వన్ టైమ్ సెటిల్మెంట్ అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

 *వన్ టైమ్ సెటిల్మెంట్ అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి*


*: నవరత్నాలు- పేదలందరికి ఇళ్లు కింద ఇళ్ల గ్రౌండింగ్ పూర్తిస్థాయిలో చేపట్టాలి*


*: సచివాలయ వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉండాలి*


*: ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ (హౌసింగ్) అజయ్ జైన్*


అనంతపురం, నవంబర్ 10 (ప్రజా అమరావతి):


*జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటిఎస్)ను పక్కాగా అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ (హౌసింగ్) అజయ్ జైన్ ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటిఎస్), నవరత్నాలు- పేదలందరికి ఇళ్లు కింద ఇళ్ల నిర్మాణం, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పనితీరుపై జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మితో కలిసి రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ (హౌసింగ్) అజయ్ జైన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)ఏ. సిరి, హౌసింగ్ జాయింట్ కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ (ఆసరా)గంగాధర్ గౌడ్, పెనుకొండ సబ్ కలెక్టర్ నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ్ పాల్గొన్నారు.*


*ఈ సందర్భంగా ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ (హౌసింగ్) అజయ్ జైన్ మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటిఎస్) అనేది చాలా ముఖ్యమైనదని, ఇది లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడుతుందని, ఓటిఎస్ అమలుపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటిఎస్) కింద 1983 నుంచి 2011 వరకు ఇచ్చిన పట్టాలకి సంబంధించి రుణాలు పొందిన లబ్ధిదారులకు శాశ్వత హక్కు కల్పించి రిజిస్ట్రేషన్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వన్టైమ్ సెటిల్మెంట్ కింద లబ్ధిదారులు నామమాత్రపు మొత్తం (నామినల్ అమౌంట్) చెల్లించాల్సి ఉంటుందని, గ్రామీణ ప్రాంతం వారు 10 వేల రూపాయలు, మున్సిపల్ ప్రాంతం వారు 15 వేల రూపాయలు, నగరపాలక సంస్థకు చెందిన వారు 20 వేల రూపాయల నామమాత్రపు మొత్తం చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీనిద్వారా లబ్ధిదారులకు మూడు రకాల లబ్ధి ఉంటుందని, అందులో వారు కట్టాల్సిన దానికన్నా ఎక్కువ మొత్తం రుణం తీసుకున్నా మిగిలిన మొత్తం మాఫీ అవుతుందని, ఇందుకోసం లబ్ధిదారులకు సూచించిన నామమాత్రపు మొత్తం కడితే చాలన్నారు. అలాగే పొజిషన్ సర్టిఫికేట్ ఉన్న లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరుగుతుందని, దీని ద్వారా స్థలంపై సంపూర్ణ అధికారం వారికి ఉంటుందన్నారు. దీంతోపాటు పట్టా రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానిక సచివాలయంలోనే 10 రూపాయలు మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుందన్నారు. ఈ విషయమై లబ్ధిదారులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించి తెలియజేయాలని, వన్టైమ్ సెటిల్మెంట్ కింద లబ్ధిదారులు ముందుకు వచ్చి నామమాత్రపు మొత్తం చెల్లించి మిగిలిన మొత్తం మాఫీ జరుగుతుందని తెలిపివారు ముందుకు వచ్చేలా అవగాహన కల్పించాలన్నారు.*


*జిల్లాలో 5,08,382 మంది లబ్ధిదారులు వన్టైమ్ సెటిల్మెంట్ కింద లబ్ధి పొందేందుకు అర్హులుగా గుర్తించగా, ఇందులో 2,88,432 మంది లబ్ధిదారుల డేటా ఎంట్రీ పూర్తి చేయగా, 59.16 శాతం డేటా ఎంట్రీ పూర్తి చేయడం జరిగిందన్నారు. పంచాయతీ సెక్రెటరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను డేటా ఎంట్రీ పై దృష్టి సారించేలా చేసి డేటా ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. విఆర్వో లాగిన్ లో ఉన్న లబ్ధిదారుల జాబితాను కూడా వెంటనే అప్రూవల్ చేయాలన్నారు. వన్టైమ్ సెటిల్మెంట్ పథకం నిర్ణీత కాల వ్యవధిలో అమలు చేయడం జరుగుతుందని, డిసెంబర్ 21 వ తేదీ నాటికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ను ప్రతి గ్రామంలో సమావేశం నిర్వహించి లబ్ధిదారులకు పంపిణీ చేసేలా ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందుకోసం డిసెంబర్ 15వ తేదీలోపు లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలన్నారు. వన్టైమ్ సెటిల్మెంట్ కోసం 40 రోజుల వ్యవధి మాత్రమే ఉందని, ఈ సమయంలోనే లబ్ధిదారులు ఈ పథకాన్ని ఉపయోగించుకునేలా చేయాలని, లేకపోతే లబ్ధిదారులు ఈ పథకం కింద లబ్ధి పొందిన లబ్ధి పొందడం మిస్సయితే ఎంత రుణం ఉంటే అంత పెట్టాల్సి వస్తుందని, వన్టైమ్ సెటిల్మెంట్ సమయం దాటిపోతే రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈ విషయమే ప్రజలకు క్షుణ్నంగా తెలియజేయాలని, లబ్ధిదారులు 80 - 90 శాతం వరకు ప్రయోజనం పొందేలా పూర్తి దృష్టి సారించాలన్నారు. వన్టైమ్ సెటిల్మెంట్ కింద ఉరవకొండ, కదిరి, అనంతపురం, పుట్టపర్తి, ఎన్ పి కుంట, విడపనకల్లు మండలాలలో డేటా ఎంట్రీ బాగా చేయడం జరిగిందన్నారు. పామిడి, గుంతకల్లు, హిందూపురం అర్బన్, ధర్మవరం మండల పరిధిలో డేటా ఎంట్రీ తక్కువగా ఉందని, ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ లు, ఎంపీడీవోలు ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అలాగే వచ్చే పది రోజుల లోపు 50 శాతం మంది లబ్ధిదారులు వారికి సూచించిన నామమాత్రం మొత్తం చెల్లించేందుకు ముందుకు వచ్చేలా అవగాహన కల్పించాలన్నారు.*


*నవరత్నాలు- పేదలందరికి ఇళ్లు కింద ఇళ్ల గ్రౌండింగ్ పూర్తిస్థాయిలో చేపట్టాలి :*


*నవరత్నాలు- పేదలందరికి ఇళ్లు కింద ఇళ్ల గ్రౌండింగ్ పూర్తిస్థాయిలో చేపట్టాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదేశించారు. జిల్లాకు 1,30,608 ఇల్లు మంజూరు చేయగా, 78,849 ఇల్లు గ్రౌండింగ్ చేయడం జరిగిందని, మిగిలిన ఇళ్లను కూడా వెంటనే గ్రౌండింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక ఇంటి నిర్మాణం కోసం 1.80 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా మ్యాపింగ్, జియో ట్యాగింగ్, రిజిస్ట్రేషన్, గ్రౌండింగ్ ప్రక్రియలు పూర్తిగా చేపట్టాలన్నారు. లబ్ధిదారుల మ్యాపింగ్ 82 శాతం పూర్తయిందని మిగిలినది వెంటనే పూర్తి చేయాలన్నారు. జియో ట్యాగింగ్ విషయమై 90 వేల వరకు చేపట్టగా 69 శాతం పూర్తయిందని మిగిలినది పూర్తిచేయాలని, రిజిస్ట్రేషన్ విషయమై 1,09,078 మందికి పూర్తికాగా 83.5 శాతం పూర్తి చేయడం జరిగిందని మిగిలిన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పూర్తి పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వచ్చే ఐదు నెలలపాటు పూర్తిగా పనిచేసే సీజన్ అని, ఆయా ప్రక్రియలను త్వరగా పూర్తి చేయాలన్నారు. జాబ్ కార్డుల జారీ ప్రక్రియపై కూడా శ్రద్ధ పెట్టాలన్నారు. లబ్ధిదారుల మ్యాపింగ్, జియో ట్యాగింగ్, రిజిస్ట్రేషన్ ప్రక్రియలు ఎందుకు పూర్తి కావడం లేదు అనేది జిల్లా యంత్రాంగం సమీక్ష సమావేశం నిర్వహించాలన్నారు. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన రుణాలను డిఆర్డిఎ, మెప్మా ద్వారా ఇప్పించాలన్నారు. నిర్మాణం కోసం అవసరమైన సిమెంట్, స్టీల్, ఇసుక సరఫరాను చేపట్టాలన్నారు. ఇళ్ల నిర్మాణం అనేది ఒక యజ్ఞంలా జరగాలని, నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు అనేది ఒక సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమం అన్నారు. దీని ద్వారా ఎంతోమందికి ఉపాధి లభిస్తుందని, అధికారులంతా ఇళ్ల నిర్మాణాన్ని సీరియస్ గా తీసుకొని పనిచేయాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో ప్రతి రోజూ 6 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలన్నారు. జిల్లాలో ఇల్లు లేని వారు ఒక్కరు ఉండకుండా చూడాలని, మొత్తం ఇల్లు గ్రౌండింగ్ జరగాలన్నారు. ఇళ్ల నిర్మాణం చేపడుతున్న కాలనీలలో విద్యుత్ సరఫరా చాలా ముఖ్యమని, జల జీవన్ మిషన్ కింద ఆయా కాలనీల్లో నీటి సరఫరా చేయాలని, రహదారులు కూడా అభివృద్ధి చేయాలన్నారు.*


*సచివాలయ వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉండాలి :*


జిల్లాలో సచివాలయ వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉండాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదేశించారు. సచివాలయ వ్యవస్థ అనేది నూతన వ్యవస్థని, అన్ని రకాల పనులు సచివాలయంలోనే జరిగిపోవాలని ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. సచివాలయంలో సిబ్బంది ఫిజికల్ గా ఉండాలని, సచివాలయాల తనిఖీలలో సిబ్బంది ఉన్నారా లేదా అనేది పరిశీలించాలన్నారు. జిల్లా అధికారులు సచివాలయాల తనిఖీలకు వెళ్ళినప్పుడు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు బయోమెట్రిక్ అటెండెన్స్ వేస్తున్నారా, ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకూ సచివాలయ ఉద్యోగులు సచివాలయంలో ఉంటున్నారా లేదా, ప్రభుత్వ పథకాల పోస్టర్లు, ఆయా పథకాల అర్హుల, అనర్హుల లబ్ధిదారుల జాబితా ప్రదర్శిస్తున్నారా లేదా, ప్రభుత్వ అవుట్ రిచ్ ప్రోగ్రామ్, తదితర అన్ని రకాల అంశాలపై సీరియస్ గా తనిఖీలు చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ప్రొబిషన్ డిక్లరేషన్ పై ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. సచివాలయాల్లో గడువు తీరిన సమస్యలు ఎలాంటి పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ సూచించారు. సచివాలయ వ్యవస్థ పనితీరు మరింత మెరుగ్గా ఉండాలన్నారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటిఎస్)ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. వెనుకబడిన జిల్లాలో వన్టైమ్ సెటిల్మెంట్ స్కీం మంచిగా అమలు చేయాలని, దీని ద్వారా లబ్ధిదారులకు ఒక హక్కు లభిస్తుందన్నారు. ఈ పథకం కింద సర్వే త్వరగా పూర్తిచేయాలని, ప్రతి వారం పురోగతి చూపించాలని, అధికారులు ఈ విషయమై నిత్యం మానిటర్ చేయాలన్నారు. వన్టైమ్ సెటిల్మెంట్ పై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని, ఎలాంటి అపోహలు లేకుండా ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా వారికి తెలియజేయాలన్నారు. వన్టైమ్ సెటిల్మెంట్ అనేది కొన్ని తరాలకు ఉపయోగపడుతుందన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద ఇళ్ల గ్రౌండింగ్ అనేది ఎంతో ముఖ్యం అని, ఇందులో భాగంగా జియో ట్యాగింగ్, రిజిస్ట్రేషన్ తదితర యాక్టివిటీ లను వేగంగా చేపట్టాలన్నారు. మండల స్థాయి టీమ్లు ఇళ్ల గ్రౌండింగ్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. సచివాలయ వ్యవస్థ పనితీరు మరింత మెరుగు పరిచి బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు, సచివాలయానికి వచ్చే సర్వీసులను ఎప్పటికప్పుడు పరిష్కరించడం చేయాలన్నారు. అవుట్ రీచ్ ప్రోగ్రాం పై దృష్టి పెట్టాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటిఎస్), నవరత్నాలు- పేదలందరికి ఇళ్లు కింద ఇళ్ల నిర్మాణం, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పనితీరుపై జిల్లాను ముందంజలో నిలిచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.


ఈ సమీక్ష సమావేశంలో హౌసింగ్ పిడి కేశవ నాయుడు, డిఆర్డిఎ పిడి నరసింహారెడ్డి, మెప్మా పిడి రమణారెడ్డి, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ భాగ్యరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వెంకటరమణ, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనాథ్ రెడ్డి, ఏపీఎస్పిడిసిఎల్ ఎస్ఈ నాగరాజు, జడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాసులు, ఆర్డీఓలు  మధుసూదన్, నిశాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వరప్రసాద్, నగరపాలక సంస్థ కమిషనర్ పివివిఎస్ మూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్ లు, ఎంపిడిఓ లు, తహసీల్దార్ లు, హౌసింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.