చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం, నేత కార్మికులకు మేలు జరిగే విధంగా


కాకినాడ, అక్టోబర్ 08 (ప్రజా అమరావతి);


       సంస్కృతి, హుందాతనం ఉట్టిపడే చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి ప్రజలు చేనేత కార్మిక కుటుంబాలకు బాసటాగా నిలవాలని కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత కోరారు.

      శుక్రవారం కాకినాడ సూర్య కళామందిరంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆర్థిక సహాయంతో,  జిల్లా చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన "చేనేత ఉప్పెన" చేనేత వస్త్ర ప్రదర్శన కార్యక్రమానికి కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత, జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ ఆకుల వీర్రాజు ముఖ్య అతిథులుగా హాజరయి వస్త్ర ప్రదర్శనను ప్రారంభించారు.

  ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ  చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం, నేత కార్మికులకు మేలు జరిగే విధంగా


దసరా పండుగ సందర్భంగా చేనేత ఉప్పెన పేరిట ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఏర్పాటు చేయడం ముదావహమన్నారు.   మహిళలు కావాల్సిన  చీరలు, డ్రెస్ మెటీరియల్ తదితర ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ఈ చేనేత వస్త్ర ప్రదర్శన వివిధ ప్రాంతాల చేనేత కార్మికుల సృజనాత్మక నైపుణ్యాలకు అద్దంపడుతోందని, జిల్లా ప్రజలు ఈ ప్రదర్శనను సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  అతి తక్కువ సమయంలో జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు, డీసీసీబీ చైర్మన్ సహకారంతో ఈ వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  ప్రస్తుత దసరా పండుగ సందర్భంగా జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలు దగ్గర చేనేత వస్త్రాల స్టాల్స్ ను ఏర్పాటు చేస్తే చేనేత ఉత్పత్తులు ప్రజలకు మరింత చేరువవై ఆదరణ పొందే అవకాశం  ఉంటుందనన్నారు. 

          జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ మాట్లాడుతూ  జిల్లాలో చేనేత వృత్తి కార్మికులకు  ఉత్పత్తులకు విస్తృత ప్రచారం, మార్కెటింగ్ కల్పించేందుకు చేనేత ఉప్పెన వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  కోవిడ్ పరిస్థితుల కారణంగా వస్త్ర విక్రయాలు మందగించి  చేనేత కార్మికులు, సంఘాల వద్ద వస్త్ర  నిల్వలు ఉండిపోయాయని, చేనేత కార్మికులు తమ ఉత్పత్పులను అమ్ముకునేందుకు వీలుగా ఈ నెల 08 నుంచి 12వ తేదీ వరకు ఐదు రోజుల పాటు పండుగ సీజనులో ఈ వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ వస్త్ర ప్రదర్శనలో శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖద్దరు దగ్గర నుంచి నెల్లూరు జిల్లా వెంకటగిరి జరీ చీరాల వరకు అన్ని రకాల చేనేత ఉత్పత్తులను ప్రదర్శించారన్నారు.   ముఖ్యంగా మన జిల్లాకు చెందిన ఉప్పాడ, బండారులంక, పెద్దాపురం, మలికిపురం, ఏడిద, జగ్గంపేట, హసన్ బాద, పసలపూడి, అంగర, మోరి తదితర ప్రాంతాల చేనేత కార్మికులు  మగ్గం మీద నేసే సాంప్రదాయ కాటన్, సిల్క్  వస్త్ర ఉత్పత్తుల కొరకు సుమారుగా 30 స్టాల్స్  ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాకు చెందిన సుమారుగా 40 చేనేత సహకార సంఘాలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయని తెలిపారు.   పార్లమెంట్ సభ్యులు సూచించిన విధంగా పండుగ రోజులలో ప్రజలు ఎక్కువగా సందర్శించే ఆలయాల ప్రాంగణాలతో పాటు,  ఈ నెల 18వ తేదీ వరకూ మండలాల్లో జరిగే ఆసరా వారోత్సవ వేదికల వద్ద చేనేత వస్త్రాల స్టాల్ ను ఏర్పాటు చేయాలని చేనేత, జౌళి అధికారులను కోరారు. స్థానిక ఉష్ణ మండల వాతావరణ పరిస్థితులకు అనువుగా సౌఖ్యవంతగాను, ఆరోగ్యప్రదంగాను ఉండే చేనేత ఉత్పత్తులను ప్రజలు విరివిగా కొనుగోలు చేసి ధరించాలని, తద్వారా చేనేత కార్మికులకు ప్రోత్సాహం, ఆలంబన అందించి, సాంప్రదాయ చేనేత కళను, పరిశ్రమను భావితరాల కొరకు సజీవంగా నిలపాలని జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సాంప్రదాయ శైలిని నిలుపుకుంటూనే, చేనేత ఉత్పత్పులను  ప్రజల అభిరుచులు, మార్కెట్ డిమాండుల కనుగుణంగా డిజైన్లు, నైపుణ్యాలను ఎప్పటి కప్పుడు నవీకరించుకోవాలని చేనేత కార్మికులను, సంఘాలకు ఆయన సూచించారు.  అనంతరం అతిధులు ఎగ్జిబిషన్ లో వివిధ ప్రాంతాల చేనేత సహకార సంఘాలు ప్రదర్శించిన చేనేత ఉత్పత్తుల స్టాల్స్ ను సందర్శించి ఆయా వస్త్రాల వివరాలు, విశిష్టతలను అడిగి తెలుసుకుని ప్రారంభ కొనుగోళ్లు చేశారు. చేనేత ఉప్పెన వస్త్ర ప్రదర్శన, అమ్మకాలు ఈ నెల 8 నుండి 12వ తేదీ వరకూ ఉదయం 9 గం.ల నుండి రాత్రి 9 గం.ల వరకూ సెలవు దినాలలో కూడా జరుగుతాయని చేనేత, జౌళి శాఖ ఎడి ఎన్.ఎస్.కృపావరం తెలియజేశారు. మగ్గంపై తయారైన ధరకే వస్త్రాల అమ్మకం జరుగుతుందని, ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో  చేనేత శాఖ ఆర్.డీ బీ ధనుంజయ రావు, కాకినాడ స్మార్ట్ సిటీ చైర్మన్ అల్లి బులిరాజు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

                                             

Comments