ఇళ్ళ నిర్మాణ ప్రగతిపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న మంత్రి కొడాలి నాని



- ఇళ్ళ నిర్మాణ ప్రగతిపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న మంత్రి కొడాలి నాని


 



గుడివాడ, ఆగస్టు 30 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఇళ్ళనిర్మాణ ప్రగతిపై రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన దాదాపు 12 వేల గృహాల నిర్మాణాల పురోగతిపై సోమవారం మంత్రి కొడాలి నాని మరోసారి సమీక్ష జరిపారు. గత జూలై 1, 3, 4 తేదీల్లో గుడివాడ పట్టణం, నందివాడ, గుడ్లవల్లేరు, గుడివాడ రూరల్ మండలాల్లో నిర్వహించిన మెగా గ్రౌండింగ్ మేళాలో భాగంగా పెద్దఎత్తున గృహనిర్మాణాలకు శంఖుస్థాపన కార్యక్రమాలను కూడా పూర్తిచేశారు. అయితే గృహనిర్మాణాల ప్రగతిపై నియోజకవర్గంలోని మండలాల వారీగా హౌసింగ్, రెవెన్యూ, ఆర్‌డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులతో మంత్రి కొడాలి నాని స్వయంగా సమీక్షా సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టర్లు ముందుకు వచ్చిన ప్రాంతంలో వెంటనే గ్రౌండింగ్ పనులను చేపట్టాలని ఆదేశించారు. ప్రతి నెలా చివరిలో ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చే ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలంలోని 22 గ్రామాల్లో 27 లేఅవుట్లు వేశామని, వీటిలో 1,578 మంది లబ్ధిదారులకు ఇళ్ళపట్టాలను పంపిణీ చేశామన్నారు. వీరిలో 1,478 గృహనిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్నారు. మరో 430 సొంత పట్టా భూముల్లో ఇళ్ళ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చామని, ఇప్పటి వరకు 166 గృహాల గ్రౌండింగ్ పూర్తయిందన్నారు. గుడ్లవల్లేరు మండలంలో 2 వేల 280 ఇళ్ళపట్టాలను కేటాయించామన్నారు. మొదటి విడతలో ఏడు గ్రామాల్లో వేసిన ఏడు లేఅవుట్లలో 725 గృహాలను నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతులను మంజూరు చేసిందన్నారు. ఇప్పటి వరకు 62 గృహాల గ్రౌండింగ్ పూర్తయిందన్నారు. మరో 23 లేఅవుట్లలో 2 వేల 070 గృహాల నిర్మాణాలకు కూడా ప్రభుత్వం అనుమతులను ఇచ్చిందన్నారు. వీటితో పాటు 400 సొంత పట్టా భూముల్లో ఇళ్ళ నిర్మాణాలకు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. గుడివాడ రూరల్ మండలంలో 24 లేఅవుట్లు వేశామని, 1,301 లబ్ధిదారులకు ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. మరో 270 మంది పట్టా భూముల్లో ఇళ్ళను నిర్మించుకునేందుకు ముందుకు రావడంతో అనుమతులు ఇచ్చామన్నారు. 40 గృహాలకు సంబంధించి గ్రౌండింగ్ పూర్తంయిందన్నారు. గుడివాడ పట్టణానికి సంబంధించి రూరల్ మండలం మల్లాయిపాలెం పరిధిలోని లేఅవుట్లో 5 వేల 594 గృహాల నిర్మాణానికి అనుమతులు ఇచ్చామన్నారు. వీటితో పాటు సొంత పట్టా భూములు కల్గిన 240 మందికి కూడా ఇళ్ళ నిర్మాణాలకు అనుమతులను మంజూరు చేశామన్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి మ్యాపింగ్, రిజిస్ట్రేషన్, జాబ్ కార్డుల జారీ, జియో ట్యాగింగ్ దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. ఇళ్ళ నిర్మాణ సామాగ్రి కోసం నిర్వహించిన రివర్స్ టెండరింగ్ వల్ల రూ. 5, 120 కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. ఒక్కో ఇంటి నిర్మాణ సామాగ్రి కొనుగోలులో దాదాపు రూ.32 వేలు ఆదా అయ్యాయన్నారు. లబ్ధిదారుల నిర్మాణ సామాగ్రిని పంపిణీ చేస్తున్నామని, ఇందు కోసం ప్రత్యేక యాప్ ను ప్రభుత్వం రూపొందించిందన్నారు. నిర్మాణ సామాగ్రిని సమకూర్చడంలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలన్న సీఎం ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తున్నామన్నారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి డీపీఆర్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా కల్పించాలని సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశించారని మంత్రి కొడాలి నాని తెలిపారు.

Comments