దేశవ్యాప్తంగా జరుపుకునే వినాయకచవితి పండుగకు కేంద్రం నిబంధనలు

 


- దేశవ్యాప్తంగా జరుపుకునే వినాయకచవితి పండుగకు కేంద్రం నిబంధనలు 


- దేవుళ్ళను అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయం 

- శవ రాజకీయాలకు అలవాటుపడ్డ  తుప్పు, పప్పులు 

- అందరి విశ్వాసాలను కాపాడేందుకు కృషి చేస్తున్నాం 

- ఇంటి దగ్గరే వినాయకచవితి పండుగను జరుపుకోవాలి 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 




అమరావతి, సెప్టెంబర్ 7 (ప్రజా అమరావతి): వినాయకచవితి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటారని, ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదని, ఈ పండుగకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలను తీసుకువచ్చిందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం సచివాలయానికి వచ్చిన మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. గత రెండేళ్ళుగా వినాయకచవితి పండుగను పురస్కరించుకుని బహిరంగంగా టెంట్లు వేయడం, విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం, ఊరేగింపులు జరుపుకోవడం పై నిషేధం అమల్లో ఉందన్నారు. కోవిడ్ కారణంగా రాష్ట్రంలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక ఆరోగ్య సమస్యలతో ఇప్పటికీ ఎంతో మంది సతమతమవుతున్నారని చెప్పారు. వినాయక చవితి పండుగను బహిరంగంగా రోడ్లపై జరుపుకుంటే ఎక్కువ మంది ప్రజలు గుమిగూడే పరిస్థితి ఉంటుందన్నారు. మరోవైపు కోవిడ ను నియంత్రించాల్సి ఉంటుందని, కోవిడ్ విస్తరించడానికి ఇదొక మార్గం అవుతుందనే ఉద్దేశ్యంతో కొన్ని నిబంధనలను తీసుకువచ్చిందన్నారు. ఆ నిబంధనల ప్రకారం పక్క రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడ కూడా జరుపుకోమని చెప్పడం జరిగిందన్నారు. దేవుళ్ళను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని బీజేపీ చూస్తోందన్నారు. కాషాయం రంగును, దేవుడు బొమ్మలను అడ్డం పెట్టుకుని రాజకీయంగా పదవులను పొందాలన్ని సోము వీర్రాజు ఆధ్వర్యంలో కొంత మంది పనిచేస్తున్నారన్నారు. బీజేపీకి తిరుపతి ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా ఇంకా బుద్ధి వచ్చినట్టు లేదన్నారు. సోము వీర్రాజుకు, బీజేపీలో దేవుడు విగ్రహాలను పెట్టుకుని రాజకీయం చేయాలనుకునే వారికి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వినాయకచవితి పందిరిల దగ్గర ఉండే జనంలో 10 శాతం జనం కూడా బీజేపీ దగ్గర ఉండరని, అదొక తీసేసిన పార్టీ అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ గురించి, సోము వీర్రాజు గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీ నాయకులది ప్రత్యేక పరిస్థితి అని అన్నారు. చంద్రబాబుకు శవాలు కావాలన్నారు. దేవుళ్ళను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తే చంద్రబాబుకు రోజూ ఏదో ఒక శవం కావాలన్నారు. తుప్పు, పప్పులు చంద్రబాబు, లోకేష్ లు ఎక్కడ శవం దొరుకుతుందోనని ఎదురు చూస్తుంటారన్నారు. ఎక్కడైనా హత్య , మానభంగం జరిగినా, శవం దొరికినా దాన్ని పట్టుకుని శవ రాజకీయాలు చేయడానికి అలవాటు పడిపోయారన్నారు. వినాయకచవితిని రోడ్డుపై బహిరంగంగా జరుపుకోవచ్చని చంద్రబాబు చెబుతున్నాడన్నారు. దురదృష్టవశాత్తూ కరోనా థర్డ్ వేవ్ వచ్చి విజృంభిస్తే ఇదే చంద్రబాబు ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇష్టానుసారంగా వినాయకచవితికి అనుమతులు ఇచ్చారని సీఎం జగన్మోహనరెడ్డిని తిట్టి పోస్తాడన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా, సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబుకు, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి, కేంద్రంలో ఉన్న బీజేపీకి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. 14 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, కోవిడ్ నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా జరిగే వినాయకచవితి పండుగను ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా జరుపుకుంటున్నట్టు మాట్లాడుతున్నాడన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి, డీజీపీ, ఇంకొంత మంది క్రిస్టియన్లు అంటూ కులాలను, మతాలను రాజకీయాల్లోకి తీసుకువచ్చి నీచాతినీచంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు, బీజేపీకి రానున్న రోజుల్లో మళ్ళీ మళ్ళీ బుద్ధి చెబుతారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, సీఎం జగన్మోహనరెడ్డికి ఈ రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలు, ప్రతి ఒక్కరి విశ్వాసాలు ముఖ్యమేనని అన్నారు. అందరి విశ్వాసాలను కాపాడేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కరోనా కష్టకాలంలో ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. బీజేపీ, తెలుగుదేశం పార్టీల నాయకులు చెప్పే మాటలను దృష్టిలో పెట్టుకోకుండా ఎవరి ఇంటి దగ్గర వారు వినాయకచవితి పండుగను జరుపుకోవాలని మంత్రి కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.

Comments