డిసెంబర్ 2న జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు



*డిసెంబర్ 2న జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు



*


*ముఖ్యమంత్రి పర్యటనపై అధికారులతో కలెక్టర్ సమీక్ష*


రాజంపేట, నవంబర్ 30 (ప్రజా అమరావతి): జవాద్ తుఫాన్ ప్రభావంతో... జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన రాజంపేట మండలంలో డిసెంబర్ 2న పర్యటించనున్న ముఖ్యమంత్రి గారి పర్యటనను ప్రణాళికాబద్ధంగా ముందస్తు ఏర్పాట్లు అన్ని పూర్తి చేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి విజయరామరాజు అధికారులను ఆదేశించారు మంగళవారం రాత్రి 8.00 గంటలకు రాజంపేట మండలం ఎన్ఆర్.పల్లిలోని జవహర్ నవోదయ విద్యాలయాలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి చేయవలసిన ముందస్తు ఏర్పాట్లపై జేసి ఎం.గౌతమితో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...  ముఖ్యమంత్రి గారు జిల్లా పర్యటనకు రానున్నారు. అధికారిక పర్యటన (మినిట్ టు మినిట్) కార్యక్రమం ఇంకనూ అందవలసి ఉంది. ప్రాథమిక సమాచారం మేరకు డిసెంబర్ 2న ముఖ్యమంత్రివర్యులు విజయవాడ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్ లో రాజంపేట మండలం మందపల్లిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకొని మందపల్లి,  పులపుత్తూరు, అన్నమయ్య సాగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి వరద పరిస్థితులను పరిశీలించడంతో పాటు వరద బాధితులను పరామర్శించడం జరుగుతుందన్నారు. పులపత్తూరులో వరద నష్టాలపై ఏర్పాటు చేసే ఛాయాచిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి తిలకిస్తారు. అనంతరం ఎన్ఆర్ పల్లిలోని జవహర్ నవోదయ విద్యాలయాలో అధికారులతో ముఖ్యమంత్రి గారు సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం కడపకు చేరుకొని తదుపరి నిర్వహించబడే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారు.


ముఖ్యమంత్రి గారి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తిచేయాలి. ఈ పర్యటనకు సంబంధించి శాఖల వారీగా అధికారులకు విధులు కేటాయించడం జరిగింది. అధికారులు అందరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి. ముఖ్యమంత్రి గారి పర్యటనకు సంబంధించి తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ వారిని, విమానాశ్రయం, హెలిప్యాడ్ లలో ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేయాలని, ముఖ్యమంత్రి గారి పర్యటన ప్రాంతంలో బందోబస్తు, బ్యారికేడింగ్, పారిశుధ్యం పక్కాగా చేయాలన్నారు. వైద్యబృందం, ఫైర్ ఇంజిన్ సిద్ధంగా ఉండాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించేందుకు వలంటీర్లను ఏర్పాటు చేయాలని జెడ్పి సీఈఓను ఆదేశించారు. అలాగే  వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధకం, ఆర్ అండ్ బి, పీఆర్, విద్యుత్తు, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్ శాఖల అధికారులు ఆయా శాఖల్లో జరిగిన నష్టాలపై నివేదికలతో సిద్ధంగా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి గారి పర్యటన సంబంధించి వివిధ అంశాలలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.


ఆయా శాఖల అధికారులకు అప్పగించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించి ముఖ్యమంత్రి గారి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. 


ఈ సమావేశంలో రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్, జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసులు, జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ గీత, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments