గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా

 


- గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా 


- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 



గుడివాడ, ఆగస్టు 26 (ప్రజా అమరావతి): విశాఖపట్నం గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. గురువారం విశాఖపట్నం గాజువాక జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోయిలాడ పరశురాం, కాకి రాము, పితాని ప్రసాద్, గుత్తా మూలా గిరిబాబు, పిజ్జా మనోజ్, బాలు, శిరీష, రత్నం, శారద, కుమార్, విజయ్, జాన్ వరబాబు, శంకర్, జగన్నాథం, సునీల్, వసంత్, దాసు, రవి, సురేష్,  మూర్తి, జగన్ తదితరులు మంత్రి కొడాలి నానికి వినతి పత్రాన్ని పంపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్ట్ సమస్యలపై విశాఖపట్నం గాజువాకలో గత కొద్ది రోజులుగా రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో దిన, వార, పక్ష, మాస పత్రికల్లో పనిచేస్తున్న అర్హత కల్గిన జర్నలిస్టు అందరికీ అక్రిడిటేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. చిన్న పత్రికలకు జీఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వాలన్నారు. జర్నలిస్టు అందరికీ ఇళ్ళస్థలాలను మంజూరు చేయాలని, ఆరోగ్య బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలన్నారు. 60 ఏళ్ళ వయస్సు పైబడిన జర్నలిస్టు రూ. 10 వేలు పెన్షన్ ఇవ్వాలన్నారు. స్థానిక పత్రికలకు కూడా ప్రకటనలు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. చిన్న పత్రికలకు న్యూస్ ప్రింట్ ను రాయితీపై ఇవ్వాలని, జర్నలిస్ట్ లకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలన్నారు. కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున నష్టపరిహారాన్ని అందించి ఆదుకోవాలన్నారు. జర్నలిస్ట్ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని వారు కోరారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గత తొమ్మిది రోజులుగా గాజువాకలో జర్నలిస్టు చేస్తున్న రిలే దీక్షల విషయాన్ని సీఎం జగన్మోహనరెడ్డికి వివరిస్తానని చెప్పారు.

Comments