• మరో కీలక ఒప్పందం దిశగా ఏపీ ప్రభుత్వం
• ఉపాధి, నైపుణ్యాల హబ్ గా ఆంధ్రప్రదేశ్
• యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగాల కల్పనే లక్ష్యం
• పరిశ్రమలలో ఉపాధికి తగిన నైపుణ్య, శిక్షణ అందించే దిశగా కీలక అడుగులు
• నేడు (శుక్రవారం) మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సమక్షంలో ఎపిఎస్‌ఎస్‌డిసి, అపిటా, ఐ.ఎస్.బి ఒప్పందం
• పరిశ్రమలలో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు అందించాలన్న ఆచరణ దిశగా ముందడుగు
• నైపుణ్యం ఉంటే ఉద్యోగం మీ వెంటే అని ముఖ్యమంత్రి పదేపదే చెప్పిన మాటలకు నేడు రూపం
• రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్య కళాశాలలు, విశ్వవిద్యాలయం ఏర్పాటుతో మారనున్న ఏపీ స్వరూపం
అమరావతి (ప్రజా అమరావతి):
యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి నాణ్యమైన ఉద్యోగాలు కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నేడు ఐ.టీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ISB) క్యాంపస్ లో ఎపిఎస్‌ఎస్‌డిసి, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీతో(ఎపిఐటిఎ) ఒప్పందం చేసుకోనున్నారు. ఔత్సాహికవేత్తలు, నిరుద్యోగ యువతకు మార్కెట్ లో ఉన్న ధరకంటే చాలా తక్కువ ఫీజుతో నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు పరిశ్రమలలో ఉద్యోగాలు పొందడానికి అనుగుణంగా యువతను తీర్చిదిద్దాలన్నదే ఈ ఒప్పందం యొక్క ముఖ్య లక్ష్యం.
జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)లో వస్తున్నమార్పులకు తగ్గట్టుగా ఎంపిక చేసిన కోర్సులలో శిక్షణను దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐ.ఎస్.బి) అందించనున్నది. అందులో భాగంగానే బిహేవియరల్ స్కిల్స్ (ప్రవర్తనా నైపుణ్యాలు), బిజినెస్ లిటరసీ స్కిల్స్ (వ్యాపార అక్షరాస్యత నైపుణ్యాలు) పై శిక్షణ ఇవ్వడం కోసం ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి బంగారు రాజు, ఐఎస్ బీ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల సంతకాలు చేయనున్నారు. డిజిటల్ లిటరసీ(డిజిటల్ అక్షరాస్యత), ఎంటర్ ప్రినియల్ లిటరసీలకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీతో(ఎపిఐటిఎ) సీఈవో అనిల్ కుమార్ టెంటు, ఐఎస్ బీ డిజిటల్ లెర్నింగ్ డిపార్ట్ మెంట్ డిప్యూటీ డీన్, ప్రొఫెసర్ దీపామణి సంతకాలు చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మి, ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ సలహాదారు చల్లా మధుసూదన్ రెడ్డి, ఐఎస్ బీ ప్రతినిధులు హాజరుకానున్నారు.
addComments
Post a Comment