*- గోబర్ ధన్ పథకం పై రాష్ట్రాలతో కేంద్రమంత్రి వీడియో కాన్ఫెరెన్స్*
*- విసిలో పాల్గొన్న మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి*
*- ఎపిలో వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక కార్యచరణ*
*- గోబర్ గ్యాస్, సేంద్రియ ఎరువుల ఉత్పత్తికి ప్లాంట్ల ఏర్పాటు*
*- పైలెట్ ప్రాజెక్ట్ అమలు కోసం 4 జిల్లాల ఎంపిక*
*- రాష్ట్రస్థాయిలో అపెక్స్, అడ్వయిజరీ కమిటీల ఏర్పాటు*
*- గోబర్ ధన్ కోసం ప్రతి జిల్లాకు రూ.50 లక్షలు*
*: మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి*
*అమరావతి*
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాల్లో పశు, వ్యవసాయ వ్యర్థాల నుంచి సంప్రదాయేతర ఇంధన వనరులు, సేంద్రియ ఎరువుల ఉత్పత్తి కోసం కేంద్రప్రభుత్వం నిర్ధేశించిన గోబర్-ధన్ పథకంను పైలెట్ ప్రాజెక్ట్ గా నాలుగు జిల్లాల్లో అమలు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో అగ్రో రిసోర్స్ (గోబర్) ధన్ పథకంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ అధికారులతో కలిసి కేంద్రమంత్రి శ్రీ గజేంద్రసింగ్ షెకావత్ వివిధ రాష్ట్రాలకు చెందిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. క్యాంప్ కార్యాలయం నుంచి ఈ వీడియో కాన్ఫెరెన్స్‌లో పాల్గొన్న మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో గోబర్ ధన్ పథకం కింద పశు వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలను కూడా సరైన పద్దతుల్లో వినియోగించుకునేందుకు ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ఒక కార్యచరణను రూపొందించినట్లు వెల్లడించారు. కృష్ణ, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్ట్ గా ఈ పథకంను అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. గోబర్ ధన్ పథకం అమలులో భాగంగా రాష్ట్ర స్థాయిలో అపెక్స్, అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలో వ్యవసాయ, పశుసంవర్థక, పాల ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో ఈ పథకంను ముందుకు తీసుకువెళ్ళేందుకు కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కమిటీలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యుఎస్ విభాగాలు సమన్వయం చేస్తాయని వివరించారు.
ఘన వ్యర్థాలను శుద్ది చేయడం, సేంద్రీయ ఎరువులుగా మార్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మాగాంధి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 10,645 సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనిలో ఇప్పటికే 1042 సెంటర్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఈ సెంటర్లలో ఘన వ్యర్థాలను వర్మీకంపోస్ట్ గా మార్చి, వ్యవసాయ అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కనీసం యాబై కంటే అధికంగా పశువులు వున్న 54 గోశాలలు, 55 భారీ డెయిరీ ఫాంలను గోబర్ గ్యాస్ ఉత్పత్తి కోసం గుర్తించడం జరిగిందని తెలిపారు. తాజాగా కేంద్రప్రభుత్వం నిర్ధేశించిన మేరకు సాంకేతిక ఏజెన్సీలను గుర్తించి, ఈ పథకం అమలును ముందుకు తీసుకుపోతున్నామని అన్నారు. ఈ పథకం అమలు కోసం డిపిఆర్‌లను సిద్దం చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, అక్కడి నుంచి వచ్చే ప్రతిపాదనలు రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలించి, నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అంతేకాకుండా ఈ పథకం కింద ఏర్పాటు చేసే ప్లాంట్‌ల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్, కంపోస్ట్‌లను మార్కెట్ చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గోబర్ ధన్ పథకం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ప్రతి జిల్లాకు యాబై లక్షల రూపాయల చొప్పున కేటాయింపులు చేస్తున్నామని, అదనపు సదుపాయాల కోసం అవసరమైతే ఎన్‌ఎన్‌బిఓఎంపి, పదిహేనో ఆర్థిక సంఘం నిధులను కూడా వినియోగిస్తామని తెలిపారు. వ్యక్తిగత గృహాల మోడల్, క్లస్టర్ మోడల్, కమ్యూనిటీ మోడల్, కమర్షియల్ మోడళ్లలో ఈ పథకాన్ని విస్తరిస్తామని వివరించారు.
వీడియో కాన్ఫెరెన్స్‌లో స్వచ్ఛంద్ర కార్పోరేషన్ ఎండి సంపత్‌కుమార్ కూడా పాల్గొన్నారు.
addComments
Post a Comment