ఫౌండేషన్ స్థాయి నుండి విద్యార్థుల సమగ్ర వికాసమే ప్రభుత్వ లక్ష్యం
 


- ఫౌండేషన్ స్థాయి నుండి విద్యార్థుల సమగ్ర వికాసమే ప్రభుత్వ లక్ష్యం 


- గుడివాడ నియోజకవర్గానికి రూ. 14.85 కోట్ల నిధులు 

- మన బడి నాడు - నేడు ద్వారా మౌలిక సదుపాయాల కల్పన 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, ఆగస్టు 26 (ప్రజా అమరావతి): ఫౌండేషన్ స్థాయి నుండి విద్యార్థుల సమగ్ర వికాసమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో మన బడి నాడు - నేడు కార్యక్రమం అమలు తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ మన బడి నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా గుడివాడ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణకు రూ.14.85 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. ఈ నిధులతో మొదటి విడత ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, మంచినీటి సరఫరా, మేజర్, మైనర్ రిపేర్లు, పూర్తిస్థాయి విద్యుద్దీకరణ, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్ల ఏర్పాటు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఫర్నీచర్, గ్రీన్ చాక్ బోర్డులు, పాఠశాల మొత్తం పెయింటింగ్, ఇంగ్లీష్ ల్యాబ్, వంట గది, ప్రహరీగోడ తదితరాలను నిర్మించామన్నారు. రెండవ దశ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఇదిలా ఉండగా పిల్లల సమగ్ర వికాసానికి బోధనలో అనేక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమానికి 2020-21 విద్యా సంవత్సరం నుండి నాంది పలుకుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్కృతిని తెలిపేలా పాఠ్యపుస్తకాల రూపకల్పన జరగనుందని తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో పుస్తకాల ముద్రణను ప్రభుత్వం చేపట్టనుందని చెప్పారు. నూతన విద్యా విధానంలో ఆరు రకాల స్కూళ్ళు రానున్నాయని వివరించారు. ప్రభుత్వం విద్యాశాఖలో ప్రారంభించిన జగనన్న అమ్మ ఒడి, మన బడి నాడు - నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద వంటి కార్యక్రమాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. విద్యార్థుల సమగ్ర నైపుణ్యం, పఠనా సామర్ధ్యంలో అతి తక్కువ నైపుణ్యాలు ఉన్నట్టుగా 2017 లో నేషనల్ అచీప్ మెంట్ సర్వే తేల్చిందని, దీంతో 2019 లో ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీ విద్యారంగంలో కనిష్ఠంగా ఉన్న ప్రమాణాలు, విద్యార్థుల్లో తగ్గిపోతున్న అభ్యాస ఫలితాలపై అధ్యయనం చేయడంతో పాటు వాటిని పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను సమర్పించిందన్నారు. అలాగే బడి మానేసిన పిల్లలను తగ్గించడానికి సరైన ప్రణాళికలను కూడా ప్రభుత్వం రూపొందించిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా విధానంపై గత రెండేళ్ళుగా ఉద్యోగ సంఘాలు, మేథావులు, విద్యారంగ ప్రముఖులు, ఇతర భాగస్వామ్య పక్షాలతో పలు దఫాలుగా చర్చలు జరిపామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల విద్యా కమిటీల ప్రతినిధులతో నేరుగా సమావేశమై జాతీయ విద్యా విధానంపై సమగ్రమైన అవగాహన కల్గించే ప్రయత్నం చేశామన్నారు. విద్యార్థులకు మెరుగైన అవకాశాలు లభించాలంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పోటీ పడాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. దీంతో ప్రస్తుతం అమల్లో ఉన్న సిలబస్ తో పాటు పరీక్షా విధానాన్ని కూడా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొడాలి నాని చెప్పారు.