- విజయవాడలో వైయస్‌ఆర్ చేయూత పై రాష్ట్ర వర్క్‌షాప్
- సమావేశంలో పాల్గొన్న పిఆర్&ఆర్డీ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సెర్ఫ్ సిఇఓ ఇంతియాజ్ తదితరులు
విజయవాడ (ప్రజా అమరావతి);
రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా శక్తివంతులను చేసేందుకు నిర్ధేశించిన వైయస్‌ఆర్ చేయూత పథకంలో మహిళలను భాగస్వాములను చేసేందుకు అధికారులు కృషి చేయాలని పిఆర్&ఆర్డీ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పిలుపునిచ్చారు. విజయవాడలో వైయస్‌ఆర్ చేయూత పథకంపై డ్వామా పిడి, డిఆర్‌డిఎ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) అధికారులతో నిర్వహించిన రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 45-60 సంవత్సరాల వయస్సు ఉన్న ఎస్‌సి, ఎస్టీ, బిసి, మైనార్టీ అక్కచెల్లెమ్మలు తమ జీవనోపాధి వనరులను మెరుగుపరుచుకునేందుకు నిర్ధేశించిన వైయస్‌ఆర్ చేయూత పథకం మొదటి సంవత్సరంలోనే మంచి ఫలితాలను అందించిందని అన్నారు. మహిళలను వ్యాపార, ఉపాధి రంగాల వైపు ప్రోత్సహిస్తే, వారు సమర్థవంతంగా వాటిలో తమ సామర్థ్యంను నిరూపించుకున్నారని అన్నారు. తమ కుటుంబాలకు అండగా నిలిచేలా మహిళలను చేయూత పథకం ద్వారా ఆర్థికంగా నిలబెట్టడానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక కార్పోరేట్ సంస్థలతో వ్యాపార భాగస్వామ్యాలను కల్పిస్తోందని తెలిపారు. మొదటి విడత కింద గత ఏడాది అక్టోబర్ 12వ తేదీన 24 లక్షల మంది మహిళలకు రూ.4500 కోట్ల రూపాయలను అందించిందని అన్నారు. దీని ద్వారా 1,19,000 పాడి పశువులను, 70,955 మేకలు, గొర్రెలు వంటి జీవాలను కొనుగోలు చేశారని, 78వేల మంది రిటైల్ షాప్‌లను ఏర్పాటు చేసుకున్నారని వివరించారు. అలాగే ఈ ఏడాది జూన్ 22వ తేదీన రెండో విడత చేయూత కింద 23.41 లక్షల మంది మహిళలకు రూ.4197 కోట్లు విడుదల చేయడం జరిగిందని అన్నారు. మొదటి విడత చేయూత పథకం ద్వారా లబ్దిపొందిన మహిళలు రూ.438.75 కోట్ల రూపాయలతో 78వేల రిటైల్ షాప్‌లను ఏర్పాటు చేసుకున్నారని, రూ.757.80 కోట్లతో 1,34,103 పాడిపశువులను, రూ.458.82 కోట్లతో 82,556 గొర్రెలు, మేకలు వంటి జీవాలను సమకూర్చుకున్నారని తెలిపారు. ప్రస్తుతం రెండో విడత చేయూత సొమ్ముతో అటు రిటైల్ దుకాణాలు, ఇటు పాడిపశువులు, జీవాల పెంపకం కోసం లబ్ధిదారుల నుంచి వివరాలను సేకరించాలని కోరారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తరువాత పాడిపరిశ్రమను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ఆసరా, చేయూత సొమ్ముతో మహిళలు పాడి, జీవాల పెంపకం ద్వారా తమ జీవనోపాధి మార్గాలను పెంచుకునేలా అధికారులు ప్రోత్సహించాలని అన్నారు. పశుసంవర్థక శాఖ ద్వారా లైవ్‌స్టాక్ కొనుగోళ్ళకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే బ్యాంకుల నుంచి జీవనోపాధి వనరులను సమకూర్చుకునేందుకు అవసరమైన రుణాలను ఇప్పించడంలో అధికారులు చొరవ తీసుకోవాలని అన్నారు.
మహిళల జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచి, వారి కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ఈపథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మొదటి ఏడాది వైయస్‌ఆర్ చేయూత కింద మహిళలతో పి&జి, ఐటిసి, హెచ్‌యుఎల్, రిలయన్స్ రిటైల్, అమూల్, అల్లానా సంస్థలు వ్యాపార ఒప్పందాలు చేసుకున్నాయని, రెండో ఏడాది ఎజియో రిలయన్స్, టానాజర్, జివికే, మహేంద్రా టాప్ & ఖేతి, గెయన్ వంటి సంస్థలు వ్యాపార ఒప్పందాలకు ముందుకు వచ్చాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా పెద్ద ఎత్తున రిటైల్ స్టోర్స్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సంవత్సరంలో అదనంగా 60వేల లైవ్ స్టాక్‌ను కొనుగోలు చేసేందుకు లబ్ధిదారులు ఉత్సాహంగా ఉన్నందున దానిపై దృష్టి సారించాలని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులకు బ్రాండింగ్ ఏర్పాటు చేస్తూ, చేయూత స్టోర్స్‌లో విక్రయించేలా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఉత్పత్తులను కూడా చేయూత కింద ఒప్పందాలు చేసుకున్న మల్టీనేషన్ సంస్థల ద్వారా విక్రయించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాడం ద్వారా మార్కెట్ అవకాశాలను మెరుగు పరుచుకోవాలని అన్నారు. బ్యాంకుల నుంచి రుణాలు పొంది వ్యాపారాలు చేసుకుంటున్న లబ్ధిదారులు సకాలంలో తిరిగి చెల్లింపులు జరిగేలా ఆర్థిక క్రమశిక్షణ పాటించేలా అధికారులు వారిలో అవగాహన పెంచాలన్నారు. రుణాల చెల్లింపులు సక్రమంగా ఉంటేనే తిరిగి బ్యాంకుల నుంచి ఎక్కువ మొత్తాల్లో రుణ సదుపాయం ఉంటుందని పేర్కొన్నారు. గత ఏడాది కేటాయించిన లైవ్‌స్టాక్స్ లక్ష్యంను ఈ ఏడాది మరింత పెంచాలని, గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమను ప్రోత్సహించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మహిళలను ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో సెర్ప్ సిఇఓ ఇంతియాజ్, పలువురు డిఆర్‌డిఎ, డ్వామా పిడిలు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment