వరదల నేపధ్యంలో బోటింగ్ జరగకుండా నిరంతర పర్యవేక్షణ.



*వరదల నేపథ్యంలో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష*


*వరదల నేపధ్యంలో బోటింగ్ జరగకుండా నిరంతర పర్యవేక్షణ*


*పర్యాటక ప్రాంతాల్లో ఆదాయం పెంచే మార్గాలపై ప్రణాళికలు*



విజయవాడ (ప్రజా అమరావతి);



రాష్ట్రంలోని గోదావరి, కృష్ణా నది వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పర్యాటక శాఖ ఉన్నత అధికారులతో విజయవాడలోని బరం పార్క్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజిత్ భార్గవ్ , ఏపీ టూరిజం డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ఎండి, ఏపీ టూరిజం అథారిటీ సీఈఓ సత్యనారాయణ ఇతర ఉన్నత అధికారులతో జరిగిన సమీక్షలో మంత్రి పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం వరదల నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం

పర్యాటక ప్రాంతాల్లో బోటింగ్ జరగకుండా బోట్ ఆపరేటర్లు ప్రభుత్వ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించేలా చూడాలన్నారు. ఈమేరకు ఆయా ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షించేలా జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు, సంబంధిత అధికారుల సమన్వయంతో  పని చేయాలన్నారు. వరదల నేపథ్యంలో పర్యాటక ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో వరదలు తగ్గుముఖం పట్టేంత వరకూ బోటింగ్ జరగకుండా చూడాలని అన్నారు.


రాష్ట్రంలోని పర్యాటక శాఖ హోటల్స్, రిసార్ట్స్ లు, సంబంధిత ప్రదేశాల్లో నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నిర్వహణ సరిగలేని ప్రదేశాల్లో సంబంధిత నిర్వహకులపై చర్యలు తీసుకోవాలన్నారు. టూరిజం ప్రదేశాల్లో ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని.. ఇందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. టెంపుల్ టూరిజంలో భాగంగా తిరుపతికి మాత్రమే కాకుండా వివిధ పుణ్యక్షేత్రాలకు టూరిస్ట్ ప్యాకేజీలను పెంచాలని అన్నారు.  బెంగుళూర్ నుంచి గండికోట, హైదరాబాద్ నుంచి గండికోటతోపాటు  ఇతర ప్రాంతాలకు టూరిస్ట్ ప్యాకేజీలు సిద్ధం చేయాలని అన్నారు. రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా మార్చేందుకు అపార అవకాశాలు ఉన్నాయని.. వాటిని సమగ్రంగా వినియోగించుకోవాలని అన్నారు. ఈసమావేశంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



Comments