*ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఈవో*
తిరుపతి (ప్రజా అమరావతి):
బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభోత్సవాలు జరుగనున్న ప్రదేశాలను, అక్కడి ఏర్పాట్లను ఇంజినీరింగ్, భద్రతా అధికారులతో కలిసి మంగళవారం ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి పరిశీలించారు.
ముందుగా అలిపిరి కాలినడక మార్గంలో నిర్మాణం పూర్తయిన పైకప్పును పరిశీలించారు. అనంతరం అలిపిరి పాదాల మండపం వద్ద పనులు పూర్తయిన గోమందిరంలో గోపూజ, గోతులాభారం, గోవిజ్ఞాన కేంద్రం ఏర్పాట్లను పరిశీలించారు. గోమందిరం లోపలికి వెళ్లేందుకు, వెలుపలికి వచ్చేందుకు జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.
లైటింగ్, వైరింగ్ తదితర పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ఎస్వీ పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రి ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఈవో తన ఛాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఆసుపత్రి వివరాలతో మూడు నిమిషాల నిడివి గల వీడియో తయారు చేయాలని బర్డ్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో తగినంత మంది వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
ఈ సమావేశంలో టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మయ్య, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, సిఎంఓ డాక్టర్ మురళీధర్, సిఎస్ ఆర్ఎంవో శ్రీ శేషశైలేంద్ర, ప్రత్యేకాధికారి డాక్టర్ ఆర్.రెడ్డెప్పరెడ్డి, డాక్టర్ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment