అర్హులైన ట్రాన్సజెండర్స్ అందరికీ సంక్షేమ పధకాలు అందిస్తాం :
కుటీర పరిశ్రమల ఏర్పాటుతో గౌరవంగా జీవించేలా చేస్తాం : జిల్లా కలెక్టర్ జె. నివాస్
విజయవాడ, సెప్టెంబర్, 11 (ప్రజా అమరావతి): జిల్లాలో అర్హులైన ప్రతీ ట్రాన్సజెండర్ కి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జె. నివాస్ చెప్పారు స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో వివిధ సమస్యలతో తనను కలిసేందుకు వచ్చిన ట్రాన్సజెండర్స్ ప్రతినిధులతో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ట్రాన్సజెండర్స్ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2019లో ప్రత్యేక చట్టాన్ని రూపొందించిందన్నారు. ఆ చట్టాన్ని అనుసరించి, అర్హులైన ప్రతీ ట్రాన్సజెండర్ కు ప్రభుత్వం అమలు చేస్తున్నసామజిక పెన్షన్లు, జగనన్న ఇల్లు, స్వయం ఉపాధి వంటి సంక్షేమ పధకాలు అమలు జరిగేలా చర్యలు తీసుకుంటానన్నారు. జిల్లాలో ఇంతవరకు 178 మంది ట్రాన్సజెండర్స్ కు నెలకు 3000 వేల రూపాయలు చొప్పున పెన్షన్ అందిస్తున్నామన్నారు. మరో 150 మంది పెన్షన్ కు అర్హులున్నారని కలెక్టర్ దృష్టికి ప్రతినిధులు తీసుకురాగా వారికి కూడా పెన్షన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని ట్రాన్సజెండర్స్ కు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నామని, వీటి ఆధారంగా ప్రతీ ఒక్క ట్రాన్సజెండర్ కు ఆధార్, రేషన్, రైస్, ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరుకు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాన్సజెండర్స్ బిక్షాటన మాని వారి కాళ్లపై వారు నిలబడే వాళ్లకు పేపర్ ప్లేట్ల తయారీ, విస్తరాకుల తయారీ వంటి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు సహకారం అందిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ పిలుపుతో స్వచ్చంద సంస్థల వారు ముందుకు వచ్చి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికీ 10 సంవత్సరాల పాటు స్థలాన్ని అందిస్తామన్నారు. దీంతో కొంత మంది ట్రాన్సజెండర్స్ తమ ఆసక్తిని తెలియజేసి, తాము కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని గౌరవప్రదమైన జీవితాన్ని సాగిస్తామని కోరడంతో జిల్లా కలెక్టర్ నివాస్ స్పందించి స్వచ్చంద సంస్థల సహకారంతో వారికి కుటీర పరిశ్రమలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవలసిందిగా అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ( ఆసరా) కె. మోహన్ కుమార్, విభిన్నప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రామ్ కుమార్, ,ట్రాన్సజెండర్స్ ప్రతినిధులు, ప్రభృతులు పాల్గొన్నారు.
addComments
Post a Comment