నెల్లూరు (ప్రజా అమరావతి);
అల్పపీడనం నేపధ్యంలో భారీ వర్షాలు పడుతున్న నెల్లూరు, చిత్తూరు, వైయస్సార్ కడప, అనంతపురం మరియు ప్రకాశం జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర
ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
శనివారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్రంలోని వర్ష ప్రభావిత జిల్లాలైన ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల కల్లెక్టర్ల తో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై, భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో వాయుగుండం కారణంగా భారీవర్షాలు కురిశాయని, ఇప్పుడు కూడా తీవ్ర వాయుగుండం కారణంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాలల్లో భారీవర్షాలు కురుస్తున్నాయని, సహాయక కార్యక్రమాల్లో ఎక్కడా రాజీలేకుండా అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. వర్ష ప్రభావిత జిల్లాలకు అదనంగా నిధులు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. భారీ వర్షాలు ఎక్కువ కురుస్తున్న నెల్లూరు, చిత్తూరు, వై.ఎస్.ఆర్. కడప మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందన్నారు. ముంపు ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో రోడ్ల పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవడంతోపాటు తాగునీటి వనరులు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్యంపైన కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఎక్కడెక్కడ పంట నష్టపోయిందీ వివరాలు తయారు చేయడం తోపాటు వీలైనంత త్వరగా వారికి పరిహారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మరలా పంట వేసుకునేందుకు రైతులకు 80 శాతం సబ్సిడీ తో విత్తనాలు సరఫరా చేయాలన్నారు. వచ్చే వినతులపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎలాంటి సహాయం కావాలన్న యుద్ధప్రాతిపదికన సమకూర్చడం జరుగుతుందని ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి , జిల్లా కలెక్టర్లకు తెలిపారు.
ఈ సందర్బంగా కలెక్టరేట్లోని శంకరన్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, జిల్లా ప్రత్యేకాధికారి, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ బి. రాజశేఖర్ తో కలసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని మాట్లాడుతూ, జిల్లాలో భారీ వర్షాలు పడుతున్న నేపధ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. జిల్లాలో 13 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు 1400 మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని ముఖ్యమంత్రికి, కలెక్టర్ వివరించారు. కడప, చిత్తూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు కారణంగా ఆయా జిల్లాల నుండి వరద నీరు జిల్లాకు రావడం జరుగుచున్నదని, ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ అధికారులను అప్రమత్తం చేస్తూ చెరువులు గండ్లు పడకుండా చర్యలు చేపట్టేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి కి వివరించారు. అన్నీ తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూములను ఏర్పాటుచేయడం తో పాటు . మండల అధికారులకు , వార్డు సచివాలయం సిబ్బంది కి ఆదేశాలు ఇస్తూ ఎప్పటికప్పుడు ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రికి వివరించారు. సోమశిల ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాలనుండి వరద నీరు సోమశిల ప్రాజెక్ట్ లోకి వస్తున్నందున, దానికనుగుణంగా ప్రాజెక్ట్ నుండి వరద నీటిని విడుదల చేయడం జరుగుచున్నదని కలెక్టర్, ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం సోమశిల ప్రాజెక్టు లో 70 టి.ఎం.సి. ల నీరు నిలువ చేసినట్లు కలెక్టర్ తెలిపారు
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్లు శ్రీ హరెంధిర ప్రసాద్, శ్రీ గణేశ్ కుమార్, శ్రీ విదేహ్ ఖరే, శ్రీమతి రోజ్ మాండ్ , జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ చిన్న ఓబులేసు, ఆర్.డి.ఓ శ్రీ హుస్సేన్ సాహెబ్, ఇరిగేషన్ ఎస్.ఈ శ్రీ కృష్ణమోహన్, విద్యుత్ శాఖ ఎస్.ఈ శ్రీ విజయకుమార్, వ్యవసాయ శాఖ జే.డి శ్రీమతి ఆనందకుమారి, మత్స్య శాఖ జే.డి శ్రీ నాగేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment