ఆరోగ్యశ్రీ పరిమితి పెంచాం


శాసనసభ , అమరావతి (ప్రజా అమరావతి);




*–ఆరోగ్యరంగంపై చర్చ సందర్భంగా శాసనసభలో మాట్లాడిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*సీఎం శ్రీ జగన్‌ ఏమన్నారంటే...:*


– రెండున్నర సంవత్సరాల కిందట మన ఆస్పత్రులు, ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది.

– మన ప్రభుత్వం మనిషి ప్రాణానికి విలువ ఇచ్చే ప్రభుత్వం. 

–ప్రతి ఒక్క ప్రాణాన్ని నిలబెట్టేందుకు వైద్యాన్ని పేదవాడికి అందుబాటులోకి తీసుకురాడడానికి ఈ రెండున్నర సంవత్సరాల్లో ప్రతి అడుగు మనసా, వాచా, కర్మేణా పూర్తి చిత్తశుద్ధితో అడుగులు ముందుకేశాం. 


*ఆరోగ్యశ్రీ పరిమితి పెంచాం*

– వైయస్సార్‌ ఆరోగ్య శ్రీకి ఇంతకుముందు వర్తించే వార్షిక ఆదాయ పరిమితి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా రూ.5లక్షలకు పెంచాం. 

– అంటే నెలకు రూ.40వేలు సంపాదించే వ్యక్తిని,  సంవత్సరానికి రూ.5 లక్షలు సంపాదించే వ్యక్తిని కూడా ఈరోజు ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకు వచ్చాం. 

– దీనివల్ల దాదాపుగా ఈ రాష్ట్రంలో 95శాతం మందికి ఆరోగ్యశ్రీ ద్వారా రక్షణ లభిస్తోంది. 

– ఆరోగ్య శ్రీ పరిధిని పెండడమే కాదు.. సూపర్‌స్పెషాల్టీ సేవలు ఎక్కడ అందుతాయో.. అక్కడ వైద్యం చేయించుకోవడానికి ప్రజలు తాపత్రయం పడతారు. అలాంటి సౌకర్యం గతంలో ఉండేది కాదు. మన దగ్గర అలాంటి పరిస్థితుల్లో మన ఆస్పత్రులు లేవన్న సంగతి తెలిసి ఉన్నా కూడా, బయట  ఉన్న సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులకు అనుమతించేవారు కాదు. 


*పొరుగు రాష్ట్రాల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు*

– పొరుగు రాష్ట్రాల్లో మంచి వైద్యం చేయించుకోవడానికి వైయస్సార్‌ ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తున్నాం. ఇందుకోసం అక్షరాలా దాదాపుగా 130 సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులు.. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుల్లో ఎక్కడైనా కూడా ... ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకోవచ్చు. ఏ పేదవాడికి బాగోలేకపోయినా.. సూపర్‌స్పెషాల్టీ సేవలు మన రాష్ట్రంలో ఆస్థాయిలో లేవన్న  వాస్తవాన్ని అంగీకరిస్తూ బయట రాష్ట్రాల్లో వైద్య సేవలను ప్రజలకు అందించాలనే తాపత్రయంతో అడుగులు ముందుకేశాం.


*గతంలో ఆరోగ్యశ్రీ - కత్తరింపులు* 

– ఆరోగ్య శ్రీ అంటే.. గతంలో ఎలా కత్తిరించాలి? ఎలా రూ.2.5 నుంచి 3 లక్షలలోపే దాటకుండా ఎలా వైద్యం ముగించేయాలి? క్యాన్సర్‌ లాంటి వైద్య చికిత్సలకు కూడా కీమో థెరపీ ఒకటి, రెండు కాదు... ఏడెనిమిది సార్లు వైద్యంచేసినా సరిపోదనే సంగతి, వాస్తవాలు తెలిసినా కూడా కేవలం 2 సార్లు మాత్రమే ఇచ్చేసి, రూ..2.5 లక్షలు దాటగానే.. ఆరోగ్యశ్రీ అయిపోయిందని, మీ వైద్యం మేం చేయలేమనే పరిస్థితి ఉండేది. 


ఇవాళ  మనం రూ.2.5– రూ.3 లక్షలు కాదు, ఏకంగా రూ.5 లక్షల స్థాయి దాటిపోయినా ఆరోగ్య శ్రీ పరిధిలో..., బోన్‌మ్యారో కింద రూ.10 లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్‌ను కూడా తీసుకువస్తున్నాం. 

– బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ రూ.10లక్షలు ఖర్చైనా ఆరోగ్యశ్రీ కింద చేయిస్తున్నాం. అంతేకాకుండా కాక్లియర్‌ ఇంప్లాంట్‌ కింద రెండు చెవులకూ.. మూగ, చెముడుతో పిల్లలు ఉండిపోకూడదని వారికి కూడా మంచి వైద్యాన్ని తీసుకురావాలన్న మంచి ఉద్దేశ్యంతో.. ఏకంగా బై కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌ చేయిస్తున్నాం. దీనికోసం రూ.12లక్షలు ఖర్చు చేస్తున్నాం. 


*హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌- ఆరోగ్యశ్రీ పరిధిలో*

– హార్ట్‌ట్రాన్స్‌ప్లాంటేషన్‌  ఆరోగ్య శ్రీ పరిధిలో ఉంది. ఏకంగా రూ.11 లక్షలు విలువచేసే ఆపరేషన్‌ను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. 

– స్టెమ్‌ సెల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ .. 2 మోడల్స్‌ ఆపరేషన్లను ఆరోగ్య శ్రీ కిందకు తీసుకు వచ్చాం. ఒకటి రూ.6.3 లక్షలు, ఇంకొకటి రూ.9.3 లక్షల ఖర్చు అవుతోంది. 

– మనిషికి ఎంత కావాల్సి వస్తే.. అంత వైద్యం చేసే విధంగా, ఎలాంటి కత్తిరింపులు లేకుండా... ఆరోగ్యశ్రీ పథకం అనేది తనను కాపాడుతుందనే భరోసా ఇస్తుందనే విధంగా, ఎంత అవసరమో అంతకాడికి పూర్తిగా ఇమ్మనే పరిస్థితిలో ఇవాళ ఆరోగ్య శ్రీ పనిచేస్తోంది. 


*ఆరోగ్యశ్రీ - గొప్ప మార్పులు*

– ఆరోగ్య శ్రీ కింద వచ్చిన గొప్ప మార్పులు ఇవి. 

– 29 నెలల కాలంలో వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ కింద మనం ఖర్చుచేసిన రూ.4వేల కోట్లు. 

– గత ప్రభుత్వం అయితే నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు సంవత్సరం పాటు పెట్టిన బకాయిలు కూడా దాదాపు రూ.680 కోట్లు కట్టుకుండా పోతే అవే డబ్బులను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించాం.


*21 రోజుల్లో చెల్లింపు*

– ఈరోజు నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఎక్కడా పెండింగ్‌ డబ్బులు లేవు. 21 రోజులు దాటితే చాలు.. నెట్‌వర్క్‌ఆస్పత్రులకు చెల్లించే విధంగా దగ్గరుండి నేనే డ్రైవ్‌ చేస్తున్నాను. ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని డ్రైవ్‌ చేస్తోంది. 

– వైయస్సార్‌ఆరోగ్య శ్రీ అందే సేవలన్నీ కూడా కనివినీ ఎరుగని విధంగా విస్తరించాం.


*వైద్యం ఖర్చు రూ.వేయి దాటితే ఆరోగ్యశ్రీ*

 వైద్యం ఖర్చు వేయి దాటితే చాలు, కచ్చితంగా ఆపేదవాడికి వైయస్సార్‌ఆరోగ్య శ్రీ అండగా ఉంటుంది, పేదవాడు ఇబ్బందిపడే పరిస్థితి రానేరాకూడదనే ఉద్దేశంతో... గతంలో 1059 ప్రొసీజర్లు మాత్రమే ఉంటే..., ఇవాళ 2446 ప్రొసీజర్లు ఆరోగ్య శ్రీ కింద విస్తరింపచేశాం. ఇక్కడితో ఆపేయమని ఏరోజు కూడా చెప్పలేదు. 

– ఇప్పటికీ కూడా.. ఇంకా నేను హెల్త్‌డిపార్ట్‌మెంట్‌కు గైడెన్స్‌ ఇస్తూనే ఉన్నాను. ఇంకా ఏ ప్రొసీజర్లు అవసరమో, అవన్నీకూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురమ్మని మంత్రికి, డిపార్ట్‌మెంట్‌కు ఇవాళకూడా చెప్తూనే ఉన్నాను. 

– గతంలో 1059 ప్రొసీజర్లకు కూడా అధ్వాన్న స్థితిలో ఎలా నడిపారో మనం చూశాం. ఆరోగ్యశ్రీని ఎలా కత్తిరించాలి? ఆరోగ్య శ్రీ వల్ల ప్రజలకు మంచి జరగకూడదు? ఆరోగ్యశ్రీని ప్రజలు మరిచిపోవాలి, వాళ్లంతట వాళ్లే డబ్బులు పెట్టుకుని వాళ్లంతట వాళ్లే ఆస్పత్రులకు వెళ్లాలి.. అన్నట్టుగా ఆరోగ్యశ్రీని నడిపించిన పరిస్థితులు మనం చూశాం.


*16 కొత్త టీచింగ్ ఆస్పత్రులు*

– రాష్ట్రంలో మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో టీచింగ్‌ ఆస్పత్రులు కేవలం 11 మాత్రమే. ఆ 11 టీచింగ్‌ఆస్పత్రులు నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కూడా చూశాం. 

– ఈరోజు మన అందరి ప్రభుత్వం కొత్తగా మరో 16 టీచింగ్‌ఆస్పత్రుల నిర్మాణం చేపట్టింది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి కూడా వైద్యకళాశాల, దానికి అనుబంధంగా నర్సింగ్‌కళాశాల, 500 పడకల సూపర్‌స్పెషాల్టీ హాస్పటిల్‌ ఇవన్నీకూడా ప్రతి పార్లమెంటు నియోజకవర్గం స్థాయిలో తీసుకు వచ్చే గొప్ప విప్లవానికి నాందిపలికామని సగర్వంగా కూడా తెలియజేస్తున్నాం.  


– దీనివల్ల ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా సూపర్‌స్పెషాల్టీ సేవలు అందుబాటులోకి వస్తాయి. డాక్టర్లు, పీజీ స్టూడెంట్లు, శిక్షణ పొందిన నర్సులు అందుబాటులోకి వస్తారు. పార్లమెంటు పరిధిలోకే వీటిని తీసుకు వచ్చే గొప్ప ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. 


*గిరిజన ప్రాంతాల్లో మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రులు*

– ప్రత్యేకంగా గిరిజనుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, గిరిజన ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకుని పాడేరు లాంటి గిరిజన ప్రాంతంలో ఇవాళ కొత్తగా ఒక టీచింగ్‌ ఆస్పత్రి నిర్మాణం జరుగుతోంది. 

– ఒక్క పాడేరులోనే టీచింగ్‌ఆస్పత్రి కడుతున్నామనేది ఒక అంశం అయితే, మరో ఐదు మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రులను ఐటీడీఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నాం. 

– గ్రామం నుంచి జిల్లా వరకూ ఆస్పత్రుల రూపాన్ని, సేవలను, సదుపాయాలను సమూలంగా మార్చే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 


*వైయస్సార్ విలేజ్ క్లినిక్స్‌*

– వైయస్సార్‌ విలేజ్‌క్లినిక్స్‌ అనే గొప్ప కార్యక్రమానికి గ్రామస్థాయిలోనే శ్రీకారం చుట్టాం. 

– అక్షరాల 10032 వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ను ఇవాళ గ్రామస్థాయిలోనే ఇవాళ వస్తున్నాయి. 125 మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో 560 అర్బన్‌ హెల్త్‌క్లినిక్స్‌ వస్తున్నాయి. 

– 1325 పీహెచ్‌సీల రూపురేఖలు మారిపోతున్నాయి. 

– 52 ఏరియా ఆస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయి.

– 191 కమ్యూనిటీ హెల్త్‌సెంటర్ల రూపురేఖలు మారిపోతున్నాయి. 

– వీటన్నింటినీ జాతీయ ప్రమాణాల స్థాయికి అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. నాడు – నేడు ద్వారా సదుపాయాలను కల్పిస్తున్నాం. డాక్టర్లను నియమిస్తున్నాం. 

– ఎంతమంది డాక్టర్లు ఉండాలో అంతమంది డాక్టర్లు ఉండేట్టుగా, ఎంతమంది నర్సులు ఉండాలో, అంతమంది నర్సులు ఉండేట్టుగా, ఎంతమంది పారామెడికల్‌స్టాఫ్‌ ఉండాలో.. అంతమంది పారామెడికల్‌ స్టాఫ్‌ ఉండేట్టుగా కూడా చేస్తున్నాం. 

– రూ.16,250 కోట్లు దీనికోసం ఖర్చు చేస్తున్నాం.


*వైద్య రంగంలో దాదాపు ౪౦ వేల పోస్టులు భర్తీ* 

– మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య శాఖలో 9712 పోస్టులు భర్తీచేశాం. విలేజ్, వార్డు సెక్రటేరియట్లలో మరో 15వేలమంది ఏఎన్‌ఎంలు భర్తీ కూడా అయిపోయింది. దాదాపుగా 25వేల పోస్టులు కాక, మరో 14,788 పోస్టులు ఈ ఫిబ్రవరి మాసంలోపు భర్తీచేసే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 

– ఒక్క వైద్యరంగంలోనే దాదాపు 40వేల పోస్టులుభర్తీచేస్తున్నాం.


*గతంలో అధ్వాన్నంగా ప్రభుత్వ ఆసుపత్రులు*

– ఇంతకుముందు మన ప్రభుత్వం ఆస్పత్రుల్లో పరిస్థితి ఏంటిన్నది ఒక్కసారి ఊహించుకోండి.

డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్‌ లేక.. ఎంత దారుణ పరిస్థితుల్లో ఉండేవో ఒక్కసారి ఆలోచన చేయాలి. 

– సిబ్బంది పూర్తిగా ఉండేట్టుగా, మెరుగైన సేవలు అందేలా పూర్తిచర్యలు తీసుకుంటున్నాం.


*10,032 వైయస్సార్ విలేజ్ క్లినిక్స్‌*

– మన గ్రామాల్లోనే 10032 వైయస్సార్‌ క్లినిక్స్, 560 అర్బన్‌హెల్త్‌ క్లినిక్స్‌ను ప్రభుత్వం కడుతోంది. 

– మన గ్రామాల్లోనే 67 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. 

– ఇందులో ఏఎన్‌ఎంలు ఉంటారు, మిడ్‌లెవల్‌ హెల్త్‌ప్రాక్టీషనర్స్‌ ఉంటారు, ఆశావర్కర్లు కూడా అక్కడే రిపోర్టు చేస్తారు. మిడ్‌లెవల్‌హెల్త్‌ ప్రాక్టీషనర్స్‌ 24 గంటలూ అందుబాటులో ఉంటారు. 

వీళ్లందరినీ కూడా పీహెచ్‌సీలలో ఉన్న డాక్టర్లతో అనుసంధానం చేస్తున్నాం. ప్రతిమండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌సీకి ఒక 104 వాహనం ఉంటుంది. ఒక డాక్టర్‌ పీహెచ్‌సీలో అందుబాటులో ఉండే, మరో డాక్టర్‌ 104లో తనకు కేటాయించిన నాలుగు, ఐదు గ్రామాలలో తిరుగుతాడు. అంటే ఫ్యామలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లో భాగంగా ఆ డాక్టర్‌ అదే గ్రామానికి రెండు సార్లు, మూడు, నాలుగు, ఐదు సార్లు కూడా పోయే పరిస్థితి వస్తుంది. ఊర్లో ప్రతి మనిషిని పేరుపెట్టి పిలిచే పరిస్థితి వస్తుంది. ఆ ఊర్లోకి పోక మునుపే ఆ ఊర్లో ఎంతమంది ఉన్నారు ? ఎంతమందికి ఏ రోగాలు ఉన్నాయి ? ఏ రకమైన మందులు తీసుకుని పోవాలనే అవగాహనతో 104లో మందుకు తీసుకుని పోయే పరిస్థితి కూడా వస్తుంది. ఈ ప్యామలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను ఆ గ్రామంలో ఉన్న విలేజ్‌ క్లినిక్‌కు అనుసంధానం చేసి, ఆ క్లినిక్‌లో మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రాక్టీస్‌నర్, ఏఎన్‌ఎంను, ఆశా వర్కర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఫ్యామలీ డాక్టర్‌కు కాన్సెప్ట్‌లో అక్కడికి వెళ్లడం వంటి వాటి ద్వారా గ్రామీణ వాతావరణంలో, అర్భన్‌ క్లినిక్స్‌లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. దీనికి కూడా బీజం పడింది. ఇవన్నీ కూడా రానున్న 6 నెలల్లో కార్యాచరణలోకి వస్తాయి.


*ఆరోగ్య ఆసరా*

ఆరోగ్యశ్రీలో మరో విప్లవాత్మకమైన మార్పు ఆరోగ్య ఆసరా.. ఆపరేషన్‌ అయినాక డాక్టర్‌ ఇన్నిరోజుల పాటు ఈ పేషెంట్‌ విశ్రాంతి తీసుకోవాలి. రెస్ట్‌ సమయంలో ఈ పేషెంట్‌ బయటకు వెళ్లి పనిచేసే పరిస్థతి ఉండదు. కుటుంబం తల్లడిల్లుతుంది. వారు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని విశ్రాంతి సమయంలో కూడా వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా తోడుగా ఉండేటట్టుగా నెలకు రూ.5వేలు ఇస్తూ రోగులకు అండగా, తోడుగా నిలబడుతుంది.


ఇదొక్కటే కాదు, ఇంతకముందు చాలా గ్రామాల్లో నేను తిరుగుతున్నప్పుడు పాదయాత్ర అంతా చూశాను. ఫెరాలసిస్‌ వచ్చి వీల్‌ ఛెయిర్‌కో, మంచానికో పరిమితమై బ్రతకలేని  పరిస్థితుల్లో ఉన్నవారిని పట్టించుకునే నాధుడు లేడు. డయాలసిస్‌ కోసం ఇబ్బందుల్లో ఉండి, నెల నెలా వారికి ఖర్చులు ఉంటాయని తెలిసినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రతి పేషెంట్‌కు.... లెప్రసీతో బాధపడుతున్నవారిని కూడా కలుపుకుంటే వీరికి నెలకు రూ.3వేలు ఇచ్చే కార్యక్రమం నుంచి మొదలుపెడితే, పెరాలసిస్‌ వాళ్లకి రూ.5వేలు, డయాలసిస్‌ చేసుకుంటున్న వారికి రూ.10వేలు వరకూ పించన్‌ ఇచ్చే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.


*ఉచిత కంటి పరీక్షలు*

 దృష్టి లోపాలున్నవారికి ప్రభుత్వమే ఉచితంగా కంటిపరీక్షలు, వైద్యం, శస్త్ర చికిత్సలు చేయించి కంటి అద్దాలు కూడా ఉచితంగా అందించే వైయస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాదాపుగా ఇప్పటికే 66  లక్షల మంది స్కూలు పిల్లలకు పూర్తిగా ష్క్రీమింగ్‌ చేసి 1.58 లక్షల మంది పిల్లలకు కంటి అద్దాలు అందించడమే కాకుండా 300 మంది పిల్లలకు శస్త్ర చికిత్స సైతం చేయించే కార్యక్రమం ఇప్పటికే పూర్తయింది.  


*అవ్వా తాతలకూ కంటి వెలుగు*

 14.28 లక్షల మంది అవ్వాతాతలకు ష్క్రీమింగ్‌ పూర్తి చేసి 7.83 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ పూర్తి చేసి,  1.13 లక్షలమందికి శస్త్ర చికిత్సలు కూడా పూర్తి చేశాం. ఇవి నిరంతరం జరుగుతున్న కార్యక్రమాలు. 


56.88 లక్షల మంది అవ్వాతాతలకు సంబంధించిన ఈ  కార్యక్రమం నిరంతరం జరుగుతుంది. ఇప్పటికే 14.28 లక్షల మందికి అవ్వాతాతలకు ష్క్రీమింగ్‌ పూర్తి చేశాం. మిగిలిన వాళ్లకు కూడా ఈ కార్యక్రమం చేసుకుంటూ పోతాం.

 

ఇంతకముందు ఆరోగ్యశ్రీలో ఏ మార్పులు తీసుకొచ్చామో చెప్పాను. ఆపరేషన్స్‌ అన్నీ ఏ స్ధాయిలోకి పెంచుకుంటూ పోయామంటే... బై కాక్లియర్‌ ఇంప్లాంట్‌ దగ్గర నుంచి హార్ట్‌ ఆపరేషన్, బోన్‌ మేరో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వరకు ఏ స్ధాయిలోఅంటే రూ.10 లక్షలు, రూ.12 లక్షలు వరకు పెంచాం. కొన్ని ఆపరేషన్స్‌కు రూ.18 లక్షల స్ధాయిలోకి కూడా వెళ్లి ఆపరేషన్స్‌ చేయించి రీయింబర్స్‌ చేయించిన గొప్ప పరిస్థితుల్లోకి ఈ రోజు ఆరోగ్యశ్రీని తీసుకెళ్లాం. 


*కాక్లియర్ ఇంప్లాంట్‌కూ*

పిల్లల మీద ప్రత్యేకంగా ధ్యాస పెట్టాం. వారికి ఏ అవసరం వచ్చిన ప్రభుత్వం తోడుగా ఉంటుంది, ఉండాలి అని చెప్పి గట్టిగా నమ్మే ప్రభుత్వం కాబట్టి పిల్లలకు సంబంధించి బై కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌కు రూ.12 లక్షలు ఖర్చవుతుందన్నా కూడా వెనుకాడకుండా చేస్తున్నాం. ప్రతి ఆపరేషన్‌ చేసి వదిలేయడమే కాకుండా సంవత్సరం పాటు వాయిస్‌ థెరపీకి కూడా డబ్బులిచ్చే కార్యక్రమం చేస్తున్నాం. 

బైకాక్లియర్‌ ఇంప్లాంట్‌ పెట్టిన తర్వాత ఆ బ్యాటరీ కూడా కొన్ని సంవత్సరాలకు చెడిపోతుంది. దాన్ని రీప్లేస్‌ చేయడానికి ఖర్చు రూ.1 లక్ష అవుతుందంటే... దాన్ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చమని చెప్పాం. 


*ఛైల్డ్ కేర్‌ కోసం ప్రత్యేక ఆస్పత్రుల నిర్మాణం*

పిల్లలపై ప్రత్యేకమైన ధ్యాస ఏ స్దాయిలో పెడుతున్నామంటే... పిల్లల హార్ట్‌ కేర్‌కు సంబంధించిన హాస్పిటల్‌ మన దగ్గర లేదని, హైదరాబాద్‌లో ఉన్న నీలోఫర్‌ ఆసుపత్రి లాంటి కేవలం ఛైల్డ్‌ హార్ట్‌ కేర్‌కు సంబంధించిన గొప్ప స్పెషాలిటీ మనకు కూడా కావాలని చెప్పి అదే పనిగా తిరుపతిలో మొన్న వెళ్లి పద్మావతి చైల్డ్‌ హార్ట్‌ సెంటర్‌ను ప్రారంభించాం. పిల్లలకు మంచి చేసేందుకు రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా మూడు  పీడియాట్రిక్, హార్ట్‌కు సంబంధించిన ఆసుపత్రులు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మూడు ప్రాంతాల్లో పిల్లలకు మంచి జరగాలని మనసాగా కోరుకుంటున్నాం. 


*ఆరోగ్యశ్రీ లో కోవిడ్‌ చికిత్స అందించిన ఏకైక రాష్ట్రం*

ఈ మధ్య కాలంలో మనం ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ మహమ్మారిని మన కళ్లతో చూశాం. కోవిడ్‌ వైద్యం వల్ల ప్రజలు నష్టపోకూడదు, ఇబ్బంది పడకూడదని చెప్పి ఏ రాష్ట్రం చేయని విధంగా కోవిడ్‌ వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏకైక ప్రభుత్వం మనదే. 

కోవిడ్‌ మహమ్మారి వల్ల ప్రజలు నష్టపోకూడదని ప్రభుత్వమే ఉచితంగా కోవిడ్‌ వైద్యాన్ని అందించింది. ఈ పరిస్థితులు మన రాష్ట్రంలో తప్ప బహుశా ఎక్కడా లేవు. 

 కోవిడ్‌ అనంతరం కూడా బ్లాక్‌ఫంగస్‌ లాంటి ఆరోగ్య సమస్యలు వస్తే .. అటువంటి రోగాలను కూడా దాన్నికూడా ఆరోగ్య శ్రీలోకి చేర్చిన మనసున్న ప్రభుత్వం మనది అని ఈ సందర్భంగా చెప్తున్నాను.


కోవిడ్‌పై యుద్ధంలో ఏరకమైన ప్రొసీజర్లను మనం అవలంభించామో... ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు. 


*31 సార్లు కోవిడ్ సర్వే చేశాం*

వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలు పీహెచ్‌సీలతో అనుసంధానమై ఫోకస్డ్‌టెస్టింగ్, ట్రేసింగ్‌.. ఏరకంగా చేశామో.. రాష్ట్రమంతా చూశారు.

– ప్రతి ఇంటికీ వెళ్లి, ప్రతి ఇంట్లో కూడా కోవిడ్‌ఉందా?లేదా? అడిగితెలుసుకుని .. అక్షరాల 31 సార్లు సర్వేచేశాం. మన వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయంలోని ఏఎన్‌ఎంలు సర్వే చేశారు. 

పేదలకు ఉచితంగా ఆరోగ్యశ్రీ వైద్యం అందిస్తూ..., మరోవైపున పరీక్షలు ట్రీట్‌మెంట్లలో అగ్రగామిగా రాష్ట్రం ముందు వరుసలో నిలిచింది. 

నవంబర్‌23 నాటికి, రాష్ట్రంలో మొత్తం 3.02 కోట్ల మందికి కోవిడ్‌పరీక్షలు చేశాం. 

ప్రతి 10 లక్షలమందికి రాష్ట్రంలో 5.66లక్షలమందికి దేశమే గర్వపడే విధంగా ఈస్థాయిలో పరీక్షలు చేసిన అతికొద్ది రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటి. 

జాతీయ స్థాయిలో కోవిడ్‌మరణాల రేటు 1.35 శాతం అయితే, మన రాష్ట్రంలో కోవిడ్‌వల్ల మరణాల రేటు 0.70 శాతం మాత్రమే. కోవిడ్‌వచ్చినా కూడా 99.3 శాతం మంది ప్రజలను మనం కాపాడుకోగలిగాం.


*87 శాతం మందికి సింగిల్ డోసు వ్యాక్సినేషన్‌*

కోవిడ్‌వచ్చిన కొత్తలో పరీక్షలు చేయించాలంటే.. ఆ శాంపిల్స్‌ను పూణేకు పంపించాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి మన రాష్ట్రంలో 19 ల్యాబ్‌లు 24 గంటలపాటు అందుబాటులో ఉన్నాయి. 

మన రాష్ట్ర జనాభాలో మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారి సంఖ్య 3,41,53,000 మంది. 

 దాదాపు 87శాతం మందికి మన రాష్ట్రంలో ఒక డోసు తీసుకున్నవారు ఉన్నారు. 

రెండు డోసులు తీసుకున్నవారు అక్షరాల 2.39కోట్ల మంది. అంటే దాదాపు 61శాతం మందికి రెండో డోసుకూడా ఇవ్వడం జరిగింది.  దురదృష్టవశాత్తూ వ్యాక్సినేషన్‌ అన్నది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేనిది. కేంద్ర ప్రభుత్వం ఎన్నిడోసులైతే పంపిస్తారో.. అన్ని డోసులు మాత్రమే ఇవ్వగలుగుతాం. అన్ని డోసులు మాత్రమే ప్రజలకు చేయగలుగుతాం. అయినప్పటికీ 87శాతం మందికి 18 ఏళ్లకు పైబడ్డ వారికి కనీసం ఒక డోసైనా ఇవ్వగలిగాం. 

కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్న వ్యాక్సిన్ల షెడ్యూల్‌ప్రకారం అయితే డిసెంబర్‌నాటికి రాష్ట్రంలో 18 ఏళ్లకుపైబడి ఉన్నవారికి 100శాతం మందికి ఒకడోసు ఇస్తామని, మార్చి నాటికి పూర్తిగా 2 డోసులు ఇవ్వడం జరుగుతుంది.


కోవిడ్‌వల్ల తల్లీ, తండ్రీ ఇద్దర్నీ కోల్పోయిన పిల్లలకు రూ.10లక్షలను డిపాజిట్‌చేసి వారి ఆలనా,పాలనా చూసుకునే ఏర్పాటుకూడా చేసిన తొలి ప్రభుత్వంకూడా మనదే. 

మనంచేసిన తర్వాతనే ఇతర రాష్ట్రాలు, కేంద్రం కూడా ఇంచుమించు ఇదేబాటలో నడిచాయి. 

మానవత్వ పరంగా ఎలా ఉండాలో దేశానికి మన రాష్ట్రం నుంచే దారి చూపించాం. 

మనది మనిషిని బ్రతికించాలని, ప్రతి ఒక్క ప్రయత్నం చేసే మనసున్న ప్రభుత్వం మనది. 

 కోవిడ్‌వైద్యంకోసమే కొద్దినెలలుగా... అంటే 18–20 నెలలుగా మనం ఖర్చు చేసింది రూ. 3,648 కోట్లు. 

– ఎమర్జెన్సీల్లో ప్రాణాలు కాపాడు 108, 104 సేవలకు అర్థంచెప్తూ ఏకంగా 1068 వాహనాలను, మండలానికి ఒకటి కింద పంపాం. 

ఈ మొబైల్‌ వాహనాల ద్వారా ప్రాణాలను మనం కాపాడుగులుగుతామనే అర్థాన్ని మనం చెప్పాం. దేశానికి మార్గం చూపించాం. బెంజ్‌ సర్కిల్‌లో డిస్‌ప్లే కూడా చేసి చూపించాం. 

 ఫ్యామిలీ డాక్టర్‌కాన్సెప్ట్‌ను ప్రజలకు ఇంకా దగ్గరకు చేర్చేందుకు ప్రతి మండలానికి ఒక పీహెచ్‌సీ కాదు, రెండు పీహెచ్‌సీలు ఉండాలని చెప్పి ఏకంగా మార్పులు చేసి మరో 432 , 104 వాహనాలను కొనుగోలు చేస్తున్నాం. అవికూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. 


 ప్రభుత్వ ఆస్పత్రులకు పోవాలంటే.. ఎవరైనా భయపడే పరిస్థితి గతంలో ఉండేది.

 రకరకాలుగా కథనాలు, లైట్లు లేక సెల్‌ఫోన్లలో ఆపరేషన్లు చేయించడంపై కథనాలు చూశాం. 

ఎలుకలు కొరికి బాలుడు చనిపోయిన ఘటనపై కథనాలు కూడా చూశాం. అటువంటి స్థాయి నుంచి ఇవాళ ఆస్పత్రులు అన్నీకూడా మార్చే గొప్ప విప్లవాత్మక కార్యక్రమాలు జరుగుతున్నాయి.

 

అదే ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు ఇస్తే.. అవి తినడానికికూడా రోగులు భయపడే పరిస్థితి ఉండేది. కారణం ఏంటంటే.. ప్రభుత్వాసుపత్రుల్లో మందులు తింటే.. రోగం నయంకాదనే నానుడి ఉండేది. 

అలాంటి పరిస్థితి నుంచి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు డబ్ల్యుహెచ్‌ఓ, జీఎంపీ వీటి ప్రమాణాలు ఉంటే తప్ప ... పెట్టడం లేదు. ఏకంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల చరిత్రనే మార్చాం. 


మరో ముఖ్యమైన మార్పుకూడా వైద్య ఆరోగ్య రంగంలో జరగబోతోంది. 

ప్రభుత్వ ఆస్పత్రులు అన్నీకూడా నాడు – నేడు కాన్సెప్టుతోనూ మారుస్తున్నాం. 16 కొత్త టీచింగ్‌ ఆస్పత్రులతో మార్పులు చేస్తున్నాం. ప్రభుత్వ రంగమే కాకుండా.. సూపర్‌ స్పెషాల్టీ సేవలు ప్రైవేటు రంగంలో డెవలప్‌చేసేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది. 

సూపర్‌స్పెషాల్టీ సేవలు అందించడానికి ఆస్పత్రి కట్టడానికి రూ.100 కోట్లు పైబడి పెట్టుబడి పెట్టేందుకు ముందుకురావాలని పిలుపునివ్వడం జరిగింది. భూములు ఇస్తాం, సూపర్‌స్పెషాల్టీ ఆస్పత్రులు కట్టండి, 50శాతం బెడ్లు ఆరోగ్య పరిధిలోకి అందుబాటులోకి తీసుకురండి ... అన్నిరకాలుగా సపోర్టు చేస్తాం.. అని వారికి చెప్పాం. 


జిల్లాల్లో సూపర్‌ స్పెషాల్టీ సేవలు ఏవైతో ఉండాలో... జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని సూపర్‌ స్పెషాల్టీ సేవలను ప్రైవేటు రంగంలో తీసుకురావడానికి ప్రోత్సహిస్తున్నాం. వచ్చే కొన్నినెలల్లో ఇవి మనకు కనిపిస్తాయి. 

పేదలమీద మమకారంతో, ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వంగా మన అందరి ప్రభుత్వం వేస్తున్న అడుగులు.


దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలందరి చల్లని ఆశీస్సులు ఇంకా గొప్పగా అభివృద్ధిచేసే పరిస్థితి... ఇవ్వాలి, రావాలని చెప్పి కోరుకుంటూ శెలవు తీసుకుంటున్నాను అని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

Comments