నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి*

 *అట్టహాసంగా ఆప్కో చైర్మన్  చిల్లపల్లి కుమార్తె వివాహ మహోత్సవం*


*నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి*


మంగళగిరి (ప్రజా అమరావతి);

అప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు కుమార్తె వివాహం అట్టహాసంగా జరిగింది. చిల్లపల్లి వారి వివాహ మహోత్సవంలో నూతన వధూవరులు లక్ష్మీప్రియాంక, పవన్ సాయి జంటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీర్వదించారు. పలువురు మంత్రులు, అధికార వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు చిల్లపల్లి వారి వివాహ మహోత్సవానికి హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. 


మంగళగిరి సీకే కన్వెన్షన్ లో బుధవారం ఉదయం అట్టహాసంగా ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, పద్మావతి దంపతుల కుమార్తె లక్ష్మీప్రియాంక, ప్రకాశం జిల్లా వాస్తవ్యులు గోలి తిరుపతి రావు, లక్ష్మి దంపతుల కుమారుడు పవన్ సాయిల వివాహం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి అతిరథ మహారథులు విచ్చేయడం విశేషం. అలాగే చిల్లపల్లి వారి బంధువులు, సన్నిహితులు, రాష్ట్రంలోని చేనేత ప్రతినిధులు, ప్రత్యేకించి చిల్లపల్లి మోహనరావు చిన్ననాటి మిత్రబృందం సీకే హైస్కూల్ 1978-79 పదోబ్యాచ్ పూర్వవిద్యార్థులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికార, అనధికార ప్రముఖులు హాజరయ్యారు.


*చిల్లపల్లి మోహనరావు నేపథ్యం..*


వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ చేనేత విభాగానికి అధ్యక్షుడిగా ఉన్న చిల్లపల్లి మోహనరావు.. రాష్ట్రవ్యాప్తంగా చేనేత కేంద్రాల్లో పర్యటిస్తూ వైసీపీ పటిష్టతకు తనవంతు కృషి చేస్తున్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో క్రమశిక్షణ, అంకితభావం, చిత్తశుద్ధితో పార్టీ అభివృద్ధి కోసం మోహనరావు అహర్నిశలు శ్రమించి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చేరువయ్యారు. అలాగే పార్టీలో కీలకమైన సజ్జల రామకృష్ణారెడ్డి మన్ననలు పొంది సన్నిహితుడయ్యారు. చేనేత సామాజిక వర్గంలో ప్రముఖ నాయకుడిగా ఎదిగిన మోహనరావుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  అధికారంలోకి వచ్చాక తగినరీతిలో గౌరవించింది. 


*అప్కో చైర్మన్ గా*


మోహనరావుని ఆప్కో చైర్మన్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం  గత డిసెంబరు 30న  ఉత్తర్వులు జారీ చేసింది.  వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేతన్న నేస్తం పథకం రూపుదాల్చడంలో మోహనరావు కృషి లేకపోలేదు. తొలి విడతలో నేతన్న నేస్తం అందని వారికి... రెండో విడతలో న్యాయం జరిగేలా కృషి చేశారు. గత ఏడాది లాక్‌డౌన్ కారణంగా నెలల తరబడి  ఉపాధి కరువై దుర్భర పరిస్థితుల్లో ఉన్న నేత కార్మికుల వెతలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి... ఆరు నెలలు ముందుగానే రెండో దఫా నేతన్న నేస్తం విడుదలయ్యేలా కృషి చేశారు. కేవలం ఆర్నెల్ల వ్యవధిలోనే ఒక్కో కార్మికుడికి రూ.48 వేలు అందించి అండగా నిలిచారు. 80వేలకు మందిపైగా చేనేత కార్మికులకు నేతన్ననేస్తం అందించేందుకు కృషిచేసిన మోహనరావు చేనేత కుటుంబాలకు ఆదరువుగా నిలిచారు.


*రాజకీయ వారసత్వం*


మంగళగిరిలోని చేనేత వర్గాల్లో ప్రముఖుడు అయిన చిల్లపల్లి నాగేశ్వరరావు, పార్వతి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా పెద్దకుమారుడు మోహనరావు, రెండో కుమారుడు శ్రీనివాసరావు.. ఇద్దరూ తండ్రి వారసత్వంగా వ్యాపార రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ తమకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. మోహనరావు హైస్కూల్ విద్యనుంచే తండ్రి చేనేత వస్త్ర వ్యాపారంలో సహాయపడుతుండేవారు. ఓవైపు వ్యాపార మెలకువలను తెలుసుకుంటూనే ప్రైవేటుగా బీఏ చేసిన మోహనరావు వ్యాపార వేత్తగా స్థిరపడ్డారు. కాలక్రమంలో గ్రానైట్ పరిశ్రమను స్థానికంగా నెలకొల్పి ఆ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. మోహనరావు కుమారుడు వెంకట లక్ష్మినిరంజన్ ఎంబీఏ చేసి గ్రానైట్, చేనేత వస్త్ర వ్యాపార వ్యవహారాలు చూస్తున్నారు.