యుద్ధప్రాతిపదికన రాయల చెరువు మరమ్మతులు : చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
అమరావతి (ప్రజా అమరావతి);


*యుద్ధప్రాతిపదికన రాయల చెరువు మరమ్మతులు : చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి**అన్ని విధాలా ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుంది*


*ప్రజల సమస్యలను, ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సత్వరమే పరిష్కరిస్తాం*


*నియోజకవర్గ ప్రజలకోసం నిర్విరామంగా కృషి చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు*


*చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం పనితీరు ప్రశంసనీయం, అనిర్వచనీయం*


అమరావతి, నవంబర్,23; చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తిరుపతిలో విస్తృతంగా పర్యటించారు. మంగళవారం రాయల చెరువును పరిశీలించి... మరమ్మత్తుల పనులను పర్యవేక్షించారు. స్వయంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పడవలో ప్రయాణం చేసి ప్రజల ఇబ్బందులను అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ప్రమాదకరంగా కురిసిన వర్షాలకు చిత్తూరు జిల్లాతో పాటు నెల్లూరు, కడప జిల్లాలో ఎక్కువ మంది   ప్రజలు  తాత్కాలికంగా ఇబ్బందులు పడినప్పటికీ  ముఖ్యమంత్రి, ప్రభుత్వ యంత్రాంగం స్పందించిన తీరు వల్ల చాలా వరకూ నష్టనివారణ చేయగలిగామన్నారు. ఈ సందర్భంగా మంత్రి  మేకపాటి మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి  ప్రజలకు అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. భద్రతా బలగాలు సహా జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలను, ఎన్డీఆర్ఎఫ్ బలగాల కృషిని ఆయన మెచ్చుకున్నారు. 


అంతకుముందు తిరుపతిలోని రాయల చెరువులో ఇన్చార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పడవలో పర్యటించారు. నీటి ప్రవాహం, నిల్వ, ఔట్ ఫ్లో వివరాలను  బోటులో ప్రయాణం చేస్తూ చెరువు ప్రభావిత గ్రామాల ప్రజల ఇబ్బందులను ఇంజనీరింగ్ ఎక్స్ పర్ట్స్ కమిటీలో అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఎన్.డి.ఆర్.ఎఫ్. బలగాల సహకారంతో గొల్లపల్లి, సూరావారిపల్లి పల్లె ప్రజలను  మంత్రి గౌతమ్ రెడ్డి పరామర్శించారు. చంద్రగిరి నియోజకవర్గం రాయల చెరువు సహా  సమీప ముంపు గ్రామాలలో  జిల్లా ఇంచార్జి మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కలియతిరిగారు. జనంతో మాట్లాడుతూ ప్రభుత్వం తరపున భరోసా నింపారు.  వరద ముంపుకు గురైన రామచంద్రాపురం మండలంలోని సీకాలేపల్లి, చిట్టత్తూరు, రాయలచెరువు, పుల్లమనాయుడుకండ్రిగ, తిరుపతి రూరల్ మండలం వినాయకనగర్ కాలనీలోని నిర్వాసితుల పరిస్థితి, ఆహార పంపిణీ,వసతులపై ఆరా తీశారు. నిండుకుండను తలపిస్తున్న రాయలచెరువు ప్రమాద పరిస్థితులు, మరమ్మత్తుల పనులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఇన్చార్జి మంత్రి మేకపాటి ఆదేశించారు. రాయల చెరువు కట్ట తెగే పరిస్థితి లేదని ప్రజలు నిశ్చింతగా ఉండాలన్నారు. పూర్తిగా నీటమునిగిన గ్రామాలలో ప్రజల కష్టాలను తెలుసుకున్నామని, స్థానిక చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డితో చర్చించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.


ఈ కార్యక్రమంలో  డిప్యూటీ సి.ఎం.నారాయణస్వామి, తిరుపతి ఎం.పి.గురుమూర్తి , శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎం.ఎల్.ఎ. బియ్యపు మధుసూదనరెడ్డి, చిత్తూరు జిల్లా అర్బన్ ఎస్.పి.వెంకటప్పల నాయుడు, తదితరులు పాల్గొన్నారు.