భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల సమస్యలు తీర్చేందుకు అధికారులు ఒక టీంగా కలిసికట్టుగా పని చేయాలి

 *24/7 ప్రజలకు అందుబాటులో ఉండాలి*


*: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల సమస్యలు తీర్చేందుకు అధికారులు ఒక టీంగా కలిసికట్టుగా పని చేయాలి*


*: అర్హులకు నష్టపరిహారం వెంటనే అందించాలి*


*: రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు శంకర నారాయణ*


అనంతపురం, నవంబర్ 24 (ప్రజా అమరావతి):


*జిల్లాలో ఇప్పటికే కురిసిన భారీ వర్షాల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు, నష్ట పరిహారాన్ని పంపిణీ చేసేందుకు, రాబోయే భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా 24/7 ప్రజలకు అందుబాటులో ఉండాలని రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు శంకర నారాయణ ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనములో జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన జరిగిన నష్టం, పరిహారం పంపిణీ, సహాయక చర్యలపై సంబంధిత అధికారులతో మంత్రి శంకర నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి, జాయింట్ కలెక్టర్ లు నిశాంత్ కుమార్, ఏ.సిరి, నిశాంతి, గంగాధర్ గౌడ్, పెనుకొండ సబ్ కలెక్టర్ నవీన్, ట్రైనింగ్ కలెక్టర్ సూర్యతేజ, తదితరులు పాల్గొన్నారు.*


*ఈ సందర్భంగా మంత్రి శంకర నారాయణ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల సమస్యలు తీర్చేందుకు అధికారులు ఒక టీంగా కలిసికట్టుగా పని చేయాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని, ఇప్పటికే వర్షాల వల్ల నష్టపోయిన వారికి నష్టపరిహారం పంపిణీ వెంటనే పూర్తి చేయాలన్నారు. మళ్లీ ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో నిత్యం అలర్ట్గా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు కట్టుదిట్టంగా సహాయ చర్యలు అందించడం పై ప్రత్యేక దృష్టి పెట్టారని, వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయక చర్యలు అందజేయడంలో ఎలాంటి అలసత్వం వహించరాదన్నారు. వర్షాల నేపథ్యంలో నష్టపరిహారం పంపిణీ, పునరావాస కేంద్రాల ఏర్పాటు, విద్యుత్ సరఫరా, శానిటేషన్ కార్యక్రమాలు, తాగునీటి సరఫరా తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.*


*రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నష్ట పరిహారం బాధితులకు సక్రమంగా పంపిణీ చేశారా లేదా అనేది ఆర్డీవోలు పరిశీలన చేయాలన్నారు. వర్షాల వల్ల సంభవించిన ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించి నష్ట పరిహారం పంపిణీ తక్షణం పూర్తిస్థాయిలో జరగాలన్నారు. వర్షాల నేపథ్యంలో నష్టపరిహారం పంపిణీ పై రెవెన్యూ అధికారులు పరిశీలన చేయాలని, అర్హులకు మాత్రమే పరిహారం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ అనర్హులకు చోటు లేకుండా చూడాలన్నారు. ప్రజల సమస్యలు తీర్చేందుకు అధికారులు అంతా కలిసికట్టుగా పని చేయాలన్నారు. వర్షాల వల్ల సంభవించిన నష్టాలను పరిశీలించేందుకు కేంద్ర బృందం వచ్చేనాటికి వ్యవసాయం పరిధిలో పంట నష్టాలను, రోడ్లు, ట్యాంకులు, ఇళ్ల డ్యామేజ్ వివరాలను సిద్ధం చేయాలని, ఫోటోలతో సహా సిద్ధంగా ఉండాలన్నారు. నష్టపోయిన బాధితులకు పరిహారం అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు.* 


*వర్షాల వల్ల విద్యుత్ సరఫరాలో ఆటంకాలను గుర్తించి లైన్మెన్ లు, హెల్పర్లు పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. కూలిపోయే విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ లో ఏఈలు, లైన్మెన్ లు, హెల్పర్లు నిరంతరం పని చేయాలన్నారు. పంచాయతీ స్థాయిలో శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని, మురుగు కాలువలు శుభ్రం చేయాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, స్థాయిలో అంటువ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ అధికారులు పగిలిపోయిన తాగునీటి పైప్లైన్ ల మరమ్మతులు చేయాలని, మళ్లీ వర్షం వచ్చినా మరింత నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 26, 27, 28 న వర్షం వస్తే స్థానిక పాఠశాలల్లో, కళాశాలల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో వాలంటీర్ల సహాయంతో పడిపోయే స్థితిలో ఉన్న ఇళ్లను గుర్తించాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. మళ్లీ వర్షాలకు రానున్న నేపథ్యంలో టోల్ ఫ్రీ నెంబర్ ని ప్రజలందరికీ తెలియజేయాలని, ఏ ఫిర్యాదులు వచ్చినా తక్షణం స్పందించి సమస్య పరిష్కరించాలన్నారు. వర్షాల వల్ల ఇళ్లలోకి నీరు వస్తే మోటార్ పంపు లతో నీటిని బయటకు పంపించాలన్నారు. రోడ్డు దెబ్బతిని ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ప్రాంతాలలో వాహనాల రాకపోకలను డైవర్షన్ చేయాలని, వెంటనే దెబ్బతిన్న రహదారులు, కల్వర్టుల మరమ్మతులు పూర్తి చేసి రోడ్డు కనెక్టివిటీని అందించాలని, యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోని ఏఈలు, జెఈలను ఏర్పాటు చేసి పనులు చేపట్టాలని సూచించారు.*


*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో ఈనెల 19, 20 వ తేదీలలో భారీ వర్షపాతం నమోదైందని, జిల్లాలో గత 30, 40 ఏళ్లలో ఎప్పుడూ కురవని వర్షం కురిసిందని, దీంతో జిల్లాలో పలు ప్రాంతాలలో రవాణా వ్యవస్థ దెబ్బతిందని, ఎక్కువ పంట నష్టం జరిగిందని, లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ, ఫైర్, పోలీస్, క్షేత్రస్థాయి సిబ్బంది చాలా కష్టపడి పని చేశారని, అనంతపురం, పెనుగొండ, కదిరి డివిజన్ పరిధిలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వర్షాల వల్ల జిల్లాలో దెబ్బతిన్న 7,200 కుటుంబాలలో ఇప్పటి వరకు 75 శాతానికి పైగా నిత్యవసర వస్తువులను పంపిణీ చేయడం జరిగిందని, బుధవారం సాయంత్రం లోగా పూర్తిగా 100 శాతం నిత్యవసర వస్తువులను వర్షం వల్ల దెబ్బతిన్న కుటుంబాలకు పంపిణీ చేయాలన్నారు. దాంతోపాటు ఇంట్లోకి నీరు చేరిన, ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్న వారికి 2 వేల రూపాయల చొప్పున తక్షణం పరిహారం అందజేయాలన్నారు. వర్షాల వల్ల పశువులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తాగునీరు ఏర్పాటు చేయాలని, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ చేయాలని, ఈ విషయమై సచివాలయ సిబ్బంది, సంబంధిత అధికారులు సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాగునీటి సరఫరా, విద్యుత్ పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వర్షాల వల్ల పశువులు, గొర్రెలు, మేకలు చనిపోయినవాటికీ పరిహారం పంపిణీ అందించాలన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బి పరిధిలో దెబ్బతిన్న రోడ్లు మరమ్మతు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా శానిటేషన్ యాక్టివిటీ లను చేపట్టాలన్నారు. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ పరిధిలోని ఇంజనీరింగ్ శాఖలు దెబ్బతిన్న రోడ్లు, ట్యాంకులకు, పైప్లైన్ లకు సంబంధించి శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఇరిగేషన్ పరిధిలోని మైనర్, మేజర్ చెరువులు, ట్యాంకుల పరిధిలో ఎంత వర్షం పడింది, ఎంత వర్షం పడితే ఎంత నీరు చేరుతుంది అనేది ఏది మ్యాపింగ్ ద్వారా గుర్తించాలన్నారు. ఈనెల 26 నుంచి 29వ తేదీ వరకు భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులంతా పక్కా ప్రణాళికతో విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, జిల్లాలో ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.*


*ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు బాగా పని చేశారని, ఈనెల 26, 27, 28వ తేదీలలో మళ్లీ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాలంటీర్, సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో, పట్టణాల్లో పడిపోయే స్థితిలో ఉన్న ఇళ్లను గుర్తించాలని, అందులో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పశువులకు కూడా ప్రాణనష్టం జరగకుండా చూడాలన్నారు. భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో సహాయక చర్యల కోసం అన్ని శాఖల సమన్వయంతో ఉండాలన్నారు. చెరువుల్లో ఎంత నీరు వస్తే ఎంత నీటినిల్వ వస్తుందనేది ముందుగానే చూసుకోవాలని, రాబోయే వర్షాల నేపథ్యంలో అధికారులంతా విపత్తు నుంచి బయటపడేందుకు సన్నద్థంగా ఉండాలన్నారు.*


*ఈ సమావేశంలో సిపిఓ ప్రేమ చంద్ర, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వెంకటరమణ, హెచ్ఎల్సి ఎస్ఈ రాజశేఖర్, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్, నగరపాలక సంస్థ కమిషనర్ పివివిఎస్ మూర్తి, పంచాయతీరాజ్ ఎస్ఈ భాగ్యరాజ్, హౌసింగ్ పిడి కేశవ నాయుడు, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనాథ్ రెడ్డి, డీపీఎం ఆనంద్, జిల్లా పరిషత్ సీఈఓ భాస్కర్ రెడ్డి, డిఎంఅండ్హెచ్ఓ కామేశ్వర ప్రసాద్, పశుసంవర్ధక శాఖ జేడీ వెంకటేష్, ఆర్డీవోలు నిశాంత్ రెడ్డి, మధుసూదన్, వెంకటరెడ్డి, వరప్రసాద్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.