తీరనున్న గుడివాడ పట్టణ ప్రజల రైల్వే బిడ్జి కల- తీరనున్న  గుడివాడ పట్టణ ప్రజల రైల్వే బిడ్జి కల


- న్యూఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అధికారులను కలిసిన ఎంపీ బాలశౌరి

- రూ. 325 కోట్లకు పెరిగిన  అంచనా వ్యయం


 న్యూఢిల్లీ, నవంబర్ 12 (ప్రజా అమరావతి): ఎన్నో ఏళ్లుగా గుడివాడ పట్టణ వాసులు ఎదురుచూస్తున్న రైల్వే బ్రిడ్జి కల త్వరలో తీరనుంది. శుక్రవారం న్యూఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ డైరెక్టర్ జనరల్ పాండే, అడిషనల్ డైరెక్టర్ జనరల్ రవిప్రసాద్ లను మచిలీపట్నం ఎంపీ, సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్ వల్లభనేని బాలశౌరి కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం పామర్రు రోడ్డులో గుడివాడ– మచిలీపట్టణం  సెక్షన్ పరిధిలోని  రైల్వే లెవల్ క్రాసింగ్ గేటు నెంబర్- 3, విజయవాడ– భీమవరం సెక్షన్ పరిధిలోని లెవెల్ క్రాసింగ్ నెంబర్- 52 ల వద్ద పట్టణ ప్రజలు పడుతున్న ట్రాఫిక్ కష్టాలను వివరించారు. ఈ రెండు గేట్లపై రెండు రైల్వే బ్రిడ్జి ల నిర్మాణం నిమిత్తం సుమారుగా రూ.206 కోట్ల వ్యయంతో అంచనాలను రూపొందించి, కేంద్ర ప్రభుత్వం నుండి తగిన అనుమతులను పొందినట్టు తెలిపారు. అయితే ఇటీవల రాష్ట్ర పౌర సరఫరాలు,  వినియోగ దారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు (నాని)తో కలిసి మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణంలోని మంత్రి కొడాలి నాని క్యాంపు కార్యాలయంలో రైల్వే బ్రిడ్జి నిర్మాణంపై నేషనల్ హైవేస్ అధికారులతో సమీక్ష జరిపారు. ప్రజల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ఉపయోగకరంగా ఉండేందుకు బ్రిడ్జి నిర్మాణం విషయంలో మంత్రి కొడాలి నాని కొన్ని మార్పులు సూచించడం జరిగింది. ఈ మార్పులను పరిగణనలోకి తీసుకున్న ఎంపి వల్లభనేని బాలశౌరి ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అధికారులతో సమావేశమయ్యారు. గుడివాడ పట్టణంలో నిర్మించనున్న రైల్వే బిడ్జి  డిజైన్ లో మంత్రి కొడాలి నాని సూచించిన విధంగా మార్పులు  చేయాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి కోరడం  జరిగింది. ఎంపి బాలశౌరి వివరణతో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ అధికారులు సంతృప్తి చెందారు. ప్రస్తుత అంచనా వ్యయం రూ. 206 కోట్ల నుండి రూ.325 కోట్లకు పెరిగినప్పటికీ, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదనపు నిధులు కూడా మంజూరు అయ్యేలా చూడాలని ఎంపీ బాలశౌరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. త్వరలోనే  కేంద్ర ప్రభుత్వం నుండి అవసరమైన అనుమతులు తీసుకొని, గుడివాడ పట్టణంలో రైల్వే బిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించడం జరుగుతుందని ఎంపీ వల్లభనేని బాలశౌరి స్పష్టంచేశారు.