మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా జనరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూధిని.

 ఇంద్రకీలాద్రి,అక్టోబర్ 14 (ప్రజా అమరావతి):


మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా జనరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూధిని. 



దేవీ నవరాత్రులలో తొమ్మిదో రోజున ఆశ్వయుజ శుద్ధనవమి తిథి ఉన్నప్పుడు మహర్నవమి అంటారు.


ఎనిమిది రోజుల యుద్ధం తరవాత అమ్మ నవమినాడు మహిషాసురుణ్ని మర్దించి, లోకాలన్నింటికి ఆనందాన్ని చేకూర్చింది. 


అమ్మ అవతారాన్నింటిలో దుష్టశిక్షణ చేసిన ఈ రూపం అత్యుగ్రం.


అందరు దేవతలు చేసిన చిద్యాగ కుండం నుంచి వెలుగుముద్దగా ఆవిర్భవించి, సకల దేవతల అంశలను గ్రహించి, వారిచ్చిన ఆయుధాలను, అలంకారాలను ధరించి స్త్రీలను చులకనగాచూసి దున్నపోతు మనస్తత్వం మూర్తీభవించిన మహిషాసురుణ్ని సంహరించింది.


సింహవాహనయై, ఉగ్రరూపంతో, అష్టభుజాలతో పాశం, అంకుశం, త్రిశూలం మొదలైన ఆయుధాలను ధరించి దర్శనమిచ్చే మహాశక్తిని పూజిస్తే శత్రుభయం ఉండదు. 


అన్ని అవతారాలలోనూ ఆది పరాశక్తి దుష్ట రాక్షసులని సంహరించింది ఆశ్వయుజ శుద్ధ నవమి నాడే. 


అందుకే దీనికి ప్రత్యేకత. సంవత్సరంలో ఉండే 24 నవమి తిథుల్లోనూ గొప్పది కనుక మహర్నవమి అని పిలవబడుతుంది. 


ఈ నాటి మరొక విశేషం ఆయుధ పూజ. అన్ని వృత్తుల వారు తమ తమ ఆయుధాలని పూజిస్తారు. 


దేనినైనా సాధించడానికి ఉపయోగపడే పనిముట్లని పూజించే గొప్ప సంస్కృతి మనది.

Comments