- పేదవాని సొంత ఇంటి కలను సాకారం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి
- క్షేత్ర స్థాయి అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి గృహనిర్మాణాలను త్వరతగతిన పూర్తి చెయ్యాలి..
...రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ,ఆగస్టు, 13 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటిని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్ట్రాత్మకంగా 30.70 లక్షల మందికి ఇళ్లస్థలాలతో పాటు ఇంటిని నిర్మిస్తూ పేదవాని సొంతఇంటి కలను సాకారం చేస్తున్నారన్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) అన్నారు.
కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం అమలుపై జిల్లా జాయింటు కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ కె. మాధవీలత అధ్యక్షతన గుడివాడ డివిజనల్ స్థాయి సమావేశం జరిగింది. జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) శ్రీవాసు నుపూర్ అజయ్ కుమార్, శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు, కైలే అనిల్ కుమార్, ఆర్డీవో శ్రీనుకుమార్ లతో కలసి నిర్వహించిన డివిజన్ స్థాయి సమావేశంలో మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ క్షేత్ర స్థాయి అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ద్వారా అర్హులందరకీ పక్కా గృహాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పేదలందరికీ ఇళ్లు పధకం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మానస పుత్రికని, అటువంటి గొప్ప పధకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు గ్రామ, మండల స్థాయిలోని అధికారులందరు కలసికట్టుగా కృషి చేయాలన్నారు. ఈ పధకం కింద మంజూరైన ఇళ్ల గ్రౌండింగ్ పనులను నూరు శాతం ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణ లబ్దిదారులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్లు నిర్మించుకునే లబ్దిదారునికి ఇంటి నిర్మాణం నిమిత్తం రూ. 1.80 లక్షల రుపాయలు నగదు ప్రభుత్వం ఇస్తుందని, వీటితోపాటు ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను కూడా ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఐరన్, సిమ్మెంట్ తదితర నిర్మాణ సామాగ్రిని సబ్సిడీపై అందిస్తున్నామన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవీలత సమీక్షిస్తూ జిల్లాలో 3.5 లక్షల మంది నిరు పేదలకు ఇళ్ల స్థలాలను అందించడం చారిత్రాత్మకమైన విషయం అన్నారు. అటువంటి చారిత్రాత్మక ఘటనలో మనమందరం భాగస్వాములు కావడం అదృష్టంగా భావించాలన్నారు. డివిజన్ పరిదిలోని గుడివాడ, కైకలూరు, పామర్రు నియోజకవర్గాల్లో మొదటి దశలో 30,184 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు 20, 610 ఇళ్ల గ్రౌండింగ్ పూర్తయ్యిందని, మిగిలిన వాటిని వెంటనే గ్రౌండింగ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణంలో లబ్దిదారులపై భారం పడకూడదనే లక్ష్యంతో డ్వాక్రా సంఘాల సభ్యులైన మహిళలకు అదనంగా 50 వేల రూపాయలు బ్యాంకుల ద్వారా రుణంగా కూడా అందించనున్నామన్నారు. ఇళ్లు నిర్మించుకునే లబ్దిదారులకు వారు నిర్మించుకునే వైశాల్యాన్ని అనుసరించి, ప్రతీ వారం చెల్లింపులు జరుపుతామని, ఈ విషయంలో లబ్దిదారులకు అధికారులు పూర్తి స్థాయి భరోసా అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ, హౌసింగ్ అధికారులు సమన్వయంతో గ్రామాలకు వెళ్లి లబ్దిదారులకు ప్రభుత్వం అందించే ప్రతీ అంశంపై అవగాహన కలిగించాలన్నారు. అవసరమైన చోట్ల లేఅవుట్లలో ఎన్.ఆర్.ఇ.జీ.ఎస్ ద్వారా మెరక పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. గుడివాడ డివిజన్ లో మొత్తం 401 లేఅవుట్లు మంజూరయ్యాయని, వాటిలో 229 లేఅవుట్లలో గ్రౌండింగ్ పూర్తి కాగా 19 వివిధ దశల్లో ఉన్నాయన్నారు. అదేవిధంగా 383 అంతర్గత రహదారులు, 26 అప్రోచ్ రోడ్లను నిర్మిస్తున్నామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తు లక్ష్యాన్ని సాధించామన్నారు. జిల్లా జాయింటు కలెక్టరు (హౌసింగ్) శ్రీవాసు నుపూర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో పేదలందరికీ ఇళ్లు పధకం కింద ఇంతవరకు లక్ష ఇళ్లకు ఒకేసారి శంఖుస్థాపన కార్యక్రమాలు చేసి రికార్డు సృష్టించామన్నారు. ఈ పధకంలో ఇళ్లు నిర్మించుకునే వారికి అవసరమైన ఇసుకను ఉచితంగా అందిస్తున్నామన్నారు. అదేవిధంగా ఇళ్ల నిర్మాణ సమయంలో నీటి కొరత లేకుండా బోర్లు, పైపులైన్ల నిర్మాణంలో మిగిలిన వాటిని మూడు రోజుల్లో పూర్తి చెయ్యాలన్నారు. పేదలందరికీ ఇళ్లు పధకంలో అర్హులైనరైనా మిగిలి ఉంటే వెంటనే దగ్గరలోని గ్రామ/వార్డు సచివాలయాలలో ధరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, కొత్తగా ఇళ్ల స్థలాల కోసం వచ్చిన ధరఖాస్తులను ఆన్ లైన్ లో వెంటనే రిజిష్టరు చేయాలన్నారు. పామర్రు శాసనసభ్యులు అనిల్ కుమార్ మాట్లాడుతూ పామర్రు మండలంలో 50 శాతం మెరక పనులు పూర్తయ్యాయన్నారు. మిగిలిన పనులు ఉపాధిహామీ ద్వారా పూర్తి చేసేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఇళ్లు నిర్మాణంలో మూడు ఆప్షన్లపై మండల స్థాయి అధికారులు లబ్దిదారులకు గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. పామర్రులో ఇంకా రెండు లే అవుట్లకు సంబందించి ల్యాండ్ ఎక్విజిషేన్ ప్రక్రియ పూర్తిచేయాల్సిఉందన్నారు.
కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ నిరుపేదల స్వంత ఇంటి కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. కైకలూరు నియోజకవర్గంలో కొన్ని లేఅవుట్లలో అధనంగా మెరక లెవెలింగ్ పనులు చేపట్టాల్సి ఉందని, వీటిని ఎన్ఆర్ఇజిఎస్ ద్వారా పూర్తి చెయ్యాలన్నారు. ముదినేపల్లి మండలంలోని సంఘర్షణపురం, సింగరాయపాలెం గ్రామాల్లో రెండవ పేజ్ లో నిర్మించే ఇళ్లకు సంబందించి భూసేకరణ చేయాల్సివుందన్నారు.
గుడివాడ అర్భన్ లో నిర్మించే ఇళ్ళకు సంబందించి బీటీ రోడ్డు వేయాలని మున్సిపల్ కమిషనర్ సంపంత్ కుమార్ జాయింట్ కలెక్టరుకు వివిరించారు. నందివాడ మండలంలో 21 లేఅవుట్లకు గాను 11 లేఅవుట్లకు లెవలింగ్ పనులు చేపట్టాల్సిఉందని, మట్టి కొరత కారణంగా జాప్యం జరిగిందని త్వరలోనే లెవిలింగ్ పనులు పూర్తి చేస్తామని తాహశీల్థార్ మస్తాన్ జాయింట్ కలెక్టరుకు వివరించారు.
కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనుకుమార్, హౌసింగ్ పీడీ రామచంద్రన్, డ్వామా పీడీ సూర్యనారాయణ, హౌసింగ్ ఈఈ శ్రీదేవి, డీఈ రామోజీ నాయక్ డివిజన్ పరిధిలోని తాహశీల్థార్లు, యంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment