అమరావతి-శాసనసభ (ప్రజా అమరావతి);
*శాసన మండలి రద్దు నిర్ణయం వెనక్కి తీసుకుంటూ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్*
*మండలి రద్దు తీర్మానం వెనక్కి తీసుకున్న ప్రభుత్వం*
*ప్రజాస్వామ్యంలో శాసన సభే సుప్రీమ్. మండలి కేవలం సలహాలు, సూచనలే ఇవ్వాలి*
*గతంలో చారిత్రాత్మక నిర్ణయాలకు చట్టం కాకుండా మండలిలో అడ్డగించారు*
*అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మండలి రద్దు నిర్ణయం తీసుకున్నాం*
*మండలి రద్దుపై కేంద్ర ప్రభుత్వానికి, హోం శాఖకు సమాచారమిచ్చాం. అక్కడ నుంచి ఎలాంటి స్పందనా లేదు*
*ఇటీవల మండలి ఛైర్మన్‌ను ఎన్నుకున్నాం. కింద స్థాయి నుంచి ఉన్నతస్థాయికి వచ్చిన వ్యక్తి*
*సామాన్యుడు కూడా ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చని ఛైర్మన్ ఎంపిక ద్వారా చాటి చెప్పారు*
*శాసనమండలిపై ఉన్న సందిగ్ధతకు తెర. మండలి కొనసాగించాలని నిర్ణయించిన ప్రభుత్వం*
*ఆర్థిక, వాణిజ్య, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్*
రాష్ట్ర శాసన మండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఈ మేరకు శాసనసభలో ఆయన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మండలి రద్దుపై ఇన్నాళ్లు ఒక సందిగ్ధత నెలకొందని ఆయన అన్నారు. శాసన మండలిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన శాసనసభకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. వివిధ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని అవన్నీ కూడా చాలా త్వరగా చట్టం రూపంలో అమలు కావాలనే ఉద్దేశం ఉంది. అయితే వివిధ కారణాల వల్ల అవి ఆలస్యమయ్యాయని గతంలో జరిగిన సంఘటనలను శ్రీ బుగ్గన గుర్తు చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి 1958లో ఏర్పాటైందని బుగ్గన తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 168 కింద శాసనమండలి ఏర్పాటు జరిగిందన్నారు. అయితే 1986లో అప్పటి సీఎం నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు వివిధ కారణాల వల్ల శాసనమండలిని రద్దు చేయటం జరిగిందని బుగ్గన చెప్పారు. మళ్లీ 2006లో అప్పటి ప్రభుత్వం, ఆనాటి సీఎం దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి గారు శాసనమండలిని ఏర్పాటు చేయటం జరిగింది. తిరిగి శ్రీ వైయస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవటం జరిగిందని ఆ నిర్ణయాలు చట్ట రూపంలో అమలుకు మండలిలో ఆలస్యం అవుతూ వచ్చాయి. ఆనాడు మండలిలో జరిగిన పరిణామాలపై శాసనసభలో చర్చ కూడా
జరిగిందని శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ గుర్తు చేశారు.
*ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులే ఎప్పుడైనా సుప్రీమ్*
*ఒక సూచన, సలహా ఇవ్వటానికి మండలి అవసరం*
ప్రజాస్వామ్యంలో ప్రజల చేత నేరుగా ఎన్నికైన వారే (శాసనసభ) సుప్రీమ్. అయితే మండలి కూడా అవసరం. మనకు ఒక సూచన ఇచ్చేదానికి, సలహా ఇచ్చేదానికి అదనంగా ఉంది. అయితే, ప్రజల మేలు కోసం, మంచి నిర్ణయాలు, చట్టాలు తీసుకురావాలన్నా, చట్టాన్ని సవరించాలన్నా.. దానిమీద నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత, జవాబుదారీతనం అసెంబ్లీకే ఉంటుందని బుగ్గన పేర్కొన్నారు.
లెజిస్లేటివ్ అసెంబ్లీ, పార్లమెంట్‌లో లోక్‌సభ ప్రజల చేత ఎన్నుకోబడిన వారని బుగ్గన తెలిపారు. ప్రజలు ఆశలన్నీ మనపైన (శాసనసభ) పెట్టుకోవటం జరుగుతుంది. మండలి ద్వారా మంచి సూచనలు, సలహాలు అందింతే బావుంటుందని ఈ సిస్టం పెట్టడం జరిగిందని బుగ్గన వివరించారు.
*స్వాతంత్ర్యం తర్వాత కొన్ని రాష్ట్రాల్లో మండలే లేదు. కొన్ని రాష్ట్రాల్లో రద్దు*
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాల్లో శాసనమండలి లేదని, మరికొన్ని రాష్ట్రాల్లో రద్దు చేయటం జరిగిందన్నారు. 27 జనవరి 2020న మండలి అవసరం లేదని శాసనసభలో తీర్మానం పాస్ చేయటం జరిగిందని బుగ్గన తెలిపారు. అయితే, ఆనాడు శాసనసభలో ఉన్నత విద్యాంతులు ఉన్నారని తీర్మానం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి, హోంశాఖకు తెలియజేయటం జరిగింది. అయితే, ఇంత తతంగం జరిగినా కేంద్రంలో మండలి రద్దు తీర్మానంలో ఎలాంటి పురోగతి లేదు. మరోవైపు, ఇప్పటికే శాసనమండలి జరుగుతోంది. దీంతో ముందుకు పోవాలా? వెనక్కి పోవాలనే దాంట్లో సందిగ్ధం ఏర్పడింది. మన టర్మ్, మన విధులు అనేవి మనం సక్రమంగా నిర్వహించటానికి అన్నీ అనుకూలంగా ఉంటాయా? లేదా అనిపించింది. ఇటువంటి సందిగ్ధం ఉంటే ప్రతి సెషన్ పాజిటివ్ అవుట్ కమ్
ఉండకపోవచ్చు. ఇది (మండలి రద్దు) కేంద్ర హోంశాఖలో పెండింగ్‌లో ఉంది కాబట్టి.. ఈరోజు ప్రభుత్వం, సీఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి దీనిపై నిర్ణయం తీసుకున్నారని బుగ్గన తెలిపారు. సందిగ్ధత లేకుండా ప్రస్తుతం ఉన్న మండలిని యధాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు.
*మండలి ఛైర్మన్‌ను ఎన్నుకున్నాం. సందిగ్ధత లేకుండా మండలి రద్దు నిర్ణయం వెనక్కి*
ఇప్పుడున్న శాసనమండలిలోకి కొత్తగా విద్యావంతులైన సభ్యులు వస్తున్నారు. రెండు రోజుల క్రితం శాసనమండలిలో ఏకగ్రీవంగా ఛైర్మన్‌ను ఎన్నుకోవటం జరిగింది. మూడు, నాలుగు పర్యాయాలు కార్పొరేటర్‌గా ఎన్నికై, సామాన్య దళిత కుటుంబం నుంచి అంచెలంచెలుగా శాసనమండలి ఛైర్మన్ స్థాయికి ఎదిగారు. ఈరోజు శాసనమండలి ఛైర్మన్ ఎంపిక ద్వారా ఒక సామాన్య మానవుడు నిజాయితీ, కష్టంతో ఏ ఉన్నత స్థాయిని చేరవచ్చనే సంకేతాన్ని సీఎం శ్రీ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చారని బుగ్గన అన్నారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఒక మహిళా హోంమినిస్టర్ దళిత వర్గాల నుంచి వచ్చారంటే గర్వంగా భావిస్తున్నారని బుగ్గన అన్నారు.
ప్రజల కోసం శాసనసభ తీసుకునే నిర్ణయాలకు మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలనే ఆకాంక్షతో శాసనమండలిని కొనసాగించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందని బుగ్గన తెలిపారు. ఇకపై శాసనసభ నుంచి వచ్చే బిల్లును ఏదో ఒక రూపంలో ఆపాలనే ఆలోచన లేకుండా మంచి సపోర్ట్‌గా (శాసనమండలి) ఉంటారని ఆశిస్తున్నానని బుగ్గన అన్నారు. అందుకే గతంలో తీసుకున్న శాసనమండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ తీర్మానాన్ని బుగ్గన ప్రవేశపెట్టారు. మండలి రద్దు ఉపసంహరణ తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది.
addComments
Post a Comment