- రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్ పెన్షన్ కానుక పంపిణీ
- తెల్లవారుజాము నుంచే పింఛన్లను పంపిణీ ప్రారంభించిన వాలంటీర్లు
- 59.18 లక్షల మంది పెన్షనర్ల కోసం రూ.1382.62 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
- సాయంత్రం 6.30 గంటల వరకు 88.92శాతం మందికి పెన్షన్ల పంపిణీ పూర్తి
- మూడు రోజుల్లో నూరుశాతం పెన్షన్ల పంపిణీ
- పలుచోట్ల జోరు వానలోనూ కొనసాగిన పెన్షన్ల పంపిణీ
- వాలంటీర్ల సేవలను అభింనందించిన మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అమరావతి (ప్రజా అమరావతి):
ప్రతినెలా ఒకటో తేదీనే సామాజిక, వైద్య పెన్షన్లను లబ్ధిదారుల చేతికే అందించాలన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సంకల్పంలో భాగంగా బుధవారం పెన్షన్ల పంపిణీ తెల్లవారుజాము నుంచే ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 2.66 లక్షల మంది వాలంటీర్లు లబ్ధిదారుల గడప వద్దకే వెళ్ళి, పెన్షనర్లకు వారికి రావాల్సిన సొమ్మును వారి చేతికే అందించే కార్యక్రమాన్ని కొనసాగించారు. సాయంత్రం ఆరున్నర గంటల వరకు మొత్తం 88.92 శాతం పెన్షన్ సొమ్మును లబ్ధిదారులకు అందించారు. ఆగస్టు నెల పెన్షన్ కింద ప్రభుత్వం రూ.1382.62 కోట్ల రూపాయలను కేటాయించింది. సెప్టెంబర్ ఒకటో తేదీనే ఈ సొమ్మును మొత్తం 59,18,685 మంది లబ్ధిదారుల చేతికే అందించేందుకు ముందురోజే సచివాలయాల స్థాయిలో కార్యదర్శుల ఖాతాలకు ఈ సొమ్మును ప్రభుత్వం జమ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల జోరుగా వర్షాలు కురుస్తున్నా కూడా వాలంటీర్ల సైన్యం పెన్షనర్లకు ఫించన్ సొమ్మును అందించే కార్యక్రమానికి ఎక్కడా విరామం ఇవ్వలేదు. ఉత్సాహంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించారు. బుధవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయానికే 52,62,993 మంది లబ్ధిదారులకు 1228.77 కోట్ల రూపాయల మేర పెన్షన్ల మొత్తాలను పంపిణీ పూర్తి చేశారు. మొత్తం మూడు రోజుల్లో పెన్షన్లను నూరుశాతం పంపిణీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు వాలంటీర్లు పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. పెన్షన్ల పంపిణీలో రాష్ట్రస్థాయి మంత్రులు, ఉన్నతాధికారుల నుంచి జిల్లా, మండల, పంచాయతీ స్థాయి అధికారులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, పలు వ్యాధులతో బాధపడుతున్న వారిని సామాజికంగా, ఆర్థికంగా ఆదుకునేందుకు సీఎం శ్రీ వైయస్ జగన్ అందిస్తున్న వైయస్‌ఆర్ పెన్షన్ కానుక నెల మొదటి రోజునే వారి చేతికి అందించే క్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే పింఛన్ల పంపిణీని మాత్రం ఖచ్చితంగా నెరవేర్చాలనే లక్ష్యంతో అధికార యంత్రాంగం పనిచేస్తోంది.
సాయంత్రం ఆరున్నర గంటల వరకు అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 91.96 శాతం, వైయస్‌ఆర్ కడప జిల్లాలో 90.97 శాతం, పశ్చిమ గోదావరిజిల్లాలో 90.93 శాతం, విజయనగరం జిల్లాలో 90.82 శాతం, నెల్లూరు జిల్లాలో 90.49 శాతం, కృష్ణాజిల్లాలో 89.81 శాతం, గుంటూరు జిల్లాలో 88.75 శాతం, అనంతపురం జిల్లాలో 88.48 శాతం, తూర్పుగోదావరిజిల్లాలో 87.87 శాతం, కర్నూలు జిల్లాలో 87.62 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 87.07 శాతం, ప్రకాశం జిల్లాలో 86.20 శాతం, విశాఖపట్నం జిల్లాలో 86.14 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయ్యింది. ఒకవైపు వర్షాలు జోరుగా కురుస్తున్నా, మొక్కవోని లక్ష్యంతో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీలో చూపిన కృషిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనులు, గ్రామ సచివాలయాల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందించారు.
addComments
Post a Comment