సమాచార హక్కు చట్టం కింద వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి

 

నెల్లూరు, సెప్టెంబర్ 8 (ప్రజా అమరావతి) : సమాచార హక్కు చట్టం కింద వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి


ఖచ్చితమైన సమాచారాన్ని నిర్ణీత గడువులోగా దరఖాస్తుదారునికి అందించాలని సమాచార హక్కు చట్టం  కమిషనర్ శ్రీ రేపాల శ్రీనివాస రావు అధికారులకు సూచించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సమాచార హక్కు చట్టం పై జిల్లాస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఐ కమిషనర్ మాట్లాడుతూ పౌరులకు తక్కువ ఖర్చుతో వారు కోరిన సమాచారాన్ని సక్రమంగా అందించడమే సమాచార హక్కు చట్టం లక్ష్యమని చెప్పారు.  పౌర సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు సమాచార హక్కు చట్టం కింద వచ్చే అర్జీలకు 30 రోజుల్లో సమాధానం ఇవ్వాలని, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేకపోతున్నారో దరఖాస్తుదారునికి వివరంగా తెలియజేయాలన్నారు. సెక్షన్ 19 ప్రకారం సమాచారాన్ని పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అలాగే సెక్షన్ 21 ప్రకారం వ్యక్తిగత సమాచార గోప్యతను పాటించాలని సూచించారు. మొదటగా సమాచారం కోసం వచ్చే దరఖాస్తులను పూర్తిగా పరిశీలించి సమాచారం ఇవ్వవచ్చా, ఇవ్వకూడదా.. అనే విషయాలను మొదటగా గుర్తించాలన్నారు. పౌర సమాచార అధికారి ఇచ్చిన సమాధానానికి అర్జీదారులు సంతృప్తి చెందకపోతే మెదటి అప్పిలేట్ అధికారిని సంప్రదించడం జరుగుతుందని, ఆ అధికారి ఇద్దరిని విచారించి నిర్ణయం తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలోనే సమాచారహక్కు చట్టం అర్జీలను పరిష్కరించాలని, ఆర్టిఐ కమిషన్ వరకు రాకుండా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఒక వ్యక్తి ఎక్కువ మోతాదులో సమాచారం అడిగితే ఆ వ్యక్తిని సంబంధిత కార్యాలయానికి అనుమతించి రికార్డులు పరిశీలించుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. అంతేగాని వేల వేల పేజీలను దరఖాస్తుదారునికి ఇవ్వడం కుదరదన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం వివరాలు తెలిపే బోర్డులు ఏర్పాటు చేసి, రికార్డులను కచ్చితంగా నిర్వహించాలన్నారు. దరఖాస్తుదారుడు అడిగిన సమాచారం సంబంధిత పౌర సమాచార అధికారి ఉన్నది ఉన్నట్లుగా ఇవ్వాలని, ఎటువంటి చేర్పులు, మార్పులకు అవకాశం లేదన్నారు.  దరఖాస్తుదారునికి తప్పుడు సమాచారం ఇచ్చినా, దరఖాస్తుదారుడు సమాచారాన్ని దుర్వినియోగం చేసేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అర్జీలకు సంబంధించి అధికారులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే తమకు తెలియజేస్తే పరిష్కరిస్తామన్నారు. 

 అనంతరం అధికారులు అడిగిన సందేహాలను ఆర్టీఐ కమిషనర్ ఉదాహరణలతో నివృత్తి చేశారు.

 ఈ సదస్సులో ఇన్చార్జి కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్,  మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్, డిఆర్ఓ శ్రీ చిన్న ఓబులేసు ఇన్చార్జి సంయుక్త కలెక్టర్ శ్రీమతి రోజ్ మాండ్, డి ఆర్ డి ఎ, డ్వామా పీడీలు శ్రీ సాంబశివ రెడ్డి, శ్రీ తిరుపతయ్య, ఇరిగేషన్ ఎస్ఇ శ్రీ కృష్ణ మోహన్, వ్యవసాయ శాఖ జెడి శ్రీ శివన్నారాయణ, పి ఆర్ ఎస్ఇ శ్రీ సుబ్రహ్మణ్యం, డి ఎం హెచ్ ఓ శ్రీమతి రాజ్యలక్ష్మి, ఆర్ డి వో లు శ్రీ హుస్సేన్ సాహెబ్, శ్రీమతి సరోజినీ, చైత్ర వర్షిని, శీనా నాయక్, మురళీకృష్ణ, జిల్లాలోని వివిధ శాఖలకు సంబంధించిన పౌర సమాచార అధికారులు, అప్పీలేట్ అధికారులు పాల్గొన్నారు.

Comments