడ పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు మోహిత్ మోక్ష మోటార్స్ ను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే ఎలక్ట్రిక్ బైక్ షోరూంను గుడివాడ పట్టణంలో అందుబాటులోకి తీసుకువచ్చిన షోరూం నిర్వాహకులు జీ విశ్వనాథరాజు, పీ రాజేష్ ను మంత్రి కొడాలి నాని అభినందించారు. అనంతరం తొలి బైక్ కొనుగోలుదారుకు తాళాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాలడుగు రాంప్రసాద్, గిరిబాబాయ్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment