రైతులకు మరింత మేలు కలిగేలా ప్రణాళికలు చేయాలి

అక్టోబర్ 1 నుంచి  సూక్ష్మ సేద్య పరికరాలు (డ్రిప్ మరియు స్ప్రింక్లర్లు) పంపిణికి చర్యలు. 


రైతులకు మరింత మేలు కలిగేలా ప్రణాళికలు చేయాలి కొబ్బరి తెగుళ్ల నివారణకు చర్యలు 


విజయవాడ (ప్రజా అమరావతి) :


అక్టోబర్ 1 నుంచి  సూక్ష్మ సేద్య పరికరాలు (డ్రిప్ మరియు స్ప్రింక్లర్లు) పంపిణికి చర్యలు తీసుకుంటునట్టు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఉద్యానవన, వ్యవసాయ  శాఖల ఉన్నతాధికారులతో  విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సి.ఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అర్హులైన లబ్దిదారులకు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి సూక్ష్మ సేద్య పరికరాలు (డ్రిప్ మరియు స్ప్రింక్లర్లు) పంపిణికి చర్యలు తీసుకుంటున్నామని అందుకు తగిన ఏర్పాట్లు చేస్తునట్లు మంత్రి చెప్పారు. బోర్ల కింద వరి సాగు చేయని రైతులకు , గతంలో ఈ పథకం క్రింద లబ్ది పొందని రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. రైతుకి ప్రతి సందర్బములో ఆర్థిక ప్రయోజనాలు కల్పించే దిశగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రణాళికలు చేస్తున్నారని మంత్రి చెప్పారు. రైతుల సంక్షేమం కోసం సీఎం వై ఎస్ జగన్ నిరంతరం పని చేస్తున్నారు. కరోనా వంటి కష్ట  కాలంలో కూడా రైతుల కోసం ఇప్పటి వరకు రూ 83 వేల కోట్లను ఖర్చు చేశామన్నారు. నర్సరీల అభివృద్ధి , రిజిస్ట్రేషన్ , నియంత్రణ అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యానవన శాఖ ద్వారా అమలు చేస్తున్న రాష్ట్ర మరియు కేంద్ర ప్రాయోజిత పథకాలపై లోతుగా సమీక్ష చేశారు. జిల్లాల్లో పని చేసే ఉద్యానవన శాఖ సిబ్బందికి మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా ప్రణాళికలు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.  ఇటీవల ప్రభుత్వం నియమించిన గ్రామ ఉద్యాన శాఖ సహాయకులుకు పూర్తి స్థాయిలో సాంకేతిక శిక్షణ ఇవ్వాలని సూచించారు. రైతులకు డాక్టర్ వైఎస్ఆర్ తోటబడి శిక్షణను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. ఉద్యానవన పంటలను పండించే రైతుకు మరింత ఆర్థిక ప్రయోజనాలు కలిగేలా  చర్యలు తీసుకోవాలని కోరారు. సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనమ్ మాలకొండయ్య , హార్టికల్చర్ కమిషనర్ శ్రీధర్ , పీఓ ఎపిఎంఐపీ హరినాధ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

కొబ్బరి తెగుళ్ళ (మొవ్వ తెగుళ్లు) నివారణకు చర్యలు. 

తూర్పు గోదావరి జిల్లాలో కొబ్బరి చెట్లకు మొవ్వ తెగుళ్లు సోకడం పట్ల మంత్రి కన్నబాబు సంబంధిత అధికారులను, శాస్త్రవేత్తలను అప్రమత్తం చేశారు. ఈ మొవ్వ తెగుళ్ళను పరిశీలించేందుకు అధికారులు, శాస్త్రవేత్తలతో రెండు బృందాలను ఆ ప్రాంతాలకు పంపించాలని ఆదేశించారు. అలాగే ఉద్యానవన శాఖ కమిషనర్, వైస్ చాన్సలర్ (హర్టీకల్చర్ యూనివర్సిటీ) లను ఆ ప్రాంతాలలో పర్యటించాలని సూచించారు. మొవ్వ తెగుళ్లు సోకిన కొబ్బరి చెట్ల స్థానం లో కొత్త కొబ్బరి మొక్కలను నాటేందుకు తగిన సహాయాన్ని సంబంధిత పధకాల ద్వారా అందజేయాలని మంత్రి సూచించారు. ఈ సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనమ్ మాలకొండయ్య, అగ్రికల్చర్ కమిషనర్ అరుణ్ కుమార్, హార్టికల్చర్ కమిషనర్ శ్రీధర్, సీడ్స్ ఎండి  శేఖర్ బాబు, ఆగ్రోస్ ఎండి కృష్ణమూర్తి, పీఓ ఎపిఎంఐపీ హరినాధ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు