బోదవ్యాధి(ఫైలేరియా)నివారణకు ప్రత్యేక చర్యలు :వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్శి సింఘాల్
2004 నుండి 10జిల్లాల్లో మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్
రెండేళ్ళు పైబడిన పిల్లలతో ఏడాదికి ఒకసారి డిఇసి(అల్బెండజోల్)మాత్రలు మింగించాలి
క్యూలెక్సు దోమలవల్ల బోధవ్యాధి వస్తుంది ఇంటి పరిసరాల్లో నీరు నిల్వలేకుండా చూడాలి
వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సింఘాల్
అమరావతి,13 సెప్టెంబరు (ప్రజా అమరావతి):రాష్ట్రంలో కడప,కర్నూల్,అనంతపురం మినహా మిగతా 10 జిల్లాల్లో బోదవ్యాధి(ఫైలేరియా నివారణకు)ప్రభుత్వం 2004 నుండి మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కింద ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు.మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (MDA) (2021)పై రాష్ట్ర స్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం సోమవారం మంగళగిరిలోని ఎపిఐఐసి భవనంలో ఆయన అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో లింఫాటిక్ ఫైలేరియాసిస్ ఎండమిక్ వ్యాధి నిరోధక చర్యలు,ఈవ్యాధి నియంత్రణలో ఇప్పటికి సాధించిన ఫలితాలు,వ్యాధి నివారణలో ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై సమీక్షించారు. ఇంకా ఈకార్యక్రమాన్ని మరింతగా పగడ్బందీగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో సమీక్షించారు.ఈసందర్భంగా సింఘాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో బోదవ్యాధిని పూర్తిగా నివారించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని పేర్కొన్నారు.విజయ నగరం జిల్లా మినహా మిగతా జిల్లాల్లన్నీ ట్రాన్స్ మిషన్ అసెస్మెంట్ సర్వేకు ఎంపిక కాబడినవని తెలిపారు.
బోదకాలు(ఫైలేరియా) సమస్య క్యూలెక్స్ రకం దోమ కుట్టటం వల్ల వస్తుందని ఈ వ్యాధి ఫైలేరియా అనే సూక్ష్మక్రిమి ద్వారా సంక్రమిస్తుందని ఇంటి పరిసరాల్లో ఉన్న మురుగునీటిలో గుడ్లు పెట్టి వృద్ధి చెందే క్యూలెక్స్ దోమ ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందు తుందని ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు.క్యూలెక్సు దోమ బోధకాలు రోగిని కుట్టినపుడు రక్తంతోపాటు దోమ కడుపులోకి ఫైలేరియ క్రిములు ప్రవేశిస్తాయని అలా ప్రవేశించిన క్రిములు 10 నుండి 15 రోజుల్లో వివిధ దశలుగా అభివృద్ధి చెంది మరో వ్యక్తిలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉంటాయని ఇలా వృద్ధి చెందిన దోమలు మరో వ్యక్తిని కుట్టినపుడు అతని శరీరంలోకి ఫైలేరియా క్రిములు ప్రవేశిస్తాయని చెప్పారు.
విజయనగరం జిల్లాలో ఈనెల 29న మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించడానికి ఎంపిక చేయడం జరిగిందని వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ కె.భాస్కర్ పేర్కొన్నారు.ఈమాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమంలో రెండేళ్ళ లోపు చిన్నారులు,గర్భిణీ స్త్రీలు,దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారిని మినహాయించి మిగిలిన వారందరికీ వయస్సును బట్టి తగిన మోతాదులో డిఇసి మరియు అల్బెండజోల్(Albendazole) మాత్రలను ఆయా గ్రామాల్లో గుర్తించబడిన డ్రగ్ అడ్మినిస్ట్రేటర్ ల ద్వారా మింగించడం జరుగుతుందని తెలిపారు.ఇందుకు గాను విజయనగరం జిల్లాల్లో 26,02,367మంది జనాభాకు గాను 23,62,523 మందిచే ఈమందులను మింగించేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్టు కమీషనర్ చెప్పారు.ఆజిల్లాను 9450 మందిని టీంకు 2వంతున 4725 టీములను ఏర్పాటు చేసి డ్రగ్ అడ్మినిస్ట్రేటర్లుగా గుర్తించడం జరిగిందని తెలిపారు.వీరందరూ ఈనెల 29న ఇంటింటికీ వెళ్ళి వయస్సును బట్టి తగిన మోతాదులో మందులు మింగించడం జరుగుతుందని తెలిపారు. మొదటి రోజు లభించని వారిని రెండవ రోజు,మూడవ రోజు గుర్తించి ఈమాత్రలు మింగించడం జరుగుతుందని భాస్కర్ చెప్పారు.గత పదేళ్ళ కాలంలో సామూహిక డిఇసి మాత్రలు మింగించడం ద్వారా ఈవ్యాధి నివారణలో ఘణనీయమైన ఫలితాలు సాధించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.బోదకాలు వ్యాధి నివారణపై ప్రజల్లో మరింత విస్తృత అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచార అవగాహనా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందని పేర్కొన్నారు.
ఈసమావేశంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం,సాంఘిక సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు అనురాధ,కె.సునీత,శాఖల అధికారులతోపాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment