- రాష్ట్రంలో రోడ్లను బాగు చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
- పీఎంజేఎస్వీ రోడ్ల నిర్మాణానికి రూ.15.42 కోట్లు
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, సెప్టెంబర్ 11 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో రోడ్లను బాగు చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే ఆయా పనులు ప్రారంభమవుతాయని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో రూ. 15.42 కోట్ల వ్యయంతో చేపట్టిన పీఎంజేఎస్వై రోడ్ల నిర్మాణ పనులపై శనివారం మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గంలోని గుడివాడ రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాలు, గుడివాడ పట్టణంలో రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రూ.46.36 కోట్ల నిధులతో పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. రూ.47.02 కోట్ల వ్యయంతో ఆర్.అండ్.బీ రహదారులు, రూ. 15.42 కోట్లతో పీఎంజేఎస్వై రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ప్రాధాన్యతా క్రమంలో రోడ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ఎంతో కాలంగా గుడివాడ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న గుడివాడ - కంకిపాడు ప్రధాన రహదారి విస్తరణ, అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు. రూ. 16.10 కోట్ల వ్యయంతో గుడివాడ నుండి పెదపారుపూడి వరకు 10 మీటర్ల సీసీ, బీటీ రోడ్లతో పాటు రిటైనింగ్ వాలను నిర్మించడం జరుగుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా వైఎస్ జగన్మోహనరెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా అనేక ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న రోడ్లను చూశారని చెప్పారు. చాలా ఏళ్ళుగా నిర్మించని రోడ్లను కూడా పూర్తి చేయాలని ఆదేశించారని చెప్పారు. రూ.6,400 కోట్లతో కొత్త రోడ్ల నిర్మాణానికి కార్యాచరణను రూపొందించారని తెలిపారు. మండల కేంద్రాల నుండి జిల్లా కేంద్రాలకు చేరుకునే రోడ్లపై ఇబ్బందులతో కూడిన ప్రయాణానికి ఇక తెర పడనుందని చెప్పారు l. తొలి దశలో రూ l.3,014 కోట్లతో 1,244 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. రెండవ దశలో రూ.3,386 కోట్ల వ్యయంతో 1,268 కిలోమీటర్ల మేర రోడ్లు రానున్నాయని చెప్పారు. మండలాల నుండి జిల్లా కేంద్రాలకు రెండు లైన్ల రోడ్లను నిర్మిస్తారని తెలిపారు. పాడైన రోడ్లను బాగు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే టెండర్లను పిలిచిందన్నారు. పిలవని రోడ్లకు కూడా టెండర్లను ఆహ్వానించాలని సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశించారన్నారు . రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రగతి, ప్రతిపాదనలపై కూడా సీఎం జగన్మోహనరెడ్డి సమీక్షించారని తెలిపారు. నగరాల్లో, పట్టణాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారని మంత్రి కొడాలి నాని తెలిపారు.
addComments
Post a Comment