• *టిడ్కో గృహ నిర్మాణాల్లో నిర్లిప్తత వద్దు*
• *బ్యాంకులతో సమన్వయాన్ని వేగవంతం చేయండి*
• *టిడ్కో, మెప్మా అధికారులకు పురపాలక శాఖ మంత్రి బొత్స ఆదేశం*
• *టిడ్కో గృహాల పురోగతిపై అధికారులతో వీడియో కాన్ఫరెన్సు*
*విజయవాడ, సెప్టెంబరు 4 (ప్రజా అమరావతి):*
టిడ్కో గృహ లబ్ధిదారులకు సేల్ అగ్రిమెంట్లు పంపిణీ, బ్యాంకు రుణాల మంజూరు ప్రక్రియలో నిర్లిప్తత వద్దని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు స్పష్టం చేశారు. అర్హలైన అందరికీ సొంత ఇల్లు ఉండేలా చూడాలన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడంలో అధికారులందరూ క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. టిడ్కో గృహాలపై విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. టిడ్కో ఛైర్మన్ జె.ప్రసన్న కుమార్, ఎండి శ్రీధర్ , మెప్మా ఎండి విజయలక్ష్మి తదితర ఉన్నతాధికారులతో పాటు జిల్లాల్లోని బ్యాంకుల సమన్వయ కర్తలు, టిడ్కో, మెప్మా అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్ఛంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, లబ్ధిదారులకు సేల్ అగ్రిమెంట్లు పంపిణీ, బ్యాంకు రుణాల మంజూరు, విడుదల తదితర అంశాల్లో లక్ష్యాలను నిర్దేశించుకుంటూ సమగ్ర కార్యాచరణతో పని చేయాలన్నారు. బ్యాంకులకు సమర్పించిన దరఖాస్తులు, రుణాల మంజూరు, విడుదలకు సంబంధించిన అంశాల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోందని దానిని అధిగమించాలని స్పష్టంగా నిర్దేశించారు. కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు దస్తావేజులు సమర్పించడంలో జాప్యం జరుగుతున్నదని, అలాంటి వాటికి తావివ్వకుండా జిల్లాలోని బ్యాంకుల సమన్వయ కర్తలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లబ్దిదారులకు రుణ మంజూరు ప్రక్రియ వేగవంతం అయ్యేలా జిల్లాల్లోని టిడ్కో ఇంజనీర్లు, మెప్మా ప్రాజెక్టు డైరక్టర్లు కూడా బ్యాంకులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి అన్నారు.
స్థానికంగా ఏదైనా ఇబ్బందులు ఎదురైతే ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకువస్తే వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. టిడ్కో గృహాల పురోగతిపై ప్రతి వారం సమీక్షిస్తానని మంత్రి గతంలోనే ప్రకటించిన విషయం విదితమే.
---------------
addComments
Post a Comment