శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలలో రోజుకు వెయ్యి మందికి వెనుక‌బ‌డిన వ‌ర్గాల భ‌క్తులకు దర్శనం.


"శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలలో రోజుకు వెయ్యి మందికి వెనుక‌బ‌డిన వ‌ర్గాల భ‌క్తులకు దర్శనం.

        

  తిరుపతి (ప్రజా అమరావతి):

అక్టోబ‌రు 7 నుండి 14వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వ ద‌ర్శ‌నం.

 రోజుకు వెయ్యి మంది వెనుక‌బ‌డిన వ‌ర్గాల భ‌క్తులకు దర్శనం.

 13 జిల్లాల నుండి ఉచితంగా బ‌స్సులు


        రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి సుమారు రోజుకు వెయ్యి మంది చొప్పున వెనుక‌బ‌డిన వ‌ర్గాల భ‌క్తుల‌కు అక్టోబ‌రు 7 నుండి 14వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వ ద‌ర్శ‌నం చేయించేందుకు టిటిడి ఏర్పాట్లు చేప‌ట్టింది.

 వీరికి తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నంతోపాటు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ద‌ర్శ‌నం చేయించ‌డం జ‌రుగుతుంది.


             హిందూ ధ‌ర్మాన్ని ప్ర‌చారం చేసేందుకు, మ‌త మార్పిడుల‌ను అరిక‌ట్టేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ‌ ద్వారా స‌మ‌ర‌స‌త సేవా ఫౌండేష‌న్ సహకారంతో టిటిడి మొద‌టి విడ‌త‌లో రూ.25 కోట్ల‌తో 13 జిల్లాల్లో 502 ఆల‌యాల‌ను నిర్మించిన విష‌యం తెలిసిందే. ఈ ఆల‌యాలు నిర్మించిన వెనుక‌బ‌డిన‌ ప్రాంతాల నుండి బ్ర‌హ్మోత్స‌వాల స‌మ‌యంలో భ‌క్తుల‌ను ఆహ్వానించి శ్రీ‌వారి ద‌ర్శనం చేయించ‌డం జ‌రుగుతుంది. ఒక్కో జిల్లా నుండి 10 బ‌స్సులు ఏర్పాటుచేసి భ‌క్తుల‌ను ఉచితంగా తిరుమ‌ల‌కు తీసుకురావ‌డం జ‌రుగుతుంది. తూర్పుగోదావ‌రి, విశాఖ జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ‌గా ఉండ‌డంతో 20 బ‌స్సులు ఏర్పాటు చేయ‌డ‌మైన‌ది. ఒక్కో బ‌స్సులో ఇద్ద‌రు స‌మ‌ర‌స‌త సేవా ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు ఉంటారు. దూర ప్రాంతాల నుండి వ‌చ్చే భ‌క్తుల‌కు మార్గమధ్యంలో స్థానిక దాతల స‌హ‌కారంతో  ఆహార పానీయాలు అందించేందుకు టిటిడి ఏర్పాట్లు చేప‌ట్టింది.