భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన నెల్లూరు జిల్లా ను ఇతోధికంగా సాయం చేసి ఆదుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ శ్రీ కే. వి.ఎన్ చక్రధర్ బాబు కేంద్ర బృందాన్ని కోరారు


నెల్లూరు నవంబర్ 28 (ప్రజా అమరావతి):


భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన నెల్లూరు జిల్లా ను ఇతోధికంగా సాయం చేసి ఆదుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ శ్రీ కే. వి.ఎన్ చక్రధర్ బాబు కేంద్ర బృందాన్ని కోరారు


.

   వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా కేంద్ర బృందం నెల్లూరు జిల్లాలో ఆదివారం పర్యటించింది. ఏడుగురు సభ్యులు గల ఈ కేంద్ర బృందం రెండు బృందాలుగా విడిపోయి , దెబ్బతిన్న నెల్లూరు జిల్లా ను  క్షేత్రస్థాయిలో పర్యటించి, అనంతరం నగరంలోని మినర్వా గ్రాండ్ హోటల్ లో  సమాచార పౌర సంబంధాల శాఖ ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శాఖల వారీగా నష్టాల వివరాలను విశదీకరించారు. తీవ్రంగా నష్టపోయిన పెన్నా పరివాహక ప్రాంతాల గురించి ప్రత్యేకంగా వివరించారు. జిల్లా నైసర్గిక స్వరూపం, సాధారణ రోజుల్లో నమోదయ్యే వర్షపాతం, గత రెండు వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలు వరదల వల్ల నమోదైన వర్షపాతం వంటి వివరాలు ప్రత్యేకంగా వివరించారు. సోమశిల రిజర్వాయర్ గురించి వివరిస్తూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఐదు లక్షల  క్యూసెక్కుల నీటి విడుదల జరిగినట్లుగా తెలియజేశారు.  జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖలకు కలిపి  మొత్తం 1190 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.


   ఈ సందర్భంగా కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తున్న కేంద్ర హోంశాఖ సలహాదారు  శ్రీ కునాల్ సత్యార్థి మాట్లాడుతూ, రాష్ట్రంలో కడప జిల్లా తర్వాత నెల్లూరు జిల్లాలోనే అత్యధిక నష్టం జరిగిందని గుర్తించామన్నారు.  కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ఎన్ డి ఆర్ ఎఫ్  మార్గదర్శకాల ప్రకారమే సహాయం చేస్తుందని, అందుకనుగుణంగా ఎన్ డి ఆర్ ఎఫ్  మార్గదర్శకాలలో తెలిపిన 11 అంశాల గురించి వివరంగా నివేదిక తయారు చేసి అందజేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు. నష్టం అంచనాల నివేదిక జిల్లా స్థాయిలో కాకుండా మండల స్థాయి లో శాఖల వారీగా  తయారు చేయాలని సూచించారు. తమ స్థాయిలో సాధ్యమైనంత ఎక్కువ సాయం అందేలా తమ వంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో కేంద్ర బృంద సభ్యులు శ్రీ అనిల్ కుమార్ సింగ్, శ్రీ శ్రావణ్ కుమార్ సింగ్,శ్రీ అభే కుమార్,డా. కె. మనోహరన్, శ్రీ శ్రీనివాసు బైరి,శ్రీ శివాని శర్మ, జిల్లా జాయింట్ కలేక్టర్లు శ్రీ హరేంధర్ ప్రసాద్,  శ్రీ గణేష్ కుమార్, శ్రీ విదేహ ఖరే, శ్రీమతి రోజ్ మాండ్ ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.