అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయంపై ప్రభుత్వ నిర్ణయం

 అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయంపై ప్రభుత్వ నిర్ణయం 

త్వరలో సినిమా నిర్మాతలు,డైరెక్టర్లు,డిస్ట్రిబ్యూటర్లు,ధియేటర్ యజమానులతో సమావేశం

ఈఅంశంపై సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుగుతున్నాయి,త్వరలో సియం సమక్షంలో సమావేశం

ఆన్లైన్ టికెట్ల విక్రయంతో అధిక ధరలు,బ్లాక్ టికెట్లు అమ్మకం,ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను ఎగవేతను అరికట్టవచ్చు

తెలుగు సినీపరిశ్రమకు అనేక ప్రోత్సాహకాలు,పరిశ్రమను రాష్ట్రానికి తెచ్చేందుకు కృషి

రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)

అమరావతి,14 సెప్టెంబరు (ప్రజా అమరావతి):రాష్ట్రంలో సినిమా టికెట్లను ఆన్లైన్ ద్వారా విక్రయించే అంశాన్ని సినిమా పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు,డిస్ట్రిబ్యూటర్లు,ధియేటర్ల యజమానులు తదితరుల అందరి అభిప్రాయాలు,సూచనలు తీసుకున్నాక దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు,రవాణా శాఖామాత్యులు పేర్ని వెంకట్రామయ్య(నాని)స్పష్టం చేశారు.ఈమేరకు మంగళవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈఅంశం ప్రస్తుతం సినీ తదితర సంబంధిత వర్గాలతో సంప్రదింపుల స్థాయిలో ఉందని అందరి అభిప్రాయాలు,సూచనలు,సలహాలు తీసుకున్నతర్వాత సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయంపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని మంత్రి పునరుద్ఘాటించారు.కొన్ని నెలల క్రితం తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి సినిమా టికెట్లు ఆన్లైన్ ద్వారా విక్రయం సహా పలు అంశాలపై ఒక విజ్ణాపను ముఖ్యమంత్రి వారికి అందించడం జరిగిందని మంత్రి నాని చెప్పారు.దీనిపై త్వరలో ముఖ్యమంత్రి వర్యుల సమక్షంలో సినిమా పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడం జరగుతుందని చెప్పారు.ఆన్లైన్ విధానంలో సినిమా టికెట్లు విక్రయంతో టికెట్ల విక్రయంలో పాదర్శకత పెంపొందుతుందని తద్వారా బ్లాక్ టికెట్లు అమ్మకం నివారణ,అధిక ధరలకు టికెట్ల అమ్మకం వంటివి నివారించడం తోపాటు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను ఎగవేతను నివారించవచ్చని మంత్రి నాని పేర్కొన్నారు.

సినిమా టికెట్ల ఆన్లైన్ విధానం అమలులోకి వస్తే అటు ప్రజలకు ఇటు సినిమా పరిశ్రమకు,ప్రజలకు అన్ని విధాలా ప్రయోజనం కలుగుతుందని మంత్రి పేర్ని వెంకట్రామయ్య చెప్పారు.రైల్వే టికెట్లు ఐఆర్ టిఎస్ ద్వారా విక్రయిస్తున్న విధంగానే,బస్సు టికెట్లు రెడ్ బస్, సినిమా టికెట్లు బుక్ మై షో ద్వారా విక్రయిస్తున్న విధంగానే సినిమా టికెట్లను కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఆన్లైన్ ద్వారా అమ్మితే ప్రజలకు,ప్రభుత్వానికి అందరికీ మేలుకలుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.తెలుగు సినీ ప్రరిశమను మరింత ప్రోత్స హించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలు తీసుకుంటూ ఇప్పటికే వివిధ రాయితీలను ప్రకటించడం జరిగిందని సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య పేర్కొన్నారు.అలాగే తెలుగు చిత్ర పరిశ్రమను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు కూడా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

సినిమా టికెట్లను ఆన్లైన్ ద్వారా విక్రయించాలనే ఆలోచన ఇప్పటిది కాదని గత రెండు దశాబ్దాలుగా నడుస్తున్నవ్యవహారమని ఈసందర్భంగా మంత్రి నాని గుర్తు చేశారు. 2002 సంవత్సరంలో సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయంపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఒక లేఖ వ్రాయడం జరిగిందని అన్నారు.2003లో విజయవాడకు చెందిన విశ్వ మీడియా ఎంటర్ ప్రైజెస్,2004లో విశాఖకు చెందిన గెలాక్సీ ఎంటర్ ప్రైజెస్ లు ఆన్లైన్ టికెట్ల విక్రయానికి ముందుకు వచ్చాయని 2006 ప్రభుత్వం ఆన్లైన్ టికెట్ల విక్రయంపై గెజిట్ కూడా ప్రచురణ చేయడం జరిగిందని చెప్పారు.నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయం,బ్లాకు టికెట్ల అమ్మకం నిరోధానికు 2008 ఏప్రిల్ 8వతేదీన ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 35 ద్వారా ఆదేశాలు జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు.2009లో జిఓఎంఎస్ సంఖ్య 110 ద్వారా గెలాక్సి ఎంటర్ ప్రైజెస్ కు అనుమతి ఇచ్చినా ఈప్రక్రియ మొదలు చేయలేక పోయిందని మంత్రి గుర్తు చేశారు.ఆన్లైన్ సినిమా టికెట్ల విక్రయంపై 2017లో అప్పటి ప్రభుత్వం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని నియమించిందని,అలాగే 2017లో జిఓఆర్టి సంఖ్య 1816 ద్వారా హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఎఫ్ డిసి చైర్మన్,ఎండి,తెలుగు సినీ పరిశ్రమ చైర్మన్ తదితరులుతో కమిటీనీ ఏర్పాటు చేసిందని చెప్పారు.2018 సం.లో ఆకమిటీ ఆన్లైన్ టికెట్ల అమ్మకానికి ఆమోదం తెలిపిందని మంత్రి నాని గుర్తు చేశారు.2020 అక్టోబరు 22న ఆర్ధికశాఖ కార్యదర్శి,ఎఫ్ డిసి చైర్మన్,ఎపిటిఎస్ తదితర ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించాక దీనికి ఆమోదం తెలిపారని చెప్పారు.

అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఆన్లైన్ విధానంలో సినిమా టికెట్ల అమ్మకం చేపట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే దీనిపై కొంత మంది పనికట్టుకుని వారి స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై అనవసరంగా బురద చల్లే ప్రయత్నం సరికాదని మంత్రి పేర్ని వెంకట్రామయ్య హితపు పలికారు.

ఈమీడియా సమావేశంలో సమాచారశాఖ కమీషనర్ మరియు ఎఫ్ డిసి ఎండి వై.విజయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.