నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది.


నెల్లూరు, నవంబర్ 17 (ప్రజా అమరావతి):  నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికలు జరిగిన 46 డివిజన్లలో వైసిపి అభ్యర్థులు విజయం సాధించారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు నెల్లూరు డీకే డబ్ల్యూ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ భారీ భద్రత నడుమ మొదలైంది. జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు, నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్ కౌంటింగ్ కేంద్రంలోని 17 కౌంటింగ్ హాళ్లల్లో ఏర్పాట్లు పరిశీలించి ఓట్ల  లెక్కింపునకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల అబ్జర్వర్ శ్రీ బసంత్ కుమార్ ఎన్నికలను పర్యవేక్షించారు. జిల్లా ఎస్పీ శ్రీ విజయరావు కౌంటింగ్ కేంద్రంలో శాంతిభద్రతలు, భద్రతా చర్యల  విషయంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ కౌంటింగ్ కేంద్రంలోని అన్ని గదులను పరిశీలించారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించగా వైసిపి-32 ఓట్లు, టిడిపి-7, బిజెపి-1,సిపిఎం-5, కాంగ్రెస్ కు ఒక ఓటు, 2 చెల్లని ఓట్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. అనంతరం బ్యాలెట్ బాక్స్ లోని ఓట్లను లెక్కిస్తూ కార్పొరేషన్ అధికారులు ఎప్పటికప్పుడు ఫలితాలను ప్రకటించారు. క్లస్టర్ల వారీగా రిటర్నింగ్ అధికారులు ఫలితాలను కార్పొరేషన్ అధికారులకు అందించారు. కార్పొరేషన్ అధికారులు సాయంత్రం 6 గంటల వరకు డివిజన్ల వారీగా మొత్తం ఎన్ని ఓట్లు, పోలైన ఓట్లు ఎన్ని, ఏ పార్టీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి, గెలిచిన అభ్యర్థికి ఎంత మెజార్టీ వచ్చింది మొదలైన వివరాలను పక్కాగా ప్రకటిస్తూ 46 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించినట్లు ప్రకటించారు.  కౌంటింగ్ సిబ్బందికి, పోలీసులకు, మీడియా వారికి నెల్లూరు కార్పొరేషన్ అధికారులు ఉదయం, మధ్యాహ్నం అల్పాహారం, భోజనం, తాగునీరు తదితర వసతులను ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్, ఎఎస్పి శ్రీమతి వెంకటరత్నం, ఆర్డిఓ శ్రీ హుస్సేన్ సాహెబ్, తాసిల్దార్ షఫీ మాలిక్, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ శ్రీ చెన్నుడు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు.

Comments