రాష్ట్రస్థాయిలో ప్రతిభ కరబరిచిన వారు జాతీయ పోటీలకు ఎంపిక


                                                                                                       


ఎపిఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీలు ప్రారంభం

కెఎల్ యూనివర్సిటీలో నైపుణ్య పోటీలను ప్రారంభించిన సజ్జల రామకృష్ణారెడ్డి

32 విభాగాల్లో 397 మంది రాష్ట్రస్థాయి పోటీలకు హాజరు

రాష్ట్రస్థాయిలో ప్రతిభ కరబరిచిన వారు జాతీయ పోటీలకు ఎంపికఅమరావతి (ప్రజా అమరావతి):

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించారని.. అందులో భాగంగానే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు వీలుగా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కెఎల్ డిమ్డ్ టుబి యూనివర్సిటీలో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి నైపుణ్య పోటీలను సజ్జల రామకృష్ణారెడ్డి, ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ సలహాదారు చల్లా మధుసూదన్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ఎపిఎస్‌ఎస్‌డిసి బంగారరాజులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. 

ఈ నైపుణ్య పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా 22వేలకు పైగా రిజిస్ట్రేషన్ చేసుకోగా.. జిల్లా, జోనల్ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 397 మందిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వారందరికీ కెఎల్ యూనివర్సిటీసహా 9 వేదికల్లో పోటీలు మంగళవారం ప్రారంభం అయ్యాయి.  కెఎల్ యూనివర్సిటీలో 8 విభాగాలతోపాటు డెమో స్కిల్క్ విభాగంలో ప్రాంతీయ నైపుణ్యాలయిన కొండపల్లి బొమ్మలు, తోలు బొమ్మలాట, దుర్గి రాతి శిల్పం, ఏటికొప్పాక బొమ్మలు, ఉదయగిరి చెక్క వస్తువులు, కళంకారి అద్దకం, అల్లికల తయారీ స్టాళ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 


ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..  టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందినా.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్ డేట్స్ వస్తూ ఉంటాయని.. వాటిని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగాలన్నారు. సాంప్రదాయ నైపుణ్యాలకు కూడా సాంకేతికతను జోడించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఉద్దేశ్యంతోనే అంతర్జాతీయస్థాయిలో నైపుణ్య పోటీలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. చిన్నచిన్న దేశాలు కూడా క్రీడల్లో, నైపుణ్య శిక్షణలో చాలా ముందున్నాయని.. మన దేశంలో కూడా క్రీడలతోపాటు నైపుణ్యాలపైనా ఇంకా అవగాహన పెరగాల్సిన అవసం ఉందన్నారు. 

గ్లోబలైజేషన్ మొదలైన తర్వాత.. మనం అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడకపోతే వెనుకబడి పోతామన్న భావన కలిగిందని.. అందుకే ప్రభుత్వాలు కూడా విద్యావ్యవస్థలోనే నైపుణ్యాలు పెంపొందించేలా సిలబస్ లను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎపిఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో రాష్ట్రం 25 స్కిల్ కాలేజీలు, ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు.  మూస ధోరణిలో కాకుండా యువత ఆసక్తికి తగ్గట్టుగా శిక్షణ ఇవ్వడం, ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం అని సజ్జల అన్నారు.  రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీలకు 22వేల మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకుని పాల్గొనడం ఆనందించదగ్గ విషయమని.. జాతీయస్థాయిలోనూ మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి మంచి ప్రాతినిథ్యం ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు. రాబోయే నైపుణ్య పోటీల కోసం ఇప్పటి నుంచే యువతను సిద్ధం చేసి రాష్ట్రం తరుఫున ప్రపంచస్థాయిలో సత్తా చాటేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటే బాగుంటుందని ఆయన సూచించారు.   

నైపుణ్యాభివృద్ధి శిక్షణాశాఖ సలహాదారు చల్లా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు వచ్చే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని.. అందులో భాగంగానే 25 స్కిల్ కాలేజీలు, స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామన్నారు.  


అనంతరం ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీలు జరుగుతున్నాయని.. ఈ పోటీల్లో పాల్గొన్నవారు మంచి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయికి ఎంపికై రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. 


అనంతరం కెఎల్ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు కోనేరు లక్ష్మణ్ హావీష్ మాట్లాడుతూ, తమ విశ్వవిద్యాలయంలో ఇలాంటి పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. విద్యార్థులలో ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులను ఎదుర్కొనేందుకు తమ విశ్వవిద్యాలయం సిద్ధంగా ఉందని తెలిపారు. తమ విశ్వవిద్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ కు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసయడంతోపాటు, విద్యార్థులను యువ పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు మరింత కృషి చేస్తున్నామన్నారు. 


ఈ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ సలహాదారు చల్లా మధుసూదన్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి ఎన్ బంగారరాజు, స్టేట్ ఎంగేజ్మెంట్ ఆఫీసర్, సిటిజన్ ఎంగేజ్మెంట్ (ఎపి, తెలంగాణ) ఎన్ఎస్‌డిసి వి. ప్రశాంత్,  కెఎల్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ కోనేరు లక్ష్మణ్ హవిష్, కెఎల్ యూనివర్సిటీ వైస్ చాన్సులర్  పార్థసారధి వర్మ, ఎపిఎస్‌ఎస్‌డిసి, కెఎల్ యూనివర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు.