ప్రభుత్వం ప్రకటించిన తక్షణ సహాయం


నెల్లూరు, నవంబర్ 24 (ప్రజా అమరావతి): జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన 48,900 కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన తక్షణ సహాయం కిందరెండు వేల రూపాయల నగదు, బియ్యం, నిత్యావసర సరుకులను ముమ్మరంగా పంపిణీ చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు.  బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం  నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్లోని శంకరన్ వీసి హాల్ నుంచి జాయింట్ కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్ హాజరయ్యారు.  ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ జిల్లాలో చేపడుతున్న వరద నివారణ చర్యలను ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యంగా వరద బాధిత కుటుంబాలకు నగదు, బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ వేగంగా చేపడుతున్నట్లు చెప్పారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో 92 మెడికల్ క్యాంపులు చేపట్టి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందజేసినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 212 ఇళ్లు వరద ప్రవాహానికి దెబ్బతిన్నాయని, వీటి వివరాలను పూర్తి స్థాయిలో సేకరించి బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. వరద ప్రభావిత గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలను ముమ్మరంగా చేపడుతున్నట్లు వివరించారు. కంట్రోల్ విభాగంలోని 1077, 104 కాల్ సెంటర్లకు భారీ వర్షాలకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు వివరించారు.  ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వరద నష్టం నివారణ చర్యలను వేగంగా చేపట్టాలని, బాధితులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కు సూచించారు. ముఖ్యంగా వరద ప్రభావిత గ్రామాల్లో విద్యుత్, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర అత్యవసర కార్యకలాపాలను వెంటనే పునరుద్ధరించాలన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో  ఈనెల 27, 28,29 తేదీల్లో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా అవసరమైన అన్ని అత్యవసర ఏర్పాట్లను ముందస్తుగానే సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

 ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ చిన్న ఓబులేసు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.