*రమ్య హత్య ఘటన చాలా బాధాకరం: హోంమంత్రి సుచరిత*
గుంటూరు (ప్రజా అమరావతి); జీజీహెచ్‌లో *బీటెక్ విద్యార్థిని రమ్య* మృతదేహాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత పరిశీలించారు. తర్వాత మంత్రి సుచరిత.. రమ్య కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీటెక్ విద్యార్థిని రమ్యను హత్య చేయడం బాధాకరమని అన్నారు. హంతకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారని తెలిపారు. ఘటనకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా సేకరించారని పేర్కొన్నారు.
హత్య చేసిన వ్యక్తి కోసం పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నారని వెల్లడించారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని కఠినంగా శిక్షిస్తామని, మహిళను హత్య చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రమ్య కుటుంబానికి న్యాయం చేస్తామని, రమ్య హత్య విషయం తెలియగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారని తెలిపారు. రమ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. హత్య చేసిన వ్యక్తికి ఉరి వేయాలని అందరూ అంటున్నారని, కచ్చితంగా అలాంటి శిక్షలు పడేటట్లు చర్యలు తీసుకుంటామని మంత్రి సుచరిత తెలిపారు.
addComments
Post a Comment