*హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ మలయప్ప*
తిరుమల (ప్రజా అమరావతి):
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శుక్రవారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు హంస వాహనంపై వీణ ధరించి సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు.
*హంస వాహనం – బ్రహ్మ పద ప్రాప్తి*
హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక.
పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం.
ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి.
శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.
కాగా, సాలకట్ల బ్రహ్మోత్సవాలలో మూడో రోజైన శనివారం
ఉదయం 9 గంటలకు సింహవాహనం,
రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనసేవలు జరుగుతాయి.
మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డా. కెఎస్.జవహర్‌రెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు శ్రీమతి ప్రశాంతి రెడ్డి, శ్రీ సనత్‌కుమార్, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి దంపతులు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్‌బాబు, పేష్కార్ శ్రీ శ్రీహరి ఇతర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment