విద్యకు పేదరికరం అడ్డు కాకూడదు


అమరావతి (ప్రజా అమరావతి);


*జగనన్న విద్యాదీవెన పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌.*


*ఈ ఏడాది జగనన్న విద్యాదీవెనలో భాగంగా మూడో విడతగా దాదాపు 11.03 లక్షల మంది విద్యార్ధులకు రూ.686 కోట్లను క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.**ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...;* 


*విద్యకు పేదరికరం అడ్డు కాకూడదు


*

దేవుడి దయతో ఈ రోజు మరోమంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అక్షరాలా 11.03 లక్షల మంది పిల్లలకు మంచి జరిగేలా, 9,87,965 మంది ఆ పిల్లల తల్లుల ఖాతాల్లో మూడో త్రైమాసికానికి సంబంధించి, త్రైమాసికం పూర్తయిన వెంటనే వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం గొప్పగా అమలవుతున్న పరిస్థితి. పెద్ద చదువులు చదవడానికి, పెద్దస్ధాయికి ఎదగాడానికి పిల్లలకు తమ పేదరికం అడ్డు రాకూడదు, అడ్డు కాకూడదు. వారికి మంచి అన్ని రకాలుగా జరగాలి. ఆ పిల్లకు అండగా, తోడుగా నిలబడుతూ ఈ రోజు మనం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలుచేస్తున్నాం. దీని పేరే జగనన్నవిద్యాదీవెన.


పేదరికం పోవాలన్నా, మన తలరాతలు మారాలన్నా ఈ పేద సామాజిక వర్గాల్లోనుంచి, ప్రతి ఒక్క వర్గంలో నుంచి ఇంజనీర్లు, డాక్టర్లు వంటి పెద్ద చదువులు చదువుకున్నవారి సంఖ్య బాగా పెరగాలి. వీళ్లంతా పెద్ద చదువులు చదవగలిగితే వీళ్ల తలరాతలు మారుతాయి. పేదరికంలో మగ్గుతున్న వీరి కుటుంబాలు ఈ చదువులతో బయటకు వస్తాయి. మన లక్ష్యం ఈ రోజు వందకు వందశాతం అక్షరాస్యత కాదు. వందకు వందశాతం గ్రాడ్యుయేట్లగా నిలబెట్టాలన్నదే మన లక్ష్యం. ఇలాంటి మంచి ఆశయాలతో, మంచి మనస్సుతో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో జగనన్న విద్యాదీవెనగా అందిస్తున్నాం. ఇలా ఈ త్రైమాసికానికి ఈ యేడాది మూడో విడతకు సంబంధించి మూడు  నెలలకు ఒక్కసారి ఇచ్చే కార్యక్రమంలో రాష్ట్రంలోని 11.03 లక్షల మంది పెద్ద చదువులు చదువుతున్న పేద తమ్ముళ్లకు, పేద చెల్లెమ్మలకు ఈ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా రూ.686 కోట్లు ఈ రోజు 9,87,965 మంది పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. 


*గత ప్రభుత్వ బకాయిలూ చెల్లించాం*

మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ ఒక్క పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం మీదే గత ప్రభుత్వం చెల్లించాల్సిన, బకాయిలుగా పెట్టి వదిలేసిన రూ.1778 కోట్ల రూపాయలు బకాయిలు కూడా కలిపి, మనం చేసిన ఖర్చు అక్షరాలా రూ.6259 కోట్లు. ఈ డబ్బులతో దాదాపు 21,48,477 మంది విద్యార్ధులకు మేలు జరిగింది. నాన్నగారు ఉన్నప్పుడు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఆనే పథకాన్ని అప్పట్లో తీసుకొచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, నాయకులు ఎలా ఈ పథకాన్ని పూర్తిగాదెబ్బతీసుకుంటూ వచ్చారో మనందరం మన కళ్లారా చూశాం. కాలేజీలకు ఏళ్ల తరబడి ఫీజులు చెల్లించకుండా బకాయిలు పెడితే, ఆ కాలేజీల్లో నాణ్యత గురించి అడిగే పరిస్థితి ఎక్కడ వస్తుంది ? వాళ్లు జీతాలు ఏమిస్తారు ? వాళ్ల చదువులు బాగా చెప్పాలని చెప్పి ఆశించడం కూడా ఎలా కుదురుతుంది ? ఆ కాలేజీ యాజమాన్యాలు సహజంగానే చదువుకుంటున్న పిల్లలను పరీక్షలు రాయనివ్వమని చెప్పి, కాలేజీకు రావద్దని చెప్పిన ఘటనలు మనం చూశాం. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి. 


*ఆ సంఘటన కళ్ల ముందే...*

ఇప్పటికి కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడల్లా ..నెల్లూరు జిల్లాలో సంఘటన నా కళ్లముందు కనిపిస్తూ ఉంటుంది. నా పాదయాత్ర జరుగుతున్నప్పుడు నేను వెళ్తున్న దారిలో ఎదురుగా ఒక ఇంట్లో  ఓ ఫోటో పెట్టుకుని ఉన్న ఫ్లెక్సీ కట్టారు. ఆ ఇంట్లో నుంచి అమ్మా, నాన్నా ఇద్దరూ వచ్చారు. 

ఆ ఫ్లెక్సీ అక్కడ కట్టి ఉంటే... ఆ పిల్లవాడు ఫోటో చూసి నేను అడిగితే... ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా పాక్షికంగానే ఇస్తున్నారు. ఫీజులు చూస్తే రూ.70 వేలు, ఇచ్చేదేమో రూ.35 వేలు, అదీ సమయానికి ఇవ్వరు. మిగిలిన ఫీజులు, బోర్డింగ్‌ అండ్‌ లాడ్జింగ్‌ ఖర్చులు అన్నీ కలుపుకుంటే సుమారుగా మళ్లీ   దాదాపుగా రూ.70 వేలు పై చిలుకు ఖర్చు వస్తుంది. ఆ ఖర్చులు కట్టలేని పరిస్థితుల్లో నా కొడుకు నా మీద ఒత్తిడి తీసుకునిరాలేక,  తాను చనిపోయాడని చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను.


*ఆ పరిస్థితి ఎప్పుడూ రాకూడదనే...* 

ఆ పరిస్థితి ఎప్పడూ రాకూడదని, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి అడుగూ ఆ దిశగానే వేశాం. ఈ వ్యవస్ధలోకి ఒక గొప్ప మార్పు తీసుకొస్తూ అరకొరగా ఇచ్చే ఫీజులు, సంవత్సరాల తరబడి బకాయి పెట్టి తర్వాత ఇచ్చే పరిస్థితి..ఇలా రెండింటిని మార్పు చేశాం. పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ కార్యక్రమాన్ని తీసుకువచ్చాం. 

 ఈ రోజు పాక్షిక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంటే అరకొరగా కొందరికి మాత్రమే రీయింబర్స్‌మెంట్‌ చెల్లించే విధానాన్ని మార్చి, అర్హులైన పేద విద్యార్ధులందరికీ కూడా పూర్తిగా వందకు వందశాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నాం. 

ఈ రోజు కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదవాలనుకున్నా... అంతమందికీ కూడా జగనన్న విద్యా దీవెనగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేస్తున్నాం.


*ఇంజనీరింగ్‌, మెడిసిన్‌కూ రీయింబర్స్‌మెంట్‌*

దేశంలో ఎక్కడా లేని విధంగా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ ఇలా కోర్సులేవైనా పేద విద్యార్ధులందరికీ కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నాం. పీజీ కోర్సులు కూడా ప్రభుత్వ కాలేజీలలో చదివే వారికి అమలు చేస్తున్నాం. పేద విద్యార్ధుల తల్లిదండ్రుల ఖాతాల్లో ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు ప్రతి మూడు నెలలకొకసారి జమ చేస్తూ, కాలేజీలకు ఆ పిల్లల తల్లులే వెళ్లి అక్కడ పరిస్థితులను, వసతులను తల్లులే చూసి, కాలేజీలకు ఫీజులు చెల్లించే బాధ్యతను తల్లిదండ్రులకే అప్పగించాం. 


*ప్రశ్నించే హక్కు కలుగుతుంది*

తల్లులు ప్రతి మూడు నెలలొకసారి కాలేజీలకు వెళ్లి ఫీజులు నేరుగా వాళ్లే చెల్లించడం ద్వారా వారి పిల్లల చదువులు ఎలా జరుగుతున్నాయి ? పిల్లలు బాగా చదువుతున్నారా ? లేదా ? అన్న విషయం అవగతమవడంతో పాటు కాలేజీల్లో ఉన్న లేబ్స్‌,  వసతులు వంటి విషయాలను కూడా తల్లులు పరిశీలిస్తారు. లోటుపాట్లు ఏమైనా ఉంటే యాజమాన్యాలను ప్రశ్నించగలుగుతారు. ఎందుకంటే డబ్బులు ఆ తల్లులే కడతారు కాబట్టి. దీనివల్ల కాలేజీలకు జవాబుదారీతనం పెరుగుతుంది. కాలేజీ స్ధితిగతులు, పిల్లల బాగోగులపై తల్లుల పర్యవేక్షణ ఈ రెండూ జరుగుతాయి. 


*1902 కు ఫిర్యాదు చేస్తే చాలు*

ఏదైనా కాలేజీలకు వెళ్లినప్పుడు అక్కడ పరిస్థితులు బాగాలేనప్పుడు కాలేజీల యాజమాన్యాలకు ప్రశ్నించడమే కాకుండా... ప్రభుత్వానికి కూడా 1902 నెంబరుకు ఫోన్‌ చేయడం ద్వారా తెలియజెప్పే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని ఆ కాలేజీల్లో స్ధితిగతులను మార్పు చేయించే దిశగా అడుగులు వేయిస్తుంది. దీనివల్ల కాలే జీలు బాగుపడతాయి. వాటిమీద జవాబుదారీతనం పెరుగుతుంది. 


*అమ్మలకు మనవి*

తల్లులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఒక్క మనవి చేస్తున్నాను. జగనన్న విద్యా దీవెన పేరుతో  ఒక మంచి ఉద్దేశ్యంతో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీ ఖాతాల్లో జమ అయిన ఈ కాలేజీలకు సంబంధించిన పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సొమ్ము ఏదైతే మీకు అందుతుందో... అది వారం పదిరోజుల్లోగా కళాశాలకు వెళ్లి, అక్కడ తప్పకుండా ఫీజులు చెల్లించాల్సిన బాధ్యత మీమీద ఉంది. ఎందుకంటే ప్రభుత్వం విడుదల చేసిన ఈ ఫీజులు మీకు అందిన తర్వాత కూడా మీరు కాలేజీలకు చెల్లించకపోతే తదుపరి విడతలో ఆ ఫీజుల డబ్బులు, మీ ఖాతాలకు కాకుండా నేరుగా కళాశాలలకే ఇవ్వక తప్పని పరిస్థితి ప్రభుత్వంపై ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి తల్లి గుర్తుపెట్టుకోవాలని  ప్రతి తల్లి ఒక అన్నగాను, తమ్ముడుగాను గుర్తుపెట్టుకోవాలని వినయపూర్వకంగా విన్నవించుకుంటున్నాను.


*ప్రయివేటులోనూ కోటా*

గతంలో మెరిట్‌ ఉన్నా. .ఆర్థికభారం కారణంగా ప్రై వేటులో ప్రసిద్ధ కాలేజీలు, ప్రైవేటు యూనివర్శిటీల్లో పేద విద్యార్థులకు అడ్మిషన్లు పొందలేని పరిస్థితి గతంలో ఉండేది. ఇదంతా కూడా మన కళ్లారా మనం చూశాం. వీటిలో మార్పులు తీసుకు వచ్చాం.

ఈ రోజు మనందరిప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రైవేటు యూనివర్శిటీల్లో మెడికల్, డెంటల్‌ అయితే కచ్చితంగా యాభైశాతం సీట్లు, ఇంజనీరింగ్, డిగ్రీ వంటి ఇతర కోర్సుల్లో అయితే 35 శాతం సీట్లు కచ్చితంగా కన్వీనర్‌ కోటాగా,  గవర్నమెంటు కోటాలో భర్తీచేయాలని మార్పులు తీసుకు వచ్చి చట్టం చేశాం. దీనివల్ల ఇంతకుముందు అవకాశంలేని పేద విద్యార్థులకు అవకాశం వస్తోంది. ఈ ఏడాది దాదాపు 2118 విద్యార్థులకు అవకాశం వచ్చింది. వీరికి పూర్తి ఫీజు రియంబర్స్‌ మెంట్‌ ఇస్తున్నాం. ప్రతిభ ఉన్న అర్హులైన పేదవిద్యార్థులకు గతానికి భిన్నంగా చదువుకునే అవకాశం లభించింది. విద్యారంగంలో ఒక గొప్ప మార్పు తీసుకురావడంలో అడుగులు పడ్డాయి. ఆ కోటాలా సీట్లు పొందిన పేద విద్యార్ధులకు కూడా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మన ప్రభుత్వమే అందిస్తుంది కాబట్టి... ప్రతిభ ఉన్న అర్హులైన పేద విద్యార్ధులకు గతానికి భిన్నంగా ఈ ప్రఖ్యాత ప్రైయివేటు యూనివర్సిటీలలో కూడా చదువుకునే అవకాశం లభించింది. మనసున్న ప్రభుత్వంగా మనం ఇవన్నీ చేస్తున్నాం.

జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనలద్వారా చదువులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి.*ఏ స్ధాయిలోకి ఈ ఫలితాలు వస్తున్నాయంటే...*                                                                   ఇటీవల హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సర్వేరిపోర్టులో మన రాష్ట్రంలో ఉన్నత విద్యకోసం 17 యేళ్ల నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉన్న కాలేజీల్లో చేరే విద్యార్థుల గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌ రేషియే) 2020 నాటికి 35.2 శాతానికి పెరిగింది.

దేశ వ్యాప్తంగా ఇదే సమయంలో 2018 –19 తో పోలిస్తే.. జీఈఆర్‌ రేషియో 2019–20 మధ్య పెరుగుదల 3.04 అయితే, మన రాష్ట్రంలో 8.6 శాతంగా నమోదయ్యింది.


*దేశ వ్యాప్తంగా జీఈఆర్‌*

దేశవ్యాప్తంగా జీఈఆర్‌  పెరుగుదల ఎస్సీల్లో  1.7శాతం, ఎస్టీల్లో 4.5 శాతం, బాలికల్లో 2.28శాతం ఉంటే... మన రాష్ట్రంలో గణనీయమైన ఫలితాలున్నాయి. ఎస్సీల్లో 7.5, ఎస్టీల్లో 9.5శాతం, విద్యార్థినుల్లో 11.03 శాతంగా నమోదయ్యింది.

ప్రతి అడుగు కూడా దేశం కన్నా మెరుగ్గా వేస్తున్నాం. అయినా కూడా మనం అనుకున్న లక్ష్యాలను చేరాలంటే  ఇంకా మనం చాలా దూరం పోవాలి. రాష్ట్రంలో కనీసం 80 శాతం పై చిలుకు లక్ష్యంగా పెట్టుకున్నాం. చదువులకోసం భారం ఉండకూడదు, గొప్ప చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేయాలి. దేశంకన్నా మనం మెరుగ్గా ఉన్నాం, ప్రయాణించాల్సిన దూరం చాలా ఉంది. మీ అందరి ఆశీస్సులు, దేవుడి దయతో ఆ గమ్యాన్ని మనం చేరుకుంటామన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది.


*వసతి దీవెన*

పిల్లలను పెద్ద చదువుల్లో బడిబాట పట్టించే కార్యక్రమంలో భాగంగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఒక్కటే సరిపోదు.  వసతి దీవెన ఆనే పథకాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి.. ప్రభుత్వం గమనించింది. తల్లిదండ్రులు ఎవరూ కూడా పిల్లలను డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ కాలేజీల్లో చదవించాలంటే  వాళ్లు ఉండాడానికి బోర్డింగ్, మెస్‌ ఖర్చులు కూడా సంవత్సరానికి రూ.20వేలు అయితే, అవి కూడా చెల్లించలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు.  ఆ పరిస్థితులు కూడా రాకూడదు, తల్లిదండ్రులెవరూ కూడా పిల్లల చదువులు విషయంలో అవస్థలు పడకూడదు, అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడని ఉద్దేశ్యంతో వసతిదీవెన పథకం పెట్టాం. ఇలా జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ చదివేవారికి రూ.10వేలు, పాలిటెక్నిక్‌ చదివేవాళ్లకి రూ.15వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్,మెడిసిన్‌ ఇలా ఇతర కోర్సులు చదివేవారికి రూ.20వేల రూపాయలు ఇస్తున్నాం. ఈ వసతి దీవెన పథకంలో ఇప్పటివరకూ రూ.2267 కోట్ల రూపాయలు ఇప్పటివరకూ నేరుగా తల్లుల ఖాతాల్లోకి పిల్లల తరపున జమ చేశాం.


ఆ పిల్లలకు మంచి మేనమామలా, తల్లులందరికీ మంచి అన్నగా, తమ్ముడిగా మంచి చేస్తున్నాం.

విద్యాదీవెన, వసతి దీవెన ఈరెండు పథకాలకే కలిపి ఈ రెండున్నర ఏళ్లలో రూ.8526 కోట్లకుపైగా ఇచ్చాం.


*16 కొత్త మెడికల్ కాలేజీలు*

కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు తీసుకు వస్తున్నాం.

ఉన్నత విద్యారంగంలో పెనుమార్పులు తీసుకువస్తున్నాం. భావిభారత దేశంలో పిల్లలందరికీ ఉద్యోగాలు మెరుగ్గా వచ్చే పరిస్థితులు రావాలని తపన, తాపత్రయంలో అడుగులు వేస్తున్నాం. ఈ రోజు రాష్ట్రంలో మొత్తం 11 మెడికల్‌ ప్రభుత్వ కాలేజీలు ఉంటే... మరో 16 మెడికల్‌ కాలేజీలకు ఈ రోజు శ్రీకారం చుట్టాం. మరో రెండు సంవత్సారాలలో ఈ 16 అందుబాటులోకి వస్తాయి. 

విజయనగరం జిల్లాల్లో గురజాడ జేఎన్డీయూ యూనివర్శిటీని తీసుకు వస్తున్నాం.

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆంధ్రకేసరి యూనివర్శిటీని తీసుకు వస్తున్నాం. ఈ రెండు చోట్ల యూనివర్సిటీలు తీసుకురావడం వల్ల ప్రతి జిల్లాలో యూనివర్సిటీ స్ధాపన జరుగుతుంది. 

కడపలో ఆర్కిటెక్చర్‌ యూనివర్శిటీని తీసుకు వస్తున్నాం.

కురుపాంలో ఇంజినీరింగ్‌కాలేజీ,  పాడేరులో మెడికల్‌ కాలేజీ సాలూరులో ట్రైబల్‌ యూనివర్శిటీ తీసుకు వస్తున్నాం. త్వరలోనే దీనికి శంకుస్ధాపన చేసి, పనులు మొదలు పెడతాం. కర్నూలో క్లస్టర్‌ యూనివర్సిటీని నెలకొల్పుతున్నాం.  


*కొత్త డిగ్రీ కాలేజీలు*

2019 నుంచి ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 10 డిగ్రీలు కాలేజీలు ఏర్పాటు చేశాం. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 154 ప్రభుత్వ డిగ్రీకాలేజీల్లో రూ. 880 కోట్లతో నాడు – నేడుకు శ్రీకారం చుడుతున్నాం. మరో 2 సంవత్సరాల్లో ఇవన్నీకూడా పనులు పూర్తి అవుతాయి.


*డిగ్రీ కోర్సుల్లో మార్పులకు శ్రీకారం*

డిగ్రీ  కోర్సుల్లో కూడా మార్పులకు శ్రీకారం చుట్టాం.

అన్నీ కూడా ఇంగ్లిషు మీడియంవైపు అడుగువేస్తున్నాం.

టెక్ట్స్‌ బుక్‌లో ఒక పేజీ తెలుగు, ఒక పేజీ తెలుగు ముద్రిస్తూ.. బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు కూడా పిల్లలకు ఇబ్బంది లేకుండా అందుబాటులోకి తీసుకువస్తున్నాం.  ఉద్యోగాలు ఇచ్చే కోర్సులుగా వీటిని తీర్చిదిద్దుతున్నాం. ప్రతీ డిగ్రీ విద్యార్ధికి కూడా అప్రెంటీషిప్‌.. వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం కోర్సులో భాగస్వామ్యం చేస్తున్నాం. జిల్లాల్లోని పరిశ్రమలు, స్కిల్‌ కాలేజీలను అనుసంధానం చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 

ఏకంగా 30 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలను ఏర్పాటు చేయబోతున్నాం. ఒక స్కిల్‌యూనివర్శిటీని కూడా తీసుకు వస్తున్నాం. 


*ఈ–స్కిల్లింగ్‌:*

ఈ స్కిల్‌ కాలేజీల్లో ఇప్పటికే డిగ్రీ చదివిన పిల్లలు, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్‌ చదివిన పిల్లలకు జాబ్‌ ఓరియంటెడ్‌ దిశగా అడుగులు వేయిస్తారు. ఇందులో భాగంగానే మైక్రోసాఫ్ట్‌ స్కిల్స్‌ ప్రాజెక్టు కింద 1.62 లక్షల విద్యార్థులకు ఫ్యూచర్‌ రెడీ స్కిల్‌ సొల్యూషన్స్‌ అంటే 40 రకాలు కోర్సులకు సంబంధించి ఉచితంగా శిక్షణ ఇచ్చి, సర్టిఫికే ట్‌ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఈ 40 స్కిల్‌ కోర్సులకు సంబంధించి డేటా ఎనలైటిక్స్, కృతిమ మేథస్సు (ఏఐ), సైబర్‌ సెక్యూరిటీ,  కోడింగ్, లాంగ్వేజ్‌ ప్రోగ్రామింగ్, నెట్‌వర్కింగ్‌ వంటి 8600 అంశాలు తీసుకువస్తున్నాం.  శిక్షణ పొందిన విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ సర్టిఫికెట్లు ఇస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌, టీసీఎస్, వంటి పెద్ద, పెద్ద కంపెనీలు, నాస్కామ్‌ వంటి సంస్ధలను స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీల్లో అనుసంధానం చేస్తున్నాం. 


*చివరగా..*

చివరగా ఒకే ఒక్క విషయం చెప్పదల్చుకున్నాను. పిల్లలకు మంచి జరగాలి. వాళ్ల భవిష్యత్తు బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. అందులో భాగంగానే విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలతో విద్యారంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టాం. ఈ మార్పులన్నీ బాగా జరగాలని, పిల్లలందరూ మంచి డిగ్రీలు పొందాలని, మంచి ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని మనసారా కోరుకుంటున్నాను. 


దేవుడి దయ మీ అందరి చల్లని ఆశీస్సులతో ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని దేవుడ్ని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నానని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు. 


ఈ కార్యక్రమంలో క్యాంప్‌ కార్యాలయం నుంచి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీష్‌ చంద్ర, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె సునీత, ఏపీఎస్‌సీహెచ్‌ఈ  ఛైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి జే శ్యామలరావు, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌ వి చినవీరభద్రుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.