హనుమంతుని జన్మవృత్తాంతాన్ని దృశ్య మాధ్యమ రూపంలో భక్తులకు తెలిపే ఏర్పాట్లు

 హనుమంతుని జన్మవృత్తాంతాన్ని దృశ్య మాధ్యమ రూపంలో భక్తులకు తెలిపే ఏర్పాట్లు


– ఆకాశగంగ వద్ద భక్తుల కోసం పలు సౌకర్యాల కల్పన

– అధికారుల సమీక్షలో టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి

తిరుమల, 28 నవంబరు (ప్రజా అమరావతి): హనుమంతుని జన్మస్థలమైన తిరుమలలోని ఆకాశగంగ వద్ద హనుమంతుని జన్మవృత్తాంతం పౌరాణిక గాథను సాంకేతిక సహకారంతో దృశ్య మాధ్యమ రూపంలో నేటి యువతకు అర్థమయ్యేలా తెలిపే ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఆదివారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఆకాశగంగ వద్ద మెట్లకు ఒకవైపు థీమ్ పార్కును ఏర్పాటు చేయాలని, మరోవైపు భక్తులు ధ్యానం చేసేందుకు వీలుగా ధ్యానమందిరం ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అంజనాదేవి తపస్సు చేయడం, వాయుదేవుని అనుగ్రహంతో పుత్రసంతానం పొందడం, నిష్కామకర్మ యోగి అయిన హనుమంతుడు పుట్టగానే సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడి దగ్గరకు వెళ్లడం, దేవేంద్రుడు వజ్రాయుధాన్ని హనుమంతుడిపై ప్రయోగించడం, వాయుదేవుడు తన వరపుత్రుడైన హనుమంతుని ఉన్నతుడిని చేయాలని దిక్పాలకులను కోరగా అనేక వరాలు ఇవ్వడం, సూర్య భగవానుడు వద్ద సమస్త వేద విద్యలను అభ్యసించడం,ఆ తరువాత కిష్కింద రాజ్యంలో సుగ్రీవుని కొలువులో హనుమంతుడు మంత్రిగా చేరడం తదితర ఘట్టాలతోపాటు అంజనాద్రి వైభవం వింటే అందరూ. పునీతులవుతారనే సందేశం ఇచ్చేలా ఈ థీమ్ పార్కు ఏర్పాటు చేయాలన్నారు.

ఆర్ట్ డైరెక్టర్ శ్రీ ఆనంద సాయి సహకారంతో థీమ్ పార్కు పనులు వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఈఓ ఆదేశించారు. ఆకాశగంగకు లోనికి వెళ్లి వచ్చే మార్గాల్లో భక్తులు ఎండకు, వర్షానికి ఇబ్బంది పడకుండా పైకప్పు ఏర్పాటు చేయాలన్నారు. రానున్న బోర్డు సమావేశంలో ఆకాశగంగలో ఏర్పాటు చేయనున్న థీమ్ పార్కుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి, జెఈఓలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ, వర్చువల్ విధానంలో దాతలు శ్రీ మురళీకృష్ణ, శ్రీ నాగేశ్వరరావు, ఆర్ట్ డైరెక్టర్ శ్రీ ఆనంద్ సాయి పాల్గొన్నారు.