రాఖీ పౌర్ణమి విశిష్టత

 *రాఖీ పౌర్ణమి విశిష్టత


*, 


  రక్షాబంధన్.. సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ. రక్షాబంధన్ పండుగను రాఖీ పండుగ అని, రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. అన్నా చెల్లెళ్ళు , అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ. ఈ సంవత్సరం ఈ పండుగ ఆగస్ట్ 22 న వస్తుంది.


సోదర సోదరీమణుల మధ్య అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి

ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ భారతదేశాలలోని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ రాఖీ కట్టి ఎప్పుడూ అన్నకు అండగా చెల్లెలు ఉంటుందని చెప్తుంది. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడూ చెల్లెలికి రక్షగా ఉంటానని ఈ పండుగ ద్వారా తెలియజేస్తారు. ఇంతటి విశిష్టమైన రాఖీ పండుగను ఎందుకు జరుపుకుంటారు. రాఖీ పండుగను జరుపుకునే ఆచారం ఎలా మొదలైంది ? ఆ చరిత్ర ఏంటి ? అనేది తెలుసుకుందాం


రక్షా బంధనం జరుపుకునే ఆచారానికి మూలమే ఈ కథ

పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కర కాలం పాటు యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు, తన పరివారం అంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడని , భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచించి రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించి ముందుకు పంపుతుంది. అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను అత్యంత భక్తితో పూజించి రక్షను దేవేంద్రుడు చేతికి కడుతుంది. ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా వెళ్ళిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు. ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధనం. అప్పటినుండి ఇప్పటివరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగగా మారింది.

ద్రౌపది కృష్ణుల మధ్య అనురాగాన్ని తెలిపే రక్షా బంధనం కథ

ఇక నాటి నుండే ఈ పండుగ ఆచారంగా కొనసాగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథ మాత్రమే కాదు రక్షాబంధనం గురించి ఇంకా బోలెడన్ని పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీకృష్ణుడు శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడు చూపుడువేలుకు గాయం కావడంతో అది గమనించిన ద్రౌపతి తన పట్టు చీర కొంగు చూపి కృష్ణుడి చేతికి కట్టు కట్టిందట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపతి హామీ అందుకు ప్రతిగా దుశ్శాసనుడు దురాగతం నుండి ఆమెను శ్రీకృష్ణుడు కాడా కాపాడారని పురాణాలు చెబుతున్నాయి.

బలి చక్రవర్తికి రాఖీ కట్టిన లక్ష్మీ దేవి ... మహా శక్తివంతం రక్షా బంధనం

అంతే కాదు శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళలోకానికి వెళ్లిన ఉండిపోగా, విష్ణు తీసుకువెళ్లడానికి వచ్చిన లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రక్షాబంధనాన్ని కట్టి , రక్షాబంధనాన్ని కట్టిన తనకు రక్షణ కల్పించమని లక్ష్మీదేవి బలిచక్రవర్తిని కోరుతుంది. బలి చక్రవర్తి సోదరుడిగా తనకు రక్షాబంధనాన్ని కట్టిన సోదరికి బహుమానంగా విష్ణుమూర్తిని పంపుతాడు. దీంతో లక్ష్మీదేవి తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది. అంతటి శక్తివంతమైన బంధనం కాబట్టి రక్షాబంధనానికి ఇంతటి చరిత్ర ఉంది. ఈనాటికీ ప్రతి ఒక్కరు రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో జరుపుకునే ఈ పండుగను మన దేశ వ్యాప్తంగా సోదరులు సోదరీమణులు తమ మధ్య ఉన్న ప్రేమానురాగాలకు ప్రతీక గా జరుపుకుంటారు.

Comments