ద్వారకా తిరుమలను దర్శించిన పీపీ సింధు తండ్రి రమణ

 ద్వారకా తిరుమలను దర్శించిన పీపీ సింధు తండ్రి  రమణ

ఏలూరు (ప్రజా అమరావతి)


: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని పీవీ సింధు తండ్రి పీవీ రమణ సందర్శించారు. ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా ఆమె తండ్రి ద్వారకా తిరుమల స్వామివారిని దర్శించారు. ముందుగా ఆలయ అధికారులు ఆయనకు గౌరవ స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి, అమ్మవార్లకు పీవీ రమణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖమండపంలో వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం పలికి, స్వామివారి శేష వస్త్రం కప్పి  ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈవో సుబ్బారెడ్డి ప్రత్యేకంగా ఒలింపిక్స్‌లో భారత దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టిన పీవీ సింధుని  అభినందిస్తూ స్వామివారి మేమంటోను అందజేశారు. ఈ సందర్భంగా పీవీ సింధు తండ్రి పీవీ రమణ మాట్లాడుతూ టోక్యో ఒలింపిక్స్‌లో సింధుకి కాంస్య పతకం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. గతంలో స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఒలింపిక్స్‌లో మెడల్ రావాలని మొక్కుకున్నానని చెప్పారు. ఇప్పుడా మొక్కు తీర్చుకోవడానికి వచ్చానని తెలిపారు. సింధుకి మీడియా చాలా బాగా సపోర్ట్ ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులతో సహా అందరూ సింధుని అభినందించడం ఆనందంగా ఉందన్నారు. ఒలింపిక్స్‌కు వెళ్లేటప్పుడు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒలింపిక్  మెడల్ సాధించుకు రావాలని చెప్పారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగానే సింధూ మెడల్ సాధించిందన్నారు. మంగళవారం సాయంత్రం సింధు ఢిల్లీకి చేరుకుంటారని ఈ లోపు తమ ఇష్టదైవమైన ద్వారకా తిరుమల చిన వెంకన్న, రాట్నాలమ్మ దర్శనానికి వచ్చానని పీపీ రమణ పేర్కొన్నారు.

Comments