తిరుమల, ఆగస్టు 24 (ప్రజా అమరావతి);
తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణ చక్కగా ఉండాలి
- ఐఐటి నిపుణుల సూచనలతో మరింత మెరుగైన శానిటేషన్
- టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణలో రాజీ పడకూడదని టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలన భవనంలోని తన చాంబర్‌లో మంగళవారం ఆరోగ్య విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలకు వేలాదిగా విచ్చేసే భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరిశుభ్రతపై ఎక్కువ దృష్టి సారించాలన్నారు. ప్రస్తుతం ఉదయం 5 గంటలనుండి తిరుమలలో రోడ్లను శుభ్రం చేస్తున్నారని, దానిని తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రారంభించాలన్నారు. తద్వారా ఉదయానికల్లా రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచేందుకు వీలవుతుందన్నారు. తిరుమలలోని ఆరోగ్య విభాగానికి చెందిన 7 వార్డుల్లో తగినంత మంది పారిశుద్ధ్య సిబ్బంది, వర్కర్లు ఉన్నారని, వారిపై మేస్త్రీలు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పక్కా ప్రణాళికతో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. పరిశుభ్రత విషయంలో చిన్న ఫిర్యాదులు కూడా రాకుండా జాగ్రత వహించాలని చెప్పారు. రోడ్లపై కుప్పలుగా ఉండే చెత్తను డస్టు బిన్లు, గన్ని బ్యాగ్స్ ద్వారా ఎప్పటికప్పుడు సేకరించి తరలించాలని ఆదేశించారు.
ముఖ్యంగా రెండు ఘాట్ రోడ్లలో వచ్చే చెత్తను రెండురోజులకోసారి యంత్రాల సహాయంతో శుభ్రం చేయాలన్నారు. ప్రస్తుతం ఆరోగ్య విభాగం ఉపయోగిస్తున్న యంత్రాలు వాడుకుంటూ, ఆధునిక యంత్ర పరికరాల కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. విధి నిర్వహణలో ఉన్న శానిటరి సిబ్బందికి ఎలాంటి ప్రమాదాలు కలుగకుండా వారికి రేడియం జాకెట్లు అందివ్వాలన్నారు.
తిరుమలలో పరిశుభ్రతను మరింత మెరుగుపర్చడానికి ఐఐటి నిపుణులను ఆహ్వానించి వారి సూచనలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఐఐటి వారి సహకారంతో టిటిడి ఆరోగ్య విభాగంకు ఎంత మంది సిబ్బంది అవసరం, ప్రమాణాలు, యంత్ర పరికరాలు తదితర అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించి అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఆరోగ్య విభాగంకు సంబంధించి వివిద ప్రాంతాల్లో పరిశుభ్రత ఏవిధంగా ఉన్నది, సిబ్బంది అటెండెన్స్ తదితర అంశాలను పరిశీలించడానికి టిటిడి సీనియర్ అధికారులకు భాధ్యతలు అప్పగించాలన్నారు. వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య సిబ్బందికి బయో మెట్రిక్ అటెండెన్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తిరుమలలో అధిక రద్ధీ ప్రాంతాల్లో, ఇతర ప్రాంతాల్లో రోజువారి శానిటేషన్ ఏవిధంగా జరుగుతున్నది, భక్తుల నుండి వస్తున్న స్పందన ఏమిటి, భవిష్యత్తులో ఆరోగ్య విభాగంకు అవసరమైన యంత్ర పరికరాలపై ఈవో సమీక్షించారు.
సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఎఫ్ఏ అండ్ సిఏవో శ్రీ బాలాజి, ఆరోగ్య విభాగం అధికారి డా.సునీల్ సమావేశంలో పాల్గొన్నారు.
addComments
Post a Comment