బర్డ్ కు మరో ఆధునిక సాంకేతిక మణి హారం

 బర్డ్ కు మరో ఆధునిక సాంకేతిక మణి హారం



– అధునాతన రూఫ్ సస్పెండెడ్ అల్ట్రా మోడరన్ డిజిటల్ ఎక్స్ రే యూనిట్ విరాళం

– అదనపు ఈవో,ఆసుపత్రి ఎండి శ్రీ ధర్మారెడ్డి కి అందజేసిన దాత వెంకటేష్

తిరుపతి 28 నవంబరు (ప్రజా అమరావతి): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు వేగంగా అందిస్తున్న బర్డ్ ఆసుపత్రికి ఆదివారం అత్యాధునిక రూఫ్ సస్పెండెడ్ అల్ట్రా మోడరన్ డిజిటల్ ఎక్స్ రే యూనిట్ విరాళంగా అందింది.

హైదరాబాద్ సనత్ నగర్ లోని ఆర్ ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ అధినేత శ్రీ వెంకటేష్ దంపతులు రూ 1 కోటి 30 లక్షల విలువయ్యే డిజిటల్ ఎక్స్ రే యంత్రాన్ని టీటీడీ అదనపు ఈవో, ఆసుపత్రి ఎండి శ్రీ ధర్మారెడ్డికి అందజేశారు.
ఈ సందర్బంగా అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి దాత శ్రీ వెంకటేష్ ను సన్మానించారు. దాత చేతుల మీదుగా ఎక్స్ రే యంత్రాన్ని ప్రారంభింపజేశారు. డాక్టర్ కిషోర్ కుమార్, డాక్టర్ రామ్మూర్తి, డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ దీపక్, ఎఈవో శ్రీ పార్థసారథి, రేడియాలజి ఇంచార్జ్ శ్రీ మునిరత్నం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రోగికి ఇబ్బంది లేకుండా ఎక్స్ రే

రాయలసీమలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో లేని రూఫ్ సస్పెండెడ్ అల్ట్రా మోడరన్ డిజిటల్ ఎక్స్ రే యంత్రం వల్ల రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్స్ రే తీసే సదుపాయం లభిస్తుంది. రోగిని అటు, ఇటు కదిపి నొప్పి వచ్చే ట్లు చేయకుండా టేబుల్ నే ఏ విధంగా కావాల్సి ఉంటే అలా తిప్పుకుని సులువుగా ఎక్స్ రే తీయొచ్చు. ఎక్స్ రే హై క్వాలిటీ తో వస్తుంది ఒక నిముషంలోనే రోగికి, అతనికి వైద్యం అందిస్తున్న డాక్టర్ వాట్స్ యాప్ కు ఎక్స్ రే వెళుతుంది. ఒక కాపీ ఆసుపత్రి రికార్డులో భద్ర మవుతుంది.

ఇందుకోసం క్లౌడ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నందు వల్ల రోగి ప్రపంచంలో ఏ మూల నుంచి అయినా ఎప్పుడైనా ఎక్స్ రే చూసుకోవచ్చు. ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి మార్గదర్శనంలో మొన్న సువర్ణ సాఫ్ట్వేర్, ఇవాళ అధునాతన ఎక్స్ రే ప్రారంభించామని, త్వరలో ఆధునిక సిటి మిషన్ ప్రారంభిస్తామని, మరిన్ని ఆధునిక వైద్య పరికరాలు సమకూర్చుకుని రోగులకు వేగంగా, నాణ్యమైన సేవలు అందిస్తామని ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్పరెడ్డి తెలిపారు.

Comments