భారీ వర్షాల వల్ల జరిగే ప్రమాదాలు, నష్టాలను అంచనా వేసే వ్యవస్థ ఉండాలి
– వీటి వల్ల భక్తులకు హెచ్చరికలు జారీ చేయాలి
– కంట్రోల్ రూం ఏర్పాటు చేసి విభాగాల సమన్వయంతో భక్తులకు సత్వర సేవలు.
టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి
తిరుమల 28 నవంబరు (ప్రజా అమరావతి): భారీ వర్షాలు, వరదల లాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వాటివల్ల జరిగే నష్టాన్ని, ప్రమాదాలను ముందుగానే అంచనా వేసి భక్తులకు హెచ్చరికలు జారీచేసే వ్యవస్థ అందుబాటులో ఉండాలని టిటిడి ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. విపత్తుల సమయంలో భక్తులకు సహాయం చేయడం, విభాగాల సమన్వయం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఆదివారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తిరుపతి, తిరుమల, రెండు ఘాట్ రోడ్లు, శ్రీవారి మెట్టు మార్గంలో దెబ్బతిన్న రోడ్లు రక్షణ గోడలు ఇతర వాటిని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి త్వరగా యథాస్థితికి తేవాలని చెప్పారు. శ్రీవారి మెట్టు మార్గం పూర్తిస్థాయిలో పునరుద్ధరించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందువల్ల, తాత్కాలిక ఏర్పాట్లు వెంటనే చేయాలని ఆయన ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుమల ఘాట్ రోడ్లలో కొండ చరియలు విరిగి పడడం, రోడ్డు కృంగిపోవడం వంటి సంఘటనలు నివారించడం కోసం, నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల మేరకు రాక్ బోల్ట్ల్ట్ టెక్నాలజీని ఉపయోగించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
తిరుమల నారాయణగిరి విశ్రాంతి గృహాల్లో పూర్తి స్థాయిలో డ్రైనేజి మరమ్మతులు చేసి భక్తులకు గదులు కేటాయించాలన్నారు. ఇటీవల సంభవించిన భారీ వర్షాల కారణంగా ఏ సమయంలో ఎక్కడ ఎంత మేరకు నష్టం జరిగిందనే వివరాలతో డాక్యుమెంట్ తయారు చేయాలని ఈవో ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రకృతి విపత్తుల సమయంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే వివరాలు కూడా ఈ డాక్యుమెంట్ లో ఉండాలని ఆయన చెప్పారు. వర్షం తీవ్రతను బట్టి ఎప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలని నిర్ణయించేందుకు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్ ఓ పి) ఏర్పాటు చేయాలన్నారు. ప్రాంతాలవారిగా అధికారులకు వారి బాధ్యతలను నిర్ణయించాలని చెప్పారు. వర్షం తీవ్రతను బట్టి కంట్రోల్ రూమ్ భక్తులకు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, సిబ్బందిని అనునిత్యం అప్రమత్తం చేయాలని ఈవో చెప్పారు. భారీ వర్షాలు వచ్చిన సమయంలో తిరుమల, తిరుపతి లో కల్వర్టులు తెగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ తెగితే ఎలా వ్యవహరించాలి అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నీటి పారుదల శాఖ నిపుణుల సలహాలు తీసుకోవాలన్నారు. తిరుమల ఆలయం, మాడవీధులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి వర్షపు నీరు రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, నీరు వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై స్పష్టమైన విధానం తయారు చేయాలన్నారు. భారీ వర్షాల వల్ల తిరుమలతో పాటు తిరుపతి లోని టీటీడీ పరిపాలన భవనం వెనుక వైపు, రాంనగర్ , వినాయక నగర్ క్వార్టర్స్, శ్రీనివాసం, రెండు మరియు మూడో సత్రాలు, పూర్ హోమ్, ఆర్ట్స్ కాలేజిగ్రౌండ్, కపిలతీర్థం ఆలయం, శ్రీవారి మెట్టు, ఘాట్ రోడ్ల లో జరిగిన వరద భీభత్సాన్ని ఇంజినీరింగ్ అధికారులు ఫోటో ల ద్వారా ఈవోకు చూపించారు.
అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, జెఈవో లు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీర బ్రహ్మం, సివి ఎస్ఓ శ్రీ గోపీనాథ్ జెట్టి, ఎఫ్ఎసిఎవో శ్రీ బాలాజీ, సిఈ శ్రీ నాగేశ్వర రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment