నెల్లూరు, అక్టోబర్ 20 (ప్రజా అమరావతి): జిల్లాలో జగనన్న తోడు పథకం కింద ఇప్పటివరకు రెండు విడతలుగా 47,609 మంది చిరు వ్యాపారులకు సుమారు 48 కోట్ల రూపాయల రుణాలను అందించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. జగనన్న తోడు రుణాలు పొందిన చిరు వ్యాపారులకు సంబంధించి వడ్డీ జమ కార్యక్రమం సందర్భంగా బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం నుంచి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు మాట్లాడుతూ జగనన్న తోడు పథకంలో భాగంగా జిల్లాలో రెండు దశల్లో పదివేల రూపాయల రుణాలు పొంది తిరిగి చెల్లించిన 34 వేల 190 మంది చిరు వ్యాపారులకు ఒక కోటి 25 లక్షల 89 వేల రూపాయల మేర వడ్డీని తమరు బటన్ నొక్కి జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే వెంకటాచలం గ్రామానికి చెందిన శ్రీమతి మాధవి ముఖ్యమంత్రితో ముఖాముఖిగా మాట్లాడుతూ జగనన్న తోడు పథకం ద్వారా తాను పొందిన ప్రయోజనాన్ని వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జగనన్న తోడు వడ్డీ విడుదలకు సంబంధించిన మెగా చెక్కును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు శ్రీ గణేష్ కుమార్, శ్రీమతి రోజ్ మాండ్, డిఆర్డిఎ ఏపీఎం శ్రీ మస్తానయ్య, స్త్రీ నిధి ఏజీఎం శ్రీ హేమంత్ కుమార్, మేనేజర్ దుర్గా శ్రీనివాస్, డి పి ఎం ఐబి శ్రీమతి కామాక్షి, చిరు వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారుల అభిప్రాయాలు
నెల్లూరు జిల్లాలో జగనన్న తోడు వడ్డీ జమ కార్యక్రమం సందర్భంగా వెంకటాచలం గ్రామానికి చెందిన శ్రీమతి మాధవి గారు గౌరవ ముఖ్యమంత్రి గారితో ముఖాముఖిగా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.
మాధవి, చీరల వ్యాపారం, వెంకటాచలం
మా జగనన్నకు నమస్కారాలు.. అన్నా మీరు అందించే పథకాలు అన్ని లబ్ధి పొందుతున్నాను. నేను వెంకటాచలం గ్రామంలో చీరల వ్యాపారం చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. అధిక వడ్డీలకు డబ్బులు తీసుకొని పెట్టుబడిగా పెట్టి వచ్చిన ఆదాయం మొత్తాన్ని వడ్డీలకే కట్టేదాన్ని. తమరు ప్రారంభించిన జగనన్న తోడు పథకం ద్వారా మా వాలంటీరు నాకు పదివేల రూపాయలు వస్తుందని చెప్పాడు. దీంతో ఆ పథకం ద్వారా నేను పదివేల రూపాయలు రుణంగా పొందాను. ఈ డబ్బులతో వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను. అధిక వడ్డీ లను చెల్లించే బాధ తప్పింది. దీంతో రోజుకు 500 రూపాయల వరకు ఆదాయం పొందుతూ ప్రతి నెల సుమారు 15 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నాను. తీసుకున్న రుణాన్ని కూడా క్రమం తప్పకుండా బ్యాంకుకు చెల్లిస్తున్నాను. అలాగే ఇటీవలే నాకు వైయస్సార్ ఆసరా పథకం కింద పొదుపు ఖాతా కు పదివేల రూపాయలు ఇచ్చారు. పావలా వడ్డీకి ఐదు వేల రూపాయలు రుణంగా కూడా తీసుకున్నాను. మా పాపకు అమ్మ ఒడి నగదు గత రెండేళ్లుగా ఒకసారి 15000, రెండోసారి 14 వేల రూపాయలు వచ్చింది. మా పాప పుట్టినరోజు జనవరి తొమ్మిదో తారీఖు నాడు నాకు అమ్మ ఒడి డబ్బులు పడడంతో మా పాపకు కొత్త బట్టలు తీసి కేక్ కట్ చేసి పుట్టినరోజు చేసాము. అలాగే నాడు నేడు పథకం కింద పాఠశాలలను బాగా మార్చారు. టాయిలెట్లు శుభ్రంగా ఉన్నాయి. మంచి ఆహారం అందిస్తున్నారు. దీంతో ఒకప్పుడు పాఠశాలకు మా పాప వెళ్లనని మారం చేసేది ఇప్పుడు సంతోషంగా పాఠశాలకు వెళుతుంది. నేను ఈరోజు తమరితో మాట్లాడుతున్నానని తెలిసి మా జగన్ మేనమామకు శుభాకాంక్షలు చెప్పమని మా పాప చాలా సంతోషంగా చెప్పింది. సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా తమరు అందించే ప్రతి పథకాన్ని నేను పొందుతున్నాను. మాకు ఎల్లప్పుడూ మీరే సీఎంగా ఉండాలన్నా... ఈ అవకాశం కల్పించిన జిల్లా అధికారులకు ధన్యవాదాలు.
1). రాధమ్మ, కంకుల వ్యాపారం, నెల్లూరు
అధిక వడ్డీల భారం తప్పింది
- నా పేరు రాధమ్మ. నేను తోపుడు బండి పై కంకులను అమ్ముకుంటాను. గతంలో రోజువారీ వడ్డీకి డబ్బులు తీసుకొని ప్రతిరోజు సాయంత్రం వచ్చిన ఆదాయంలో వడ్డీ కట్టలేక చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడు జగనన్న తోడు పథకం కింద పదివేల రూపాయలు వచ్చాయి. దీంతో నేను ఎక్కడ అప్పులు చేయకుండా వ్యాపారం చేసుకుంటున్నాను. నాలాంటి చాలామంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారికి ఈ పథకం కింద ఆర్థిక సహాయం చేయడం చాలా బాగుంది. ముఖ్యమంత్రికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
2). శంకరంశెట్టి సుభాషిని, కోవూరు
మేము చెల్లించిన రుణాలకు తిరిగి వడ్డీ ఇవ్వడం సంతోషంగా ఉంది
..................
- నేను కోవూరులో చీరల వ్యాపారం చేస్తున్నాను. జగనన్న తోడు పథకం గురించి మా వాలంటీరు ద్వారా తెలుసుకొని పదివేల రూపాయల రుణం పొందాను. క్రమం తప్పకుండా బ్యాంకు లోను చెల్లిస్తున్నాను. పైగా మీరు చెల్లించిన డబ్బులకు వడ్డీని కూడా ఇప్పుడు మాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మాలాంటి పేద మహిళలకు జగనన్న చేస్తున్న సాయం నేను జీవితంలో మర్చిపోలేను.
3). చేబ్రోలు ధనమ్మ, ఇనమడుగు
నా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నాను
నేను మా గ్రామంలో అన్ని వీధుల్లో తిరుగుతూ గిల్టు నగలను అమ్ముతున్నాను. నాకు జగన్మోహన్ రెడ్డి అందించే అన్ని పథకాలు అందాయి. జగనన్న తోడు, వైయస్సార్ ఆసరా పథకాలతో వచ్చిన డబ్బులను నా వ్యాపార అభివృద్ధికి వినియోగించుకున్నాను. మచిలీపట్నం నుంచి గిల్టు నగలను ఎక్కువగా చెప్పించుకుని అప్పులు లేకుండా వడ్డీలు కట్టే బాధ లేకుండా జగన్ బాబు ఇచ్చిన డబ్బులతో వ్యాపారాన్ని సాఫీగా చేసుకుంటూ కుటుంబాన్ని పోషించు కుంటున్నాను. జీవితాంతం నాకు ఉన్న ఓటును జగన్ కే వేస్తాను. మాకు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండాలి.
addComments
Post a Comment