పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – ఉపరాష్ట్రపతి

 *పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – ఉపరాష్ట్రపతి*

*• భూతాపం కారణంగా సముద్ర తీరప్రాంతాలకు అనేక సమస్యలు పొంచి ఉన్నాయి*

*• భవిష్యత్ తరాలకు అందమైన, సౌకర్యవంతమైన, ఆరోగ్యకరమైన భూమిని అందిచేందుకు ప్రతి ఒక్కరు చొరవ తీసుకోవాలి*

*• విశాఖపట్నంలోని అటవీ పరిశోధన, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థా కేంద్రాన్ని సందర్శించిన ఉపరాష్ట్రపతి*

*• సముద్ర పర్యావరణ వ్యవస్థలో కలప జీవ అధోకరణపై ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనా కేంద్రం ప్రారంభం*

*• సంస్థ చేపడుతున్న కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేసిన శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు*

*• తన అభిప్రాయాన్ని ఫేస్ బుక్ వేదికగా పంచుకున్న ఉపరాష్ట్రపతి*

విశాఖపట్నం, 23 నవంబర్ (ప్రజా అమరావతి);


వాతావరణ మార్పుల నేపథ్యంలో పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు తెలిపారు. భూతాపం కారణంగా సముద్రం తీరప్రాంతాలు తీవ్ర ప్రతికూలతలకు లోనవుతున్నాయన్న ఆయన, భవిష్యత్ తరాలకు అందమైన, సౌకర్యవంతమైన, ఆరోగ్యకరమైన భూమిని అందించేందుకు ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని సూచించారు. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం నాడు విశాఖపట్నం బీచ్ రోడ్ లోని యోగా విలేజ్ లో ఉన్న అటవీ పరిశోధన, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థా కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం ఇదే భవనంలో సముద్ర పర్యావరణ వ్యవస్థలో కలప జీవ అధోకరణపై ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా తమ అభిప్రాయాలను ఫేస్ బుక్ వేదికగా మనోగతం ద్వారా పంచుకున్న ఉపరాష్ట్రపతి, పర్యావరణానికి హానిచేయని విధంగా నడుచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు.

విజ్ఞానశాస్త్ర అంతిమ లక్ష్యం ప్రజల జీవితాలను మెరుగుపరచడమేనన్న ఉపరాష్ట్రపతి, సముద్ర వాతావరణంలో పాడవ్వని కలపతో తయారు చేసిన 100 పడవలను ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని మత్స్యకారులకు ఈ సంస్థ అందజేయడం పట్ల అభినందనలు వ్యక్తం చేశారు. వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయన్న ఆయన, దీనివల్ల సముద్ర తీర ప్రాంతాల్లో భూభాగం తగ్గిపోవడం, భూమిలో లవణీయత పెరగడం లాంటివి చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఈ పరిస్థితులు వ్యవసాయం మీద, నివాస సముదాయాల మీద తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయన్న ఉపరాష్ట్రపతి, పర్యావరణ వ్యవస్థల మీద ఈ అసమతౌల్యతను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

పర్యావరణం పరిరక్షణ కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్న ఉపరాష్ట్రపతి, 2017 – 19 మధ్యకాలంలో దేశంలో 54 చదరపు కిలోమీటర్ల మేర మడ అడవుల విస్తీర్ణం పెరగడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మన చర్యలే, మన భవిష్యత్ తరాల శ్రేయస్సును ప్రభావితం చేస్తాయన్న ఆయన, ఇందుకోసం భవిష్యత్ లో చేయవలసింది ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు.

ఉపరాష్ట్రపతి ప్రారంభించిన వైజ్ఞానిక ప్రదర్శనా కేంద్రంలో సముద్రపు బయో ఫౌలింగ్ కారణంగా దెబ్బతిన్న చెక్క నమూనాలు, సముద్ర జీవుల అవశేషాలు, పరిరక్షించిన చెక్క నమూనాలు తదితరాలను ఏర్పాటు చేశారు. తూర్పుకనుమల్లో ఉన్న పక్షుల జాతులు, విశాఖపట్నం జిల్లాలోని 114 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం వెంబడి మడ అడవులతో అనుసంధానమైన పక్షుల జాతుల గురించి అనేక ఆసక్తికర విషయాలను ఇక్కడ గమనించవచ్చు.

Comments